Table of Contents
Drushyam 2 Review.. విధి లేని పరిస్థితుల్లో ఓ యువకున్ని చంపేస్తుంది రాంబాబు కుటుంబం. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు పోలీసుల్నిమాయ చేస్తాడు రాంబాబు ‘దృశ్యం’ సినిమాలో.
పెద్దగా చదువు లేని ఓ సామాన్యుడు సినిమాలు చూసి, వాటి ద్వారా పెంచుకున్న జ్ఞానంతో ఏకంగా పోలీసు వ్యవస్థనే మాయ చేసి,తన కుటుంబాన్ని కాపాడుకోవడం.. అనే ఓ సున్నితమైన పాయింట్ చుట్టూ అద్భుతంగా అల్లిన సన్నివేశాలు ‘దృశ్యం’ సినిమాని చాలా ప్రత్యేకమైన చిత్రంగా మార్చాయి. మరి, దాన్నుంచి సీక్వెల్ వస్తోందంటే, ఆ సినిమా పట్ల ఆసక్తి, ఉత్కంఠ పెరగకుండా ఉంటాయా.?
ఆ అంచనాలకు తగ్గట్టు ‘దృశ్యం 2’ రూపొందిందా.? రెండో దృశ్యంలో ఏం చూపించారు.? ఆ రెండో దృశ్యంలోకి మనమూ తొంగి చూద్దాం పదండి.
Drushyam 2 Review.. కథా కమామిషు..
గతం గతహ.. చేదు జ్ఞాపకాల్ని మర్చిపొమ్మని కుటుంబ సభ్యులకు చెబుతుంటాడు రాంబాబు. అయితే, భార్య, ఇద్దరు కూతుళ్లు పోలీసు జీపు శబ్ధం వినిపిస్తే చాలు భయపడుతూ ఉంటారు. రాంబాబు మాత్రం ఓ సినిమా ధియేటర్‌కి ఓనర్ అవుతాడు. సినిమా నిర్మాతగా మారాలనుకుంటాడు. ఆ సినిమాకి కథ కూడా తానే అందించే ప్రయత్నంలో ఉంటాడు. ఇంతలో ఊహించని మలుపు.

రాంబాబు కుటుంబం చంపేసిన యువకుడి అస్థిపంజరాన్ని పోలీస్ స్టేషన్‌లో గుర్తించిన పోలీసులు ఆ తర్వాత రాంబాబును అరెస్టు చేస్తారు. రాంబాబు నేరం అంగీకరిస్తాడు. మరి రాంబాబుకు శిక్ష పడిందా.? రాంబాబు కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న బాధితుడి కుటుంబం ఆ పని చేయగలిగిందా.? పోలీసు వ్యవస్థ ఈ కేసులో విజయం సాధించిందా.? ఇవన్నీతెరపై చూడాల్సిందే.
విక్టరీ వెంకటేష్ వన్ మ్యాన్ షో..
విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) రీమేక్ సినిమాల స్పెషలిస్ట్. నిజానికి వెంకటేష్ నటిస్తే అది రీమేక్ సినిమాలా ఉండదు. అదీ వెంకటేష్ ప్రత్యేకత. ‘నారప్ప’గా ఒదిగిపోయిన వెంకటేష్, ఇప్పుడు మళ్లీ ‘రాంబాబు’గా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసేస్తాడు. వంక పెట్టడానికి వీల్లేనంతగా రాంబాబు పాత్రలో వెంకటేష్ జీవించేశాడు.
తెలుగులో రాంబాబు పాత్రకి వెంకటేష్‌ని తప్ప మరో హీరోని ఊహించుకోలేం. మీనా తన అనుభవాన్ని రంగరించింది. ఆమె నటన ఈ సినిమాకి మరో ఎసెట్. రాంబాంబు కూతుళ్లుగా నటించిన కృతికా, ఎస్తేర్ చాలా బాగా చేశారు. కొడుకును కోల్పోయిన తల్లిగా నదియా, ఆమె భర్తగా నరేష్ ఓకే. సంపత్ గతంలో ఇలాంటి పాత్రలు పలు సినిమాల్లో చేశారు. అతినికిది కొత్తదేమీ కాదు.
రాజేష్ పాత్ర ఓ ట్విస్ట్. తనికెళ్ల భరణి చిన్న పాత్రే అయినా ఇంట్రెస్టింగ్ రోల్ చేశాడు. జబర్దస్థ్ కమెడియన్లు చంటి, అవినాష్ తదితరులు ఆకట్టుకున్నారు. చమ్మక్ చంద్రకి కొంచెం నిడివి ఉన్న పాత్ర దొరికింది. షఫీ, పూర్ణ, మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగానే చేశారు.
Also Read: Priyanka Chopra ‘ప్రేమకథ’కి ఏమైంది చెప్మా.?
సాంకేతిక అంశాల గురించి మాట్లాడుకోవాలంటే, ముందుగా సినిమాటోగ్రఫీకి ఫుల్ మార్క్ ఇచ్చేయాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. పాటలు అంతే. ఎడిటింగ్ బావుంది. ఫస్టాఫ్ కొంత సాగదీతగా అనిపిస్తుంది.
Drushyam 2 Review ఫైనల్ టచ్..
హిట్టయిన సినిమాకి సీక్వెల్ అంటే మాటలు కాదు. ఓటీటీలో ఇప్పటికే ఉన్న మలయాళం సినిమాని చాలా మంది తెలుగు ప్రేక్షకులూ చూసేశారు. కానీ, ‘దృశ్యం 2’ చూస్తున్నంత సేపూ, స్క్రీన్ మీద నుంచి కళ్లు పక్కకి కదలవు. అది వెంకటేష్ మ్యాజిక్ అనుకోవాలి. అయితే, ఫోరెన్సిక్ విషయంలో దర్శకుడు సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు. అదొక్కటీ కన్విన్సింగ్ అనిపించదు.
ఐపీఎస్ చదివిన పోలీస్ అధికారిని బోల్తా కొట్టించడం, సామాన్యుడికి ఎలా సాధ్యం.? ‘అదృష్టం’ అని ప్రస్థావించి దర్శకుడు జస్టిఫై చేసేసుకున్నాడు. దానికి ప్రేక్షకులూ కన్విన్స్ అయిపోతారు. ఓవరాల్‌గా ‘దృశ్యం 2’ (Drushyam 2 Review Telugu) పక్కా ఫ్యామిలీ మూవీ. ధియేటర్‌లో విడుదలయ్యుంటే ఇంకా బావుండేదేమో.
– yeSBee