Jr NTR.. రాజకీయాల్లోకి వచ్చేదెప్పుడు.? అంటూ జూనియర్ ఎన్టీయార్ చుట్టూ చాలాకాలంగా ఓ ప్రశ్న వైఫైలా తిరుగుతోంది. కానీ, ఆ ప్రశ్నకు ఆయన సరైన సమాధానమైతే చెప్పలేకపోతున్నాడు. సినీ నటుడిగా బోల్డంత కెరీర్ ముందర పెట్టుకుని, రాజకీయాల్లోకి రావడమెందుకు.? అన్నది ఆయన్ని అభిమానించే చాలామంది చెప్పేమాట.
రాజకీయాలంటే వయసు మీద పడ్డాక చేయాల్సినవా.? అన్న ప్రశ్న తలెత్తేది ఇలాంటి సందర్భాల్లోనే. తెలుగునాట రాజకీయాలు చాలా చాలా భిన్నమైనవి. రాజకీయాల్లోకి వస్తే, తెలంగాణ – ఆంధ్రప్రదేశ్.. ఈ రెండు రాష్ట్రాల్లో ఏదో ఒక వైపు నిలబడాలి. రెండు వైపులా నిలబడదామంటే కుదిరే పరిస్థితి కాదు.
రాజకీయం అంత వీజీ కాదండోయ్..
చిరంజీవి అయినా, పవన్ కళ్యాణ్ అయినా.. రాజకీయంగా ఇబ్బందులు పడిందీ, పడుతున్నదీ ఇలాంటి విషయాల్లోనే. అంటే, సొంతంగా పార్టీ నడిపే వారికి ఈ సమస్య ఎక్కువగా వుంటుంది. అదే, బాలకృష్ణ లాంటోళ్ళకైతే ఆ సమస్య వుండదు. ఆయన ఓ పార్టీ ఎమ్మెల్యే మాత్రమే.

తాజాగా, యంగ్ టైగర్ ఎన్టీయార్.. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మీద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అధికార పార్టీ నేతలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడాన్ని ప్రస్తావిస్తూ ఓ వీడియో విడుదల చేశాడు. అందులో, రాజకీయాల గురించి మాట్లాడాడు. చట్ట సభల్లో అర్థవంతమైన చర్చ ప్రజల కోసం జరగాలి తప్ప, వ్యక్తిగత దూషణలు జరగకూడదన్నాడు.
JrNTR చెప్పింది రైటే గానీ..
ఎన్టీయార్ మాట్లాడింది ముమ్మాటికీ కరెక్టే. కానీ, వ్యవస్థలు ఎప్పుడో నాశనమైపోయాయి. అలా నాశనమైపోయిన వ్యవస్థల్లో మార్పు కోసం యువతరం నడుం బిగించాలి. లక్షలాది, కోట్లాదిమంది అభిమానులున్న సినీ నటులు, రాజకీయాల్లోకి ఎందుకు రాకూడదు.? యంగ్ టైగర్ కూడా అలా రాజకీయాల్లోకి వస్తే మంచిదే కదా.? అన్న భావన చాలామంది ప్రజల్లోనూ కనిపిస్తోంది.
స్వర్గీయ నందమూరి తారకరామారావు కూడా సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చినవారే. రాజకీయాల్లో సరికొత్త మార్పుకు ఆయన కారణమయ్యారు. ఇప్పుడున్న రాజకీయాల్లోని కుళ్ళుని కడిగేయాలంటే ఖచ్చితంగా కొత్త తరం, యువతరం రాజకీయ వ్యవస్థలోకి వచ్చి తీరాలి.
Also Read: చెంచా గిరీ రాజకీయంలో జంతువుల కొట్లాట.!
పవన్ కళ్యాణ్ కావొచ్చు, ఎన్టీయార్ కావొచ్చు.. మరొకరు కావొచ్చు.. రాజకీయాల్లోకి వస్తే సరిపోదు, ప్రజల్ని మెప్పించాలి. అదే అత్యంత కష్టమైన ప్రక్రియ ఇప్పుడు. రాజకీయాల్ని డబ్బు, కులం, మతం, ప్రాంతం శాసిస్తున్న ఈ రోజుల్లో.. ఆ దేవుడే దిగొచ్చినా.. రాజకీయాల్ని ప్రక్షాళన చేయడం సాధ్యం కాదు. అందుకేనేమో, ఎన్టీయార్ ఆచి తూచి స్పందిస్తున్నాడు.
