Table of Contents
పరువు హత్య (Pranay Amrutha).. దేశాన్ని పీడిస్తోన్న జాడ్యాల్లో ఇది కూడా ఒకటి. సాటి మనిషిని చంపడమంటే, అది మనిషి చేసే పని కానే కాదు.
క్రూర మృగాలు అయినాసరే, తమ ఆహారం కోసం చిన్నా చితకా జంతువుల్ని, పక్షుల్ని చంపుతాయి తప్ప, కక్ష.. కుట్రలతో కానే కాదు. మనిషికి మాత్రమే, ఈ జాడ్యం వుంది.
‘కులం అంటే కుళ్ళురా.. మతం అంటే మాయరా..’ అని ఎంతమంది మొత్తుకుంటున్నా, ఆ మాయలో పడి సాటి మనిషిని చంపే విష సంస్కృతి కొనసాగుతూనే వుంది.
కులాభిమానం.. మతం పట్ల భక్తిని పూర్తిగా తప్పని చెప్పలేం. ఎవరి అభిప్రాయాలు వారివి. ఎవరి ఇష్టాలు వారివి. కానీ, ఆ పేరుతో ప్రాణాలు తీసేస్తామంటే ఎలా?
కన్న తండ్రే కాల యముడై!
నిత్యం పత్రికల్లో, టీవీల్లో చూస్తూనే వున్నాం. అక్రమ సంబంధాలు మానవ విలువల్ని ఏ స్థాయికి దిగజార్చేశాయో. వావి వరసల్ని మర్చిపోయి, కామంతో కళ్ళు మూసుకుపోయి.. రక్త సంబంధాల్ని సైతం చిదిమేస్తున్నారు.
ఆడాళ్ళు, మగాళ్ళు.. ఇద్దరూ ఇందులో బాధితులే. చిన్నారుల్ని కామాంధులు చిదిమేస్తున్న ఘటనల్ని చూసి సామాన్యులు చలించిపోవడం మినహా, ఈ ఘటనలు మాత్రం తగ్గడంలేదు. కన్న తండ్రే కాల యముడై, కూతురి ఐదోతనాన్ని తుడిచేయడం.. ‘హత్యాచారానికి’ మించిన పాపంగా భావించాల్సి వుంటుందేమో.!
ప్రముఖులు కొందరు ఈ దారుణంపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. యంగ్ హీరోలు నిఖిల్ సిద్దార్ధ్, మంచు మనోజ్ కుమార్, రామ్ పోతినేని, తెలంగాణ రాష్ట్ర సమితి నేత, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఈ దారుణాన్ని తీవ్రంగా ఖండిస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
ఏదీ పరువు? ఎక్కడ మిగిలింది పరువు?
తెలంగాణలోని మిర్యాలగూడలో 21 ఏళ్ళ అమృతవర్షిణి భర్తను కోల్పోయింది. ప్రేమ వివాహం ఆమె చేసిన నేరమని, తండ్రి మారుతీరావు భావించాడు. అమృత వర్షిణి భర్త ప్రణయ్‌ని (Pranay Amrutha) అతి కిరాతకంగా చంపించేశాడు.
వంద కోట్ల ఆస్తి ముందు, కోటి రూపాయలు పెద్ద అమౌంట్ కాదనుకున్నాడు. కూతురు ప్రేమ పేరుతో, తనకు దూరమవడాన్ని జీర్ణించుకోలేకపోయిన మారుతీరావు, కోటి రూపాయలు సుపారీ ఇచ్చి మరీ, కూతురి భర్తను చంపించేశాడు.
‘పరువు’ కోసమే ఈ హత్య చేసినట్లు మారుతీరావు పోలీసుల యెదుట వాంగ్మూలమిచ్చాడట. ‘నర రూప రాక్షసుడు’గా ఇప్పుడు కీర్తించబడ్తున్నాడు మారుతీరావు. ఇదేనా పరువు.?
తన కోసం కాదు, చనిపోయిన భర్త కోసం బతుకుతోంది!
ప్రణయ్ చనిపోయాడంటే, నేను బతికి వుండడం వృధా. అయితే ప్రణయ్, నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి. ఆ బిడ్డను జాగ్రత్తగా పెంచాల్సిన బాధ్యత నా మీద వుంది. అలాగే, ప్రణయ్‌కి న్యాయం జరగాలి.
అందుకే జీవిస్తున్నానని అమృతవర్షిణి చెమర్చిన కళ్ళతో చెబుతోంటే, తెలంగాణ మాత్రమే కాదు, తెలుగు ప్రజలు మాత్రమే కాదు.. దేశమంతా ఈ ఘటన గురించి తెలుసుకుని, కంటతడి పెడుతోంది. సోషల్ మీడియా ఇప్పుడు ‘జస్టిస్ ఫర్ ప్రణయ్’ అంటూ మార్మోగిపోతోంది. కానీ, న్యాయం జరుగుతుందా?
శవ రాజకీయం మొదలైంది (Pranay Amrutha)
నరరూప రాక్షసుడిగా వార్తల్లోకెక్కిన మారుతీరావుకి అన్ని రాజకీయ పార్టీలతోనూ సంబంధాలున్నాయి. మాఫియాతోనూ సన్నిహిత సంబంధాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఆఖరికి తీవ్రవాదులతోనూ సంబంధాలు నడిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఆ పరిచయాలతో ఈ కేసు నుంచి బయటపడ్తాననే ధీమాతో వున్నాడట మారుతీరావు. వివిధ రాజకీయ పార్టీలతో సంబంధాలు అంటే చిన్న విషయం కాదు.
ఎన్నో కేసులు, ఆధారాల్లేక వీగిపోయిన సందర్భాల్ని చూశాం. వాటిల్లో ఇది కూడా ఒకటిగా మిగిలిపోతుందేమోనన్న ఆందోళన అంతటా వ్యక్తమవుతోంది. అయితే పోలీసులు మాత్రం, ఈ కేసుని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లే కన్పిస్తోంది.
ప్రాణం తీసిన ప్రేమ (Pranay Amrutha)
కూతురి మీద ప్రేమ కారణంగానే, కూతురి భర్త (అల్లుడు ప్రణయ్)ని చంపానని మారుతీరావు చెప్పడమే నిజమైతే, ఇలాంటి ప్రేమ ఏ తండ్రి చూపినా, దాన్ని ప్రేమ అనలేం. చేసిన ఘోరాన్ని కప్పిపుచ్చుకోవడానికి ‘ప్రేమ’ నాటకం ఆడుతున్నాడీ రాక్షస తండ్రి.
ప్రేమ త్యాగాన్ని మాత్రమే కోరుకుంటుంది. ప్రేమ పేరుతో ఎవరు ఎలాంటి నేరాలకు పాల్పడినా, దాన్నసలు ప్రేమ అని ఎవరూ అనలేరు. ప్రేమించినందుకు అమృత తన ప్రాణానికి ప్రాణమైన ప్రణయ్‌ని కోల్పోయింది.
ప్రేమించినందుకు ప్రణయ్ (Pranay Amrutha), తన ప్రాణమైన అమృతకి దూరమయ్యాడు. అమృత పోరాటం ఫలించాలనీ, ‘పరువు హత్యలకు’ ఇకనైనా ఫుల్‌స్టాప్ పడాలని ఆశిద్దాం.