కరోనా వైరస్.. ప్రపంచానికి ఇప్పుడు ఈ వైరస్ గురించి తప్ప, మరో ముఖ్యమైన టాపిక్ ఇంకేమీ లేదా.? అంటే, ప్రస్తుతానికైతే లేదనే చెప్పాలి. ఎందుకంటే, అంతలా కరోనా వైరస్ (Covid 19 Corona Virus Stay Strong Stay Safe) ప్రపంచ దేశాల్ని వణికిస్తోంది. కరోనా వైరస్ ఎక్కడైతే పుట్టిందో, అక్కడ ఆ వైరస్ పట్ల భయం, బెంగ లేదు. చాలా దేశాలు కరోనా వైరస్ నుంచి విముక్తి పొందాయి.
140 కోట్ల మంది జనాభా వున్న భారతదేశంలో కొంతమందికి ‘భయం’ కలిగించడంలో పైశాచికానందం. మరికొందరికి, అలా పుట్టే భయం కారణంగా తమకు లభించే ఆదాయం మీద వ్యామోహం. ఇంకొందరికి అదే వ్యాపకం. ఔను, ఇది నిష్టుర సత్యం.
కొందరు వైద్యులున్నారు.. కరోనా బాధితులకి ఏం వైద్యం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. కానీ, వైద్యం చేస్తున్నారు.. లక్షలు గుంజేస్తున్నారు కరోనా బాధితుల నుంచీ, వారి కుటుంబాల నుంచీ. పోనీ, కరోనా బాధితుల ప్రాణాలైనా నిలబెడుతున్నారా.? అటే అదీ లేదు.
Also Read: Corona Virus Covid 19: మనిషి వర్సెస్ మానవ మృగం
ఇక్కడ, పరాన్న జీవుల గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాలి. కరోనా వైరస్ సోకిందా.? ఆ ఫంగస్ దాడి చేయొచ్చు.. ఈ ఫంగస్ మిమ్మల్ని చంపేయొచ్చు.. అంటూ సమాజంలో అలజడి రేపుతున్నాయి. అసలు కరోనా వైరస్ ఎంత మందికి సోకుతోంది.? ఎంతమందిని చంపేస్తోంది.? ఎంతమంది కరోనా వైరస్ అనే మహమ్మారిని జయిస్తున్నారు.? వంటి లెక్కలు ఈ పరాన్న జీవులకు అనవసరం. మీడియాలో మెజార్టీ భాగం ఈ ‘పరాన్న జీవి’ పాత్ర పోషిస్తోంది.
చాలామందికి ఇంట్లో చికిత్సతోనే కరోనా నుంచి విముక్తి లభిస్తోంది. కొంతమందికి అసలు కరోనా వచ్చిన సంగతే తెలియడంలేదు. చాలా తక్కువమందికి మాత్రమే ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరం ఏర్పడుతోంది. అందులోనూ చాలా తక్కువమందికే ఐసీయూ చికిత్స అవసరమవుతోంది. కరోనా బారినపడి కోలుకున్నవారిలో కొంతమందికి మాత్రమే బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ సహా ఇతర సమస్యలు వచ్చే అవకాశం వుంది.
Also Read: కోవిడ్ 19 వ్యాక్సినేషన్: రేటు, హీటు.. ఎందుకీ డిబేటు.?
మంచి మంచి డాక్టర్లున్నారు దేశంలో. వాళ్ళంతా ‘ప్రజలెవరూ భయపడొద్దు..’ అంటూ నెత్తీ నోరూ బాదుకుంటున్నారు. కానీ, ఓ సెక్షన్ మీడియా.. సమాజం పట్ల బాధ్యతలేని కొందరు వ్యక్తులు మేధావుల ముసుగులోనో, ఇంకో ముసుగులోనో ప్రజల్ని భయపెడుతూనే వున్నారు. ఆ భయమే కొన్ని ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులకు కాసుల పంట పండిస్తోంది.
ఆ కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలే, మీడియాలోని పరాన్న జీవుల్ని వాడుకుంటున్నాయి.. భయాల్ని రేకెత్తిస్తున్నాయి. జర జాగ్రత్త.. కరోనా వైరస్ కంటే భయం (Covid 19 Corona Virus Stay Strong Stay Safe) అత్యంత ప్రమాదకరమైనది.