Happy New Year 2025.. 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, 2025 సంవత్సరానికి ఆహ్వానం పలికేశాం. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం కూడా.
ప్రపంచ వ్యాప్తంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సంబరాలు మిన్నంటాయి.! చీకటి – వెలుగు, కష్టం – సుఖం, నష్టం – లాభం, చెడు – మంచి.. ఇవన్నీ జీవితంలో మామూలే.
క్యాలెండర్‌లో తేదీ, నెల, సంవత్సరం మారతాయంతే.! సంవత్సరం మారుతుందిగానీ, తేదీ మాత్రం నెలకోసారి వస్తుంది.! నెల మాత్రం సంవత్సరానికోసారి వస్తుంది.
సూర్యుడు మళ్ళీ అదే తూర్పున ఉదయిస్తాడు.. అదే పశ్చిమాన అస్తమిస్తాడు. ఇందులో ఏ మార్పూ వుండదు. నిజానికి, మనిషికి ప్రతి రోజూ కొత్తదే.! ప్రతి ఉదయం, ఫ్రెష్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లే వుంటుంది.
నిన్న పెండింగ్‌లో పెట్టేసిన పనులు పూర్తి చేయడం, రేపటి కోసం ఈ రోజు ఉదయాన్నే సన్నద్ధమవడం.. ఇవన్నీ మనిషి జీవితంలో పరమ రొటీన్ వ్యవహారం.
అయినా, కొత్తగా సరికొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేసుకోవడం ప్రతి ఏడాది చివరన్నా జరుగుతున్నదే.! తప్పతాగి చిందులేయడానికి అదనంగా ఓ రోజు.. అంతే.!
ఆ సంగతి పక్కన పెడితే, కొంతమంది చెడు అలవాట్లకు స్వస్తి చెప్పేందుకుగాను ‘న్యూ ఇయర్ రిజల్యూషన్స్’ అని చెబుతుంటారు.
అందులోనూ కొంతమందే దానికి కట్టుబడి వుంటారు. ఆ కోణంలో చూస్తే, ఆ కొందరి విషయంలో నిజంగానే కొత్త ఏడాది మంచి మార్పు తీసుకొచ్చినట్లే.
ఏదిఏమైనా.. నూతన సంవత్సరంలో అందరికీ మంచే జరగాలని ఆశిద్దాం.! ముందే చెప్పుకున్నట్లూ ప్రతి రోజూ కొత్తగానే మొదలవుతుంది. అలాగే, 2025 జనవరి 1వ తేదీ కూడా.
కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త సంవత్సరం మన జీవితాల్లో మరింత వెలుగులు నింపాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ.. నూతన సంవత్సర.. అదే, ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.
ఈ ఏడాది ఇది కాస్త వెరైటీ.. మన భారతీయులంతా, ‘ఆంగ్ల సంవత్సరాది’ అని ప్రత్యేకంగా ఈ 2025 సంవత్సరం గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు మరి.
మనకంటూ ఉగాది (తెలుగువారికి) ప్రత్యేకంగా వుంది కదా.. అదే మన తెలుగు సంవత్సరాది.! భిన్నత్వంలో ఏకత్వం.. ఏకత్వంలో భిన్నత్వం మన ప్రత్యేకత. Happy New Year.. Happy New English Year 2025.