Justice For Chaitra దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయపై ఘాతుకం జరిగింది. ఆ ఘటన దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించింది. సోషల్ మీడియా హోరెత్తింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా కుప్పలు తెప్పలుగా కథనాల్ని ప్రసారం చేసింది. రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు.. ఆ ఘటనపై తీవ్రంగా స్పందించాయి. ఆ తర్వాత దిశ ఘటన.. కానీ, మళ్ళీ మళ్ళీ అవే ఘటనలు ఎందుకు పునరావృతమవుతున్నాయ్.?
ఒకటా.? రెండా.? చెప్పుకుంటూ పోతే బోల్డన్ని. ఓ మహిళ అర్థరాత్రి స్వేచ్ఛగా, ధైర్యంగా నడి రోడ్డు మీద తిరగగలిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందన్నాడో మహానుభావుడు. రోడ్ల మీద తిరగడం సంగతి దేవుడెరుగు.. తన ఇంట్లో తాను వుంటున్నా.. మహిళల్ని బతకనివ్వడంలేదు మానవ మృగాలు.
కామా తురాణాం న భయం న లజ్జ
నెలల బాలిక అయినా.. కాటికి కాలు చాపేసిన ముసలమ్మ అయినా.. ఎవరికీ రక్షణ లేకుండా పోతోంది. మృగాళ్ళ కామదాహానికి బాలికలు, వృద్ధ మహిళలు, నడి వయసు మహిళలు.. ఇలా ఏ వయసు వారైనా బలైపోవడం సర్వసాధారణమైపోయింది. మరి, మీడియా ఏం చేస్తోంది.? క్రైమ్ వార్తలకు మీడియాలో పెరుగుతున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకు అనుగుణంగా న్యూస్ ఛానళ్ళు, ప్రింట్ మీడియా.. ఆ తరహా క్రైమ్ స్టోరీస్ పట్ల ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నాయి.
ఇంటర్నెట్ వల్ల తప్పిదాలు జరుగుతున్నాయా.? సినిమాల వల్ల నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయా.? మీడియాలో వచ్చే క్రైమ్ స్టోరీస్ కారణంగానే కొందరిలో నేర ప్రవృత్తి పెరిగిపోతోందా.? ఇవన్నీ కాదు, అసలు నేరం జరిగినప్పుడు నేరస్తులకు సరైన రీతిలో శిక్ష పడుతోందా.? లేదా.? అన్నదే కీలకం ఇక్కడ.
రాజకీయ మృగాళ్ళ సంగతేంటి.?
కొన్ని కేసుల్లో రాజకీయ పార్టీలు, నాయకులు ఒకలా స్పందిస్తారు.. మరికొన్ని కేసుల్లో ఇంకోలా స్పందిస్తుంటారు. ఎక్కడ జరుగుతోంది తేడా.? ఏదన్నా ఘటన జరిగాక, ఆ ఘటనకు వచ్చే పాపులారిటీని బట్టి స్పందించే సినీ ప్రముఖులు కొందరున్నారు. అలా, ఆయా ఘటనలు ఆయా వ్యక్తుల పబ్లిసిటీ కోసం ఉపయోగపడుతున్నాయన్న వాదనా లేకపోలేదు.
బాధిత కుటుంబాల్ని రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు పరామర్శించాలనుకుంటే.. మళ్ళీ అక్కడా శవ రాజకీయమే. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడాల్లేవు.. అందరూ చేస్తున్నది శవ రాజకీయమే. అఘాయిత్యం జరిగితే, అక్కడ కులం కార్డు.. మతం కార్డు తెరపైకొస్తున్నాయి. ఇంతకన్నా నీఛం ఇంకేముంటుంది.?
మారదు, ఈ వ్యవస్థ అస్సలు మారదు. వ్యవస్థ మారనంతవరకు అఘాయిత్యాలు ఆగవు. మహిళలపై అఘాయిత్యాల్ని అడ్డుకునే క్రమంలో ప్రభుత్వాలు చేపట్టే పలు కార్యక్రమాలకు ‘పార్టీల రంగులు’ వేసుకుంటున్నారంటే.. మహిళా భద్రతపై అధికారంలో వున్నోళ్ళకి వున్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇందుకే.. ఇలాంటి నీఛ నికృష్ట రాజకీయాల వల్లనే.. అసలు సమస్య పక్కదారిపడుతోంది.