Funky Review Vishwaksen.. అసలు థియేటర్లకు ప్రేక్షకులు ఎందుకు రావడంలేదు.? సగటు సినీ ప్రేక్షకుడ్ని, సినిమాలెందుకు ఆకర్షించలేకపోతున్నాయి.?
ఈ విషయమై చాలా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. సరైన కథ, కథనాలు లేని సినిమాలొస్తున్నాయనీ, సినిమా టిక్కెట్ల ధరలు పెరిగిపోయాయనీ.. ఇలా చాలా వాదనలున్నాయి.
సినిమా టిక్కెట్ ధర కంటే, పాప్‌కార్న్ ధర ఎక్కువ.. అనే వాదనా లేకపోలేదు. కారణాలేవైతేనేం, సినిమాని థియేటర్లలో కాకుండా, ఓటీటీలో వస్తే చూద్దాంలే.. అనుకుంటున్నారు మెజార్టీ ప్రేక్షకులు.
ఈ మధ్యకాలంలో అయితే, ఓటీటీలో సినిమాలు చూడ్డానికి కూడా సగటు సినీ ప్రేక్షకుడు ఇష్టపడ్డం లేదు. సినిమాకి మించిన ఎంటర్టైన్మెంట్ల వైపు మొగ్గు చూపుతున్నారు.
ఇప్పుడిదంతా ఎందుకంటే, బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్న విశ్వక్‌సేన్, ఈసారి తన సహజ శైలికి భిన్నంగా ‘ఫంకీ’ సినిమా ప్రమోషన్స్ చేశాడు.
ఎక్కడా ఎక్కువ ఏమీ మాట్లాడలేదు.. ఎలాంటి వెకిలి వేషాలూ వేయలేదు. అతి పోకడకలకు అసలే పోలేదు. నిర్మాత నాగవంశీ ఓ సందర్భంలో ‘హీరోయిన్ అదిరిపోద్ది.. ఆమె కోసం సినిమాకి వస్తారు ఆడియన్స్’ అన్నాడు.
విశ్వక్ సేన్ సరసన కయాదు లోహర్ ఈ సినిమాలో హీరోయిన్. అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కింది ‘ఫంకీ’ సినిమా.
సినిమాలో సినిమా కథ.! హీరో ఓ సినిమాని తెరకెక్కిస్తాడు.. బడ్జెట్ అదుపు తప్పేసరికి, నిర్మాత ఆసుపత్రి పాలవుతాడు. అప్పుడు నిర్మాత కూతురు రంగంలోకి దిగుతుంది.
ఆ తర్వాత సినిమా తెరకెక్కిందా.? దర్శకుడికీ నిర్మాత కుమార్తెకీ మధ్య లవ్ ఎలా జనరేట్ అయ్యింది.. ఇదంతా మిగతా కథ.
Funky Review Vishwaksen.. సినిమా ప్రమోషన్ల గట్టిగానే చేశారుగానీ..
‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్, ఈ సినిమాలో కామెడీ ఇరగదీసేశాడంటూ సినిమా ప్రమోషన్లు చేశారు. ప్రమోషన్ల సందర్భంగా కొన్ని కామెడీ డైలాగుల్ని ‘ఆహా ఓహో’ అంటూ ప్రమోట్ చేశారు.
ప్చ్.. సినిమాకి అస్సలేమాత్రం హైప్ రాలేదు. థియేటర్లలో అస్సలేమీ నవ్వులు లేవు. కొంత ఎమోషనల్ డ్రామాకి ట్రై చేశారు.. అదీ వర్కవుట్ కాలేదు.
ఆద్యంతం సాగతీత.. అన్నట్లుగా సాగింది సినిమా. సినిమాకి కాస్త ఊరట ఏంటంటే, హీరోయిన్ అందంగా వుంది. అంతే.!
అనుదీప్ వన్ లైనర్స్ గురించి చాలా పాజిటివ్ కామెంట్లు చూశాం సినిమా రిలీజ్‌కి ముందు. సినిమాలో చాలానే వున్నాయ్.. కానీ, ఏవీ పండలేదు.
హాయిగా నవ్వుకునే సన్నివేశాలు పెద్దగా లేవ్. మనకి మనమే కితకితలు పెట్టుకుని నవ్వుకోవాలేమో.. టిక్కెట్ కొనుక్కుని థియేటర్లకు వెళ్ళినందుకు.
భీమ్స్ మ్యూజిక్ నిరాశపర్చింది. సినిమాటోగ్రఫీ సహా మిగతా ఏ విభాగమూ, సినిమాకి మంచి లుక్‌ని తీసుకురాలేకపోయాయి. నిర్మాణపు విలువలు సైతం, సినిమాకి తగ్గట్టుగా వున్నాయంతే.
ఓవరాల్‌గా విశ్వక్ సేన్‌కి ఇంకోసారి నిరాశ ఎదురయ్యింది. కాకపోతే, విశ్వక్ సేన్ బాగానే చేయడానికి ప్రయత్నించాడు. అతని ప్రయత్నాన్ని తప్పు పట్టలేని పరిస్థితి ఈసారి.
సీనియర్ నటుడు నరేష్‌నీ సరిగ్గా వాడుకోలేకపోయాడు దర్శకుడు. సన్నివేశాల్లో బలం లేదు.. డైలాగ్స్‌లోనూ పస లేదు. డైరెక్షన్ సంగతి సరే సరి.
కామెడీ బాగా పేలితే, కథ అలానే కథనాల గురించి ఆలోచించే పరిస్థితే వుండదు సగటు ప్రేక్షకుడి దృష్టిలో. ఆ కామెడీ లేక, కథ కూడా కుదరక.. ‘ఫంకీ’ ఓ వృధా ప్రయాసగా మిగిలిపోయిందంతే.
సినిమాకి డైలాగులు విడిగా రాసేసుకున్నట్లుంది తప్ప, కథకి అనుగుణంగా రాసినట్లు అనిపించవు చాలావరకు. వన్ లైనర్స్ చాలు.. సినిమాకి ఇంకేం అక్కర్లేదన్న భావనతో ‘టేకిట్ గ్రాంటెడ్’ అనుకున్నారేమో.!
కొన్ని డైలాగ్స్ నటీనటులు పలుకుతోంటే, లిప్ సింక్ అస్సలు సెట్ కాలేదు. సినిమా తీసేశాక, నచ్చిన డైలాగులు డబ్బింగ్ చెప్పించారా.? అన్న అనుమానం కలుగుతుంటుంది.
హీరో విశ్వక్ సేన్ మాత్రమే కాదు, ఇకపై నిర్మాత నాగ వంశీ కూడా సినిమా రిలీజ్‌కి ముందు ‘మాట’ విషయంలో జాగ్రత్త పడితే మంచిదేమో.
దర్శకుడు అనుదీప్‌కి కామెడీ విషయంలో ఫ్యాన్స్ బానే వున్నారు. ఇంకోసారి అనుదీప్ నిరాశపర్చాడు. బయట వేసే కామెడీ పంచ్‌లు సరే.. సినిమాలో అస్సలేమాత్రం పస లేని డైలాగులు రాస్తే ఎలా.?
జస్ట్ అనుదీప్ పేరు వేసుకున్నారా.? సినిమా వేరే రకంగా చుట్టేశారా.? అన్న కామెంట్స్ సినిమా నడుస్తున్నంత సేపూ వినిపించాయి ఆడియన్స్ నుంచి.
ఫైనల్ టచ్.. ఫంకీ.. కొట్టేసింది డింకీ.!
