అంకెలు అటూ ఇటూ వుండొచ్చు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం ఏదైనా కావొచ్చు. కానీ, డోనాల్డ్ ట్రంప్ గెలిచేశాడు. ఫలితాలు పూర్తిగా వెలువడకుండానే ట్రంప్ గెలిచాడని చెప్పడమేంటి.? (Donald Trump Vs Joe Biden) అంటే, అదే మరి.. ట్రంప్ గెలుపు అంటే. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో జో బిడైన్ పోటీ పడుతున్న విషయం విదితమే.
ప్రచారం సందర్భంగా ట్రంప్ (Donald Trump) దూకుడు కనిపించింది.. బిడెన్ (Joe Biden)జోరు కనిపించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈసారి ఆషామాషీగా వుండవని చాలామంది అనుకున్నారు. అందుకు తగ్గట్టే ఫలితాలు వెల్లడవుతున్నాయి. కానీ, ఇదెలా సాధ్యం.?
కరోనా వైరస్ విషయంలో ట్రంప్ ఫెయిలయ్యాడు.. చాలా వెకిలి చేష్టలు చేశాడు.. కానీ, ట్రంప్‌కి ఈ స్థాయిలో ఓటర్ల నుంచి మద్దతు ఎలా లభిస్తోంది.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. నిజానికి, ట్రంప్ చుట్టూ జరిగిన ప్రచారాన్ని పరిగణనలోకి తీసుకుంటే, చిత్తు చిత్తుగా ఆయన ఓడిపోయి వుండాలి.
బిడెన్ రికార్డు స్థాయి విజయాన్ని అందుకుని వుండాలి. కానీ, అలా జరగడంలేదు. ఏమో.. ట్రంప్ ఇంకోసారి అమెరికా అధ్యక్షుడయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదనేంతలా ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి.
‘గెలిచినా ఓడినా.. నైతిక విజయం నాదే’ అన్నట్లుగా వుంది ట్రంప్ పరిస్థితి. ఆయన మద్దతుదారులూ ఇదే మాట చెబుతున్నారు. టఫ్ ఫైట్ వుందని తెలిసీ, ‘సంబరాలకు సిద్ధమైపోదాం..’ అంటూ ట్రంప్ ప్రకటన చేసేయడం గమనార్హం. బిడెన్ కూడా అదే మాట మీద వున్నాడు.
ఏమో, ఏం జరుగుతుందోగానీ.. ప్రపంచమంతా ఈ ఎన్నిక ఫలితం కోసం ఎదురుచూస్తోంది. ప్రధానంగా భారతదేశం, అమెరికా అధ్యక్ష ఎన్నిక ఫలితం గురించి ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోంది.
వీసా వ్యవహారాలు వంటివాటిల్లో భారతీయులు ట్రంప్ పట్ల కొంత వ్యతిరేకతతో వున్నా, ఇతరత్రా విషయాల్లో ట్రంప్‌కి భారతీయుల నుంచి మద్దతు బాగానే లభించినట్లుంది. ఎవరు గెలిచినాసరే ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదాన్నే జపిస్తారు. ఆ సంగతి ప్రపంచమంతటికీ తెలుసు. కానీ, అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే.. ప్రపంచమంతటికీ సందడే. అమెరికా ప్రపంచానికే పెద్దన్న మరి.!