F3 Movie Review..అనిల్ రావిపూడి దర్శకత్వంలో చాన్నాళ్ళ క్రితం వచ్చిన ‘ఎఫ్2’ సినిమాని చూసి ఇప్పటికీ పడీ పడీ నవ్వేవారుంటారు. ఇదేం సినిమా.? అని చిరాకు పడేవారూ వుంటారు.
పిచ్చి కామెడీ.. అన్న మాటకి కేరాఫ్ అడ్రస్ ‘ఎఫ్2’ సినిమా. పిచ్చి కామెడీ అంటే, కామెడీ ఎక్కువగా వుంటుందని కాదు అర్థం.. అది పిచ్చితనంతో కూడిన కామెడీ అని.!
హనీ ఈజ్ ది బెస్ట్.. అంటూ ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటుంటుంది మెహ్రీన్.. అందులోని తన మేనరిజం గురించి. ఆమె అలా అంటున్నప్పుడల్లా, ఆ సినిమాలోని ఆమె వెర్రి పాత్రే గుర్తుకొస్తుంది చాలామందికి. తమన్నా సంగతి సరే సరి.
విక్టరీ వెంకటేష్ కామెడీ టైమింగ్ మాత్రం సూపర్బ్. ఆ టైమింగ్‌ని మ్యాచ్ చేయడమంటే మామూలు విషయం కాదు. ఈ విషయంలో వరుణ్‌తేజ్‌ని అభినందించి తీరాలి. ‘ఎఫ్2’ సినిమాకి సంబంధించి వీళ్ళిద్దరే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్.!
మరిప్పుడు. ‘ఎఫ్3’ సినిమా వచ్చింది. దీని సంగతేంటి.? ఇంకేముంటుంది.? అంతా రొట్టకొట్టుడే.! దీన్ని కామెడీ అనాలా.? అంటే, ‘మీకు హాస్య గ్రంధులు లేవు’ అని చిత్ర దర్శక నిర్మాతలు ప్రశ్నించొచ్చుగాక.! కానీ, ఇది కామెడీ కాదు.
F3 Movie Review.. దించేశాడంతే.!
చిరంజీవి హీరోగా చాలా ఏళ్ళ క్రితం వచ్చిన ‘చంటబ్బాయ్’ సహా చాలా సినిమాల్లో వుండే, ‘పెద్దింటి మహారాజు.. తప్పిపోయిన తన వారసుడి రాక కోసం ఎదురుచూడటం.. ఆ స్థానంలోకి ఇంకెవరో ప్రవేశించి హంగామా చేయడం..’ అనే కాన్సెప్ట్ ఈ ‘ఎఫ్3’లో దించేశారు.

ఇదొక్కటే కాపీ కొట్టారనుకుంటే పొరపాటే.! చాలా సినిమాల్లోంచి ‘కీ’ పాయింట్స్ ‘డంప్’ చేసి పడేశారు. ఓ పదో, పాతికో కామెడీ స్కిట్స్ ఒకేసారి చూస్తే ఎలా వుంటుంది.? అలాగే వుంటుంది తప్ప, కథ.. కాకరకాయ్ లాంటివేవీ ఇందులో కనిపించవ్.
తమన్నా, మెహ్రీన్ ‘ఎప్2’లో ఏం చేశారో, ఇందులోనూ అదే చేశారు. కాకపోతే, ఇందులో ఇంకాస్త తేలిపోయారంతే. తెరనిండా బోల్డంత మంది నటులు కనిపిస్తారు. ఈవీవీ సినిమాల్లో కనిపించే హంగామా తరహాలో హడావిడి కనిపిస్తుంటుంది.
అక్కడక్కడా నవ్వులు పూయించారుగానీ, చాలా చోట్ల చికాకు పుట్టించేశారు చాలామంది నటీనటులు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, మ్యూజిక్.. ఇలాంటివన్నీ కూడా ‘ఎఫ్3’ అతి ముందు అస్సలు గుర్తుకు రావు.
వెంకటేష్ మీద జాలి పడాల్సిందేనా.?
విక్టరీ వెంకటేష్‌ని ప్రత్యేకంగా అభినందించాలి.. అదే సమయంలో ఆయన మీద కొంత జాలి పడాలి.
నటుడిగా కెరీర్‌లో చాలా విజయాలు అందుకున్న వెంకటేష్, బేషజాలకు పోకుండా తన పాత్రలో ఒదిగిపోయారు. అందుకు ఆయన్ని అభినందించి తీరాలి. అంత స్టేచర్ వున్న నటుడు కామెడీ పీస్ అయిపోనిందుకు జాలి పడాలి కూడా.
వరుణ్ తేజ్ విషయంలోనూ అంతే. తన పాత్రకు న్యాయం చేశాడు. యంగ్ హీరో కదా, ఇలాంటివి చేస్తే ఈజ్ పెరుగుతుందిగానీ.. నవ్వులపాలైపోయాడన్న కామెంట్లు పెరిగితేనే కష్టం.!
Also Read: కొరటాలకి ‘ఆచార్య’ సెగ.! ఎన్నేళ్ళు వెంటాడుతుందో.!
ఓటీటీ జమానా నడుస్తోంది. ఇలాంటి సినిమాలకు ‘ఫ్యామిలీ’ ముసుగేసి థియేటర్లకు జనాన్ని రప్పించాలనుకుంటే.. అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. ఓ పదిహేను రోజులో, నెల రోజులో వేచి చూస్తే ఓటీటీలో చూసెయ్యొచ్చనుకునే ఆడియన్స్ సంఖ్య పెరిగింది.!
సో, దర్శకుడు అనిల్ రావిపూడి.. కామెడీ పేరుతో ఏదో ఒకటి జనం మీద రుద్దేయాలన్న ఆలోచనలు మానుకుంటే మంచిది.. అన్నది సినిమా చూశాక చాలామంది చెబుతున్నమాట.