Jagan Medical Colleges Koti Santhakalu.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు, నానా తంటాలూ పడి వైసీపీ నాయకులు ఎలాగైతేనేం, రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు.
కోటి సంతకాల సేకరణ పూర్తయిపోయిందట. కోటికి పైగా సంతకాలు సేకరించామని వైసీపీ చెబుతోంది.
ఈ నెల 18వ తేదీన, ఆ కోటి సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని, గవర్నర్‌కి పులివెందుల ఎమ్మెల్యే జగన్ అందించనున్నారు.
వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టారు.? నిజంగానే, వైద్య కళాశాలలు ప్రైవేటీకరణకు గురవుతున్నాయా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి.
పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీల నిర్మాణం, నిర్వహణ.. అంటోంది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. అది కూడా, కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే జరుగుతోందన్నది ఎన్డీయే ప్రభుత్వ వాదన.
కేంద్ర మంత్రులకు వైసీపీ అందించిన వినతుల నేపత్యంలో, కేంద్ర ప్రభుత్వ పెద్దలూ వైసీపీ నాయకులకు ఇదే విషయాన్ని స్పష్టం చేశారట.
మరెందుకీ కోటి సంతకాల సేకరణ.? అంటే, రాజకీయ పార్టీ అన్నాక జనంలో వుండాలి. జనంలో వుండటానికి వైసీపీ ఎంచుకున్న కార్యక్రమం ఇది.
నిజంగానే కోటి సంతకాలు జరిగాయా.? అంటే, అదో మిలియన్ డాలర్ క్వశ్చన్. నియోజకవర్గాల్లో వున్న వైసీపీ కార్యకర్తలెంతమంది.? ఎన్ని సంతకాలు జరిగాయి.? ఇవన్నీ తెక్కలు తీస్తే, వైసీపీ బండారం బయటపడిపోతుంది.
ఇంతకీ, ఆ కోటి సంతకాలకు సంబంధించిన వినతి పత్రాన్ని వైఎస్ జగన్ ఎలా అందిస్తారన్నది ఇంకో ప్రశ్న. ఇదో చిత్రమైన వ్యవహారం.
వైసీపీ కార్యకర్తలే, కొద్ది రోజులుగా ఆయా వినతి పత్రాల మీద ఎడా పెడా నచ్చిన పేర్లతో సంతకాలు చేసేశారన్నది ఓ వాదన. అబ్బే, అదేం లేదంటూ.. ర్యాలీలు కూడా చేసేసి, బల ప్రదర్శనకు దిగింది వైసీపీ.
చూస్తున్నారుగా.. ఫొటోలో, ప్రభుత్వ వైద్యం.. ప్రజల హక్కు.. అంటోంది వైసీపీ. అదే నిజమైతే, ప్రైవేటు ఆసుపత్రులెందుకు.? వాటిని మేపే ఆరోగ్యశ్రీ ఎందుకు.?
వైసీపీకి చెందిన ఎంతమంది నాయకులకు ప్రైవేటు ఆసుపత్రులున్నాయి.? చెప్పేవి నీతులు.. చేసేవి డాష్ డాష్ పనులు.. అంటే, ఇదే మరి.!
