Table of Contents
బానిస సంకెళ్ళను తెంచుకుని, తెల్ల దొరల నుంచి భారతావని ‘స్వేచ్ఛా’ గీతిక పాడుకుంటోంది. కానీ, ఏం లాభం.? దేశంలో అనేక సంస్థానాలు.. ఆ సంస్థానాధీశులు ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్న రోజులవి. సరిగ్గా ఆ సమయంలోనే ఉక్కు మనిషి, ఉక్కు సంకల్పంతో దేశాన్ని ఒక్కటి చేశారు.
కొందరు తమ సంస్థానాల్ని దేశంలో విలీనం చేసేందుకు ఒప్పుకున్నారు, ఇంకొందరు ససేమిరా అన్నారు. ఒప్పుకున్నవారితో ఒకలా, ఒప్పుకోనివారితో ఇంకోలా.. ఎలాగైతేనేం.. దేశం మీసం తిప్పేలా చేశారు. ఆయనే ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabh Bhai Patel). సర్దార్ 143వ జయంతి సందర్భంగా, గుజరాత్‌లోని సర్దార్ సరోవర్ డ్యామ్‌కి దగ్గర్లో ఏర్పాటు చేసిన 182 మీటర్ల ఎత్తయిన విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఆవిష్కరించారు.
ఉక్కు మనిషి.. ఉక్కు లాంటి విగ్రహం
ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని సైతం ఉక్కులానే తయారు చేశారు. ఇందుకోసం ఏకంగా 18,500 స్టీల్‌ని కాంక్రీట్‌లో కలిపి వాడితే, విడిగా స్ట్రక్చర్ కోసం 6,500 టన్నుల స్టీల్‌ని వాడటం గమనార్హం. 1700 టన్నుల కాంస్యాన్ని ఈ విగ్రహం కోసం వినియోగించారు. విగ్రహ ఛాతీ భాగం వరకూ సందర్శకులు చేరుకునేందుకు లోపలి నుంచి రెండు లిఫ్ట్‌లను ఏర్పాటు చేశారు. 200 మంది నిర్దేశిత ప్రాంతంలో నిల్చుని, ప్రకృతి అందాల్ని ఆస్వాదించడానికి వీలుంది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలుల్ని తట్టుకునేలా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అంతే కాదు, 6.5 తీవ్రతతో వచ్చే భూకంపాలు సైతం ఈ విగ్రహాన్ని ఏమీ చేయలేవు.
వంతెనపైనుంచీ.. పడవల్లోనూ వెళ్ళేలా..
విగ్రహాన్ని సర్దార్ సరోవర్ డ్యామ్‌కి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేశారు. వింధ్యాచల్, సాత్పూర పర్వతాల మధ్య 2,989 కోట్లతో వెచ్చించారు. సాధు బెట్ ఐలాండ్‌లో విగ్రహ ఏర్పాటు జరిగింది. విగ్రహం దగ్గరకు చేరుకునేందుకు ప్రత్యేకంగా 320 మీటర్ల పొడవున బ్రిడ్జి నిర్మించడం గమనార్హం. బ్రిడ్జిపై వాహనాలతోపాటుగా, నదిలో పడవల సాయంతోనూ విగ్రహం వద్దకు చేరుకోవడానికి వీలుంది. సుదూరం నుంచి పటేల్ విగ్రహం ఠీవీగా కన్పిస్తుంది. విగ్రహాన్ని చూస్తే ఎవరికైనాసరే దేశభక్తి ఉప్పొంగాల్సిందే.
హైద్రాబాద్ సంస్థానంపై సైనిక చర్య
సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు వినగానే, ముందుగా హైద్రాబాద్‌పై జరిగిన సైనిక చర్య గుర్తుకొస్తుంది. భారతదేశంలో హైద్రాబాద్ సంస్థానాన్ని విలీనం చేయడానికి నిజాం నిరాకరిస్తే, వల్లభాయ్ పటేల్ కేంద్ర హోంమంత్రిగా భద్రతాదళాల్ని హైద్రాబాద్ వైపు పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో భారత దళాల దెబ్బకి నిజాం సైన్యం చేతులెత్తేయక తప్పలేదు. అలా హైద్రాబాద్, భారతదేశంలో విలీనమయ్యింది. ఆ హైద్రాబాద్ సంస్థానంలో కొంత భాగమే నేటి తెలంగాణ రాష్ట్రం. కొంత భాగం మహారాష్ట్రలోనూ, మరికొంత భాగం కర్నాటకలోనూ విలీనమైన సంగతి తెల్సిందే.
దేశభక్తి సరే.. నరేంద్రమోడీ అహం మాటేమిటి?
సర్దార్ వల్లభాయ్ పటేల్‌కి సముచిత స్థాయిలో గౌరవం దక్కలేదని భారతీయ జనతా పార్టీ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. విగ్రహ ఏర్పాటుకు గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడే నరేంద్రమోడీ సన్నాహాలు చేశారు. ప్రధాని అయ్యాక, శరవేగంగా పనులు ప్రారంభమయి, పూర్తయ్యాయి కూడా. అయితే, ఇందిర పేరుని చరిత్రలోంచి తుడిచేసేందుకే సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుని తెరపైకి తెచ్చి, భారీ ఖర్చుతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారంటూ నరేంద్రమోడీపై కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. ఇంకోపక్క, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి నిధులు ఇవ్వకుండా, పటేల్ విగ్రహం కోసం వేల కోట్లు ఖర్చు చేయడం ఎంతవరకు సబబు? అనే ప్రశ్నలూ పుట్టుకొస్తున్నాయి.
ఇంజనీరింగ్ అద్భుతం
ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ ఏర్పాటుని ఇంజనీరింగ్ నైపుణ్యంగా పేర్కొనవచ్చు. రెండు టవర్ల నిర్మాణం.. వాటి చుట్టూ, మౌల్డింగ్, చివరగా కాంస్య పలకాల్ని అతికించి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చైనాలో కాంస్య పలకాల్ని రూపొందించారు. వందలాది, వేలాది ఫొటోల్ని పరిశీలించి, చివరగా స్టాట్యూ ఫొటోని ఫైనలైజ్ చేశారు. 3 వేల మంది కార్మికులు, 300 మంది ఇంజనీర్లు ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేశారు.