Kalatapasvi Viswanath Chiranjeevi.. కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ ఇక లేరు. గత కొద్ది రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న విశ్వనాథ్, నిన్న అర్థ రాత్రి తుదిశ్వాస విడిచారు.
విశ్వనాథ్ మరణం పట్ల ప్రముఖ సినీ నటుడు చిరంజీవి తీవ్ర దిగ్రభాంతిని వ్యక్తం చేశారు. విశ్వనాథ్ తనకు గురువుతో సమానమనీ.. పితృ సమానులనీ చిరంజీవి ట్వీట్ చేశారు.
తెలుగు జాతి ఖ్యాతిని తన సినిమాల ద్వారా ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన మహా దర్శకుడంటూ విశ్వనాథ్ గురించి పేర్కొన్నారు చిరంజీవి.
Kalatapasvi Viswanath Chiranjeevi.. అత్యంత విషాదకరమైన రోజు..
ఇది అత్యంత విషాదకరమైన రోజు. పితృ సమానులు, కళాతపస్వి కె విశ్నాథ్‌గారు ఇక లేరు అనే వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన గొప్పతనం గురించి చెప్పడానికి మాటలు చాలవు.
పండితులనీ, పామురలనీ కూడా ఒకేలా మురిపించే ఆయన చిత్రాల శైలి విశిష్టమైంది. ఆయనలా సున్నితమైన ఆర్ట్ ఫిలింస్‌ని బ్లాక్ బస్టర్ హిట్స్‌గా మలచిన దర్శకుడు బహుశా ఇంకొకరు లేరు.
తెలుగు జాతి ఖ్యాతిని తన సినిమాల ద్వారా ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన మహా దర్శకుడాయన.. అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
మూడు సినిమాల్లో విశ్వనాథ్ వద్ద శిష్యరికం..
మెగాస్టార్ చిరంజీవి, విశ్వనాథ్ దర్శకత్వంలో మూడు సినిమాలు చేశారు. సినిమాలు చేశారనడం కంటే శిష్యరికం చేశారనడం సబబేమో.

స్టార్ హీరో అయి వుండి కూడా, ఆ స్టార్‌డమ్ ఛాయలు లేని సినిమాలు తీసే విశ్వనాథ్‌తో సినిమా చేయాలని తపించడమంటే, దాన్ని శిష్యరికం అనే అనాలి మరి.
విశ్వనాథ్ దర్శకత్వంలో ‘శుభలేఖ’, ‘స్వయంకృషి’, ‘ఆపద్భాందవుడు’ అనే మూడు చిత్రాల్లో నటించే అవకాశం నాకు లభించింది. నాకు వ్యక్తిగతంగా ఆయనతో వున్నది గురు శిష్యుల సంబంధం.
అంతకు మించితండ్రీ కొడుకుల అనుబంధం. ఆయనతో గడిపిన సమయం నాకు అత్యంత విలువైనది.. ప్రతి నటుడికీ ఆయనతో పని చేయడం ఓ ఎడ్యుకేషన్ లాంటిది.. అని చెప్పారు చిరంజీవి.
విశ్వనాథ్ చిత్రాలు భావి దర్శకులకు ఒక గైడ్ లాంటివి. 43 సంవత్సరాల క్రితం ఆ మహనీయుడి ఐకానిక్ చిత్రం ‘శంకరాభరణం’ విడుదలైంది. అదే రోజు ఆ శంకరుడికి ఆభరణంగా, ఇప్పుడు ఆయన కైలాసానికి ఏతెంచారు.
ఆయన చిత్రాలు, ఆయన చిత్రాల సంగీతం, ఆయన కీర్తి అజరామరమైనవి. ఆయన లేని లోటు భారతీయ సినీ పరిశ్రమకి, తెలుగువారికి ఎప్పటికీ తీరనది.
Also Read: హాస్య బ్రహ్మాండం.! నవ్వుల రారాజు బ్రహ్మానందం.!
కె. విశ్వనాథ్ ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ ఆయన కుటుంబ సభ్యులందరికీ, అసంఖ్యాకమైన ఆయన అభిమానులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాను.. అని ట్వీట్‌లో చిరంజీవి పేర్కొన్నారు.
ఎప్పుడు కె.విశ్వనాథ్‌ని చిరంజీవి కలిసినా.. చిరంజీవి చంటిపిల్లాడిలా మారిపోతారు. తండ్రి హోదాలో విశ్వనాథ్, కళామతల్లి బిడ్డగా చిరంజీవి ఒదిగిపోయే తీరు ముచ్చటేసేది.
ఆ వాత్సల్యం.. ఇక ఫొటోలకే పరిమితం.!