Father Of All Bombs.. FOAB గురించి ప్రపంచమంతా ఇప్పుడు ఇంకోసారి కొత్తగా చర్చించుకుంటోంది రష్యా – ఉక్రెయిన్ మధ్య చోటు చేసుకున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో.
దీన్ని యుద్ధం అనాలా.? ఉక్రెయిన్ మీద రష్యా చేపట్టిన సైనిక చర్య అనాలా.? పేరేదైనా పెట్టుకోండి.. ‘ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ని రష్యా గనుక, ఉక్రెయిన్ మీద ప్రయోగిస్తే.. అదో సంచలనమే అవుతుంది.. పెను విధ్వంసాన్ని సృష్టిస్తోంది.
ఖండాంతర క్షిపణులు.. లేజర్ గైడెడ్ బాంబ్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే, సాంకేతికత చాలా చాలా అభివృద్ధి చెందింది. కూర్చున్న చోట నుంచి కాలు కదపకుండానే యుద్ధాలు చేసెయ్యొచ్చనేంతలా సాంకేతిక విశృంఖలంగా పెరిగిపోయింది.. యుద్ధ రంగానికి సంబంధించి.
సముద్రంలో నీటి అడుగున్న రోజుల తరబడి మాటు వేసే న్యూక్లియర్ సబ్‌మెరైన్లు.. ఆకాశంలో రివ్వున ఎగిరిపోతూ, నేలపై ఎక్కడైనా విరుచుకుపడగల బాంబర్ విమానాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే వ్యవహారం చాలానే వుంది.
ఇదంతా మనిషి బతకడానికా.? చావడానికా.? అంటే, ముమ్మాటికీ చావడానికే. తమ దేశ భూ భాగాన్ని రక్షించుకోవడం కోసం.. దేశాలు ఆయుధ సంపత్తిని పెంచుకోవడం వరకూ ఫర్లేదు.
కానీ, తయారు చేసుకున్న లేదా సమకూర్చుకున్న ఆయుధాల్ని ప్రపంచ వినాశనం కోసం ఉపయోగిస్తే.? ఆధిపత్య పోరుకు తెరలేపి.. నిత్యం ఎక్కడో ఓ చోట అలజడికి కారణమైతే.. అంతకన్నా దారుణం ఇంకోటుండదు.!
ఫాదర్ బాంబు.. మదర్ బాంబు.!
ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ మాత్రమే కాదు.. మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ (MOAB) కూడా వుందండోయ్. అమెరికా దగ్గర వున్నది MOAB. రష్యా అభివృద్ధి చేసింది FOAB. అమెరికా వద్ద వున్న బాంబు కంటే, రష్యా వద్దనున్నది సుమారు నాలుగు రెట్లు శక్తివంతమైనది.

మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ పేలితే వచ్చే శక్తి 10 టీఎన్‌టీలు కాగా, ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ సామర్థ్యం ఏకంగా 44 టీఎన్‌టీలు. సో, ఈ బాంబులు పేలితే అణు బాంబుల స్థాయిలో విధ్వంసం చోటు చేసుకుంటుందన్నమాట. అయితే, ఇవి అణు బాంబులు కావు. అదీ అసలు విశేషం. విశేషమేంటి పిండాకూడు.. ఇది వినాశనం.
అమెరికా, రష్యా తరహాలోనే చైనా కూడా ఇలాంటిిదే ఓ అతి పెద్ద బాంబుని తయారు చేసింది. 2019లో దీన్ని పరీక్షింగా, దీని శక్తి విషయమై భిన్న వాదనలున్నాయి. ఓ సైనిక స్థావరాన్ని ఈ చైనా బాంబు పూర్తిగా విధ్వంసం చేసేస్తుందట.
మరి, అణు బాంబుల సంగతేంటి.?
ప్రపంచంలో చాలా దేశాల వద్ద అణు బాంబులున్నాయి. భారతదేశం వద్దా వున్నాయి.. పొరుగుతున్న పాకిస్తాన్ వద్ద కూడా వున్నాయి. అగ్ర రాజ్యాల సంగతి సరే సరి. కానీ, అణు బాంబులు ప్రయోగించడానికి ఏ దేశమూ సాహసించబోదు. వాటి వల్ల వచ్చే నష్టం ఆ స్థాయిలో వుంటుంది మరి.
Also Read: సర్వరోగ నివారిణి ‘గాడిద గుడ్డు’.. ఔనా.?
అందుకే, అణు బాంబుల స్థాయిలో విధ్వంసాలు సృష్టించేలా, పెద్దగా రేడియేషన్ ప్రభావం లేని ‘మదర్’, ‘ఫాదర్’ లాంటి బాంబుల్ని తయారు చేయడం ద్వారా.. సరికొత్త విధ్వంసాలకు తెరలేపారన్నమాట.
ఏ రాయి అయితేనేం పళ్ళూడిపోవడానికి.. అన్నట్టు, బాంబు చిన్నదైతేనేం, పెద్దదైతేనేం.. అణుబాంబు అయితేనేం, ఇంకో బాంబు అయితేనేం.. జరిగేది విధ్వంసమే కదా.!