Table of Contents
Devotion Money Business.. దేవుడి ముందు ఎవరైనా సమానమే.! డబ్బున్నోడు, డబ్బు లేనోడు అన్న తేడాలు దేవుడి ముందర వుండవ్.! వినడానికి ఎంత బావున్నాయో కదా ఈ మాటలు.? మరి, నిజమేంటి.?
పైన చెప్పుకున్న గొప్ప గొప్ప మాటల్లో అస్సలు వాస్తవం లేదు. దేవుడి ముందు అందరూ సమానం కాదు. డబ్బున్నోడిని ఒకలా, డబ్బు లేనోడిని ఇంకోలా చూస్తున్నాడు దేవుడు. దేవుడి సంగతేమోగానీ, దేవుడికీ, భక్తుడికీ మధ్య వుండే పూజారి.. డబ్బులిస్తే ఒకలా మంత్రాలు చదువుతాడు, ఇవ్వకపోతే ఇంకోలా కసురుకుంటాడు.
సో, సమానత్వం అన్నది ఉత్తమాట. నీతులు చెప్పడానికే తప్ప, పాటించడానికి కాదన్నట్టుగా హైందవ ధర్మాన్ని భ్రష్టుపట్టించేశారు. ఇంతకీ, ఎవరలా భ్రష్టు పట్టించేసింది.?
భక్తితో గుడికి వెళ్ళి దేవుడ్ని దర్శించుకోవాలిగానీ, జేబులో డబ్బులున్నాయో లేదో చూసుకుని దేవాలయానికి వెళ్ళడమేంటట.! అక్కడికెళ్ళాక, ‘కేటగిరీ’ని బట్టి క్యూ లైన్లు ఎందుకట.!
దేవుడి కంటే గొప్పోళ్ళా ఈ వీఐపీలు.!
వీఐపీలకు ఒకలా, వీవీఐపీలకు ఇంకోలా.. సామాన్యులకేమో మరొకలా.! మరి, సమతా స్ఫూర్తి ఎక్కడ.? ఆ ఒక్కటీ అడక్కూడదంతే. మాటల్లోని సమతాస్ఫూర్తి.. మనుషులంతా ఒక్కటేనన్న భావన.. చేతల్లో అస్సలు కనిపించకపోవడమే నయా దైవత్వం అనుకోవాలా.?
హైద్రాబాద్ శివార్లలో అత్యద్భుత ఆధ్మాత్మిక వేదికను నిర్మించారు. సమతామూర్తి.. అంటూ శ్రీరామానుజ విగ్రహాన్ని భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు.
పైన, అత్యంత ఎత్తయిన విగ్రహం.. కిందనేమో పూర్తిగా బంగారంతో రూపొందించిన విగ్రహం.. వీటికి తోడు 100కి పైగా దేవాలయాల సంగమం.. వెరసి, నిజంగానే ఇదొక దివ్యక్షేత్రం.. అనడం అతిశయోక్తి కాదు.
కానీ, ఏం లాభం.? రాజకీయ నాయకులపై రాజకీయ ప్రశంసలకు ఇదొక వేదిక అయిపోయింది. సామాన్యుల సందర్శనకు అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయ్. మొత్తానికి ‘వేడుకలు’ ముగిశాయి. సాధారణ దర్శనాలకు లైన్ క్లియర్ అయ్యింది. టిక్కెట్లు పెట్టేసి, సమతాస్ఫూర్తిని పంచేస్తున్నారు నిర్వాహకులు.
రేటు ముందు ఓడిపోతున్న సమతా స్ఫూర్తి.!
500 రూపాయల వరకు టిక్కెట్ల ధర పెడదామనుకున్నారుగానీ.. కాస్త సామాన్యుడిపై కరుణ చూపి ప్రస్తుతానికి ఆ ధరను 150 రూపాయలకే పరిమితం చేశారు. భవిష్యత్తులో ‘రేటు’ మారుతుందట.
మారడం అంటే తగ్గుతుందనా.? పెరుగుతుందనా.? తగ్గే అవకాశమైతే లేదు. ఎంత పెరగొచ్చు.? మూడొందలో ఐదొందలో ఖచ్చితంగా అయి తీరుతుంది.
సమతా స్ఫూర్తి పొందడానికి డబ్బులు ఖర్చు చేసి వెళ్ళాలా.? అంటే, 100కి పైగా దేవాలయాల్ని ఒకేసారి చూసెయ్యొచ్చు కదా.? అద్గదీ అసలు సంగతి. హిందుత్వం అంటే భలే వ్యాపారం అయిపోయింది మరి.!
శీఘ్రమట.. అతి శీఘ్రమట.!
ప్రముఖ హిందూ దేవాలయన్నిటిలోనూ దాదాగాపుగా రకరకాల టిక్కెట్ల ధరలున్నాయ్. శీఘ్ర, అతి శీఘ్ర దర్శనాల కోసం టిక్కెట్ల ధరల్ని భారీగానే నిర్ణయించారు, వీలైనప్పుడల్లా పెంచేసుకుంటూ వెళుతున్నారు.
Also Read: రామప్పకి యునెస్కో గుర్తింపు సరే, మనమెప్పుడు గౌరవిస్తాం.?
సర్వదర్శనాలు కూడా వుంటాయ్‌గానీ, అటువైపుగా వెళితే సామాన్యుడికి ‘నరకం’ కనిపిస్తుందనడం నిస్సందేహం. మరి, దేవాలయాల నుంచి వచ్చే ఆదాయం ఏమైపోతోంది.? ఆ ఒక్కటీ అడక్కూడదంతే.
దేవుడి పేరుతో దోపిడీ.!
ఇంతకీ, ఆ ఆదాయాన్ని భక్తుల కోసమే ఖర్చు చేస్తున్నామంటూ వీఐపీల సేవలో తరిస్తుంటాయి ఆయా దేవాలయాల పాలక మండళ్ళు. దేవాలయానికి పాలక మండలి ఏంటి పాపిష్టి కాలం కాకపోతే.?
దేవాలయాల మాటున అలా దోపిడీ జరుగుతోంది కాబట్టి, ఇదిగో ‘స్వామీజీలు’ ఇలా ప్రైవేటు ఆధ్మాత్మిక కేంద్రాల్ని ఏర్పాటు చేసేసి, పబ్లిగ్గానే దండుకుంటున్నారు. అద్గదీ అసలు సంగతి.