DRDO Unmanned Fighter Aircraft ఒకప్పుడు యుద్ధాలంటే ఆ కథ వేరు.! ఇప్పుడు యుద్ధాల తీరు మారిపోయింది.
అత్యాధునిక యుద్ధ విమానాలు.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందుతున్న జలాంతర్గాములు.. సుదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణులు.. ఇదీ ఇప్పటి పరిస్థితి.
భవిష్యత్తు ఎలా వుండబోతోంది.? యుద్ధ విమానాల్ని పైలట్లు నడపాల్సిన పనిలేదు. ఏమో, భవిష్యత్తులో జలాంతర్గాముల విషయంలోనూ అదే జరుగుతుందేమో.!
ఇంతకీ, మానవ రహిత యుద్ధ విమానాల్లో మనం ఎక్కడున్నాం.? ప్రస్తుతానికైతే విదేశాల నుంచి కొన్ని యుద్ధ విమానాల్ని దిగుమతి చేసుకుంటున్నాం.
DRDO Unmanned Fighter Aircraft.. డ్రోన్లు కావు.. మానవ రహిత యుద్ధ విమానాలు.!
వీటిని ప్రస్తుతానికి డ్రోన్లుగా వ్యవహరిస్తున్నాం. పూర్తిస్థాయి యుద్ధ విమానం.. పైలట్ లేకుండా ఎగిరితే ఎలా వుంటుంది.?
ఇదిగో, ఇలా వుంటుందంటూ భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డిఆర్డీఓ) తాజాగా ఓ అత్యద్భుతమైన ప్రయోగాన్ని చేసి చూపించింది. ప్రయోగాత్మక మానవ రహిత యుద్ధ విమానాన్ని గాల్లోకి ఎగిరేలా చేసింది.
కర్నాటకలోని చిత్రదుర్గ్లోగల ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో ఈ మానవ రహిత యుద్ధ విమానాన్ని విజయవంతంగా పరీక్షించారు.
గాల్లో తేలినట్టుందే.!
పూర్తి స్వయం చలితంగా ఈ యుద్ధ విమానం ఖచ్చితమైన ఎత్తులో టేకాఫ్ అవుతుంది. నావిగేషన్, స్మూత్ టచ్ డౌన్ వంటివి కూడా సమర్థవంతంగా నిర్వహించుకుంది.
డీఆర్డీఓ డిజైన్ చేసిన ఈ యుద్ధ విమానంలో, ఎయిర్ ఫ్రేమ్, అండర్ క్యారేజ్, నియంత్రణ వ్యవస్థ.. అన్నీ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందినవే కావడం గమనార్హం.
భవిష్యత్తు అంతా మానవ రహిత యుద్ధ విమానాలదే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఈ విభాగంలో భారతదేశం ముందు ముందు మరిన్ని సంచలనాలకు కేంద్ర బిందువు కానుందన్నది నిస్సందేహం.
Also Read: నువ్వు నాశనం చేసిన మట్టి.! నిన్ను ఇంకా బతికిస్తోంది.!
చివరగా, ఇప్పటికైతే.. ఇది చిన్నదే.! కేవలం ప్రయోగాత్మకంగా దీన్ని పరిశీలించారంతే. తొలి అడుగు ఇలాగే వుంటుంది.
మానవ రహిత యుద్ధ విమానాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. అదీ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసుకుంటే.. శతృదేశాలు, భారత్ వైపు కన్నెత్తి చూసేందుకూ భయపడతాయ్.!