Jamuna Silver Screen Satyabhama ఆమె వెండితెర సత్యభామ.! ఆమె తప్ప ‘సత్యభామ’ పాత్రలో ఇంకొకర్ని ఊహించుకోలేం.
సీనియర్ నటి జమునకి ‘వెండితెర సత్యభామ’ ఊరికే రాలేదు. తెలుగు తెరపై గడసరి భామ పాత్రల్లో తనదైన స్టయిల్లో మెప్పించారు జమున.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జమున, హైద్రాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. 1936 ఆగస్ట్ 30న హంపీలో జమున జన్మించారు.
‘ఆత్మాభిమానంతో వుండాలనుకుంటే ఎవరితోనైనా గొడవలొస్తాయి..’ అంటూ నిర్మొహమాటంగా మాట్లాడటం జమున నైజం.
సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావుతో చిన్నపాటి మనస్పర్ధలు రావడంతో, ఆయనతో సినిమాలు చేయడం మానేశారామె.
‘ఎన్టీయార్ అలాగే ఎన్నార్‌తో నాకున్న వివాదాన్ని గుండమ్మ కథ సినిమా కాంప్రమైజ్ చేసింది’ అంటూ ఓ ఇంటర్వ్యూలో జమున వ్యాఖ్యానించడం, రియల్ లైఫ్‌లో కూడా ఆమె ‘సత్యభామే’ నైజానికి నిదర్శనం.
Mudra369
కాగా, జమున అసలు పేరు జానాబాయి. జ్యోతిషుల సూచన మేరకు ఆమె పేరుని జమునగా తల్లిదండ్రులు నిప్పణి శ్రీనివాసరావు, కౌసల్యాదేవి మార్చారు.
Jamuna Silver Screen Satyabhama.. తొలిసారిగా వెండితెరపై..
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఆమె విద్యాభ్యాసం జరిగింది. తల్లి దగ్గరే ఆమె సంగీతం నేర్చుకున్నారు. ఆమె మంచి గాయని కూడా.
‘ఖిల్జీరాజు పతనం’, ‘మా భూమి’ నాటకాలతో ఆమె పాపులర్ అయ్యారు. మొదటిసారి ఆమె వెండితెరపై కనిపించింది ‘పుట్టిల్లు’ సినిమాలో. 1952లో విడుదలైంది ఈ సినిమా.

అందానికి అందం.. అభినయానికి అభినయం.. అన్నిటికీ మించి మంచితనం.. ఆపై కాస్తంత గడసరితనం.. ఇదీ జమున అంటే.
ఎస్వీయార్, ఎన్టీయార్, ఏయన్నార్ తదితర ప్రముఖ నటుల సరసన నటించి మెప్పించారామె. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి స్టార్‌డమ్ అందుకున్నారు.
రాజకీయ తెరపైనా సత్యభామే.!
సినీ రంగంలోనే కాక, రాజకీయాల్లోనూ రాణించారు జమున. 1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె రాజమండ్రి ఎంపీగా ఎన్నికయ్యారు.
Also Read: బీస్ట్ సమంత.! ‘తిండిలో కాదు, ‘పవర్’ నీ ఆలోచనల్లో.!
అప్పట్లో జమునను రాజకీయాల్లోనూ ‘స్టార్’గా చూశారు జనం. ఆమె నిర్వహించిన రోడ్ షోలు, బహిరంగ సభలకు అప్పట్లో జనం పోటెత్తారు. తెలుగుతోపాటు కన్నడ, హిందీ సినిమాల్లోనూ జమున నటించి మెప్పించారు.
జమున మరణం పట్ల పలువురు తెలుగు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మృతి తెలుగు సినీ పరిశ్రమకి తీరని లోటు.