Kalvakuntla Kavitha BRS తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమార్తె కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో సంబంధాలున్నాయన్నది ఓ ఆరోపణ. ఈ మేరకు ఆమె విచారణ ఎదుర్కొంటున్నారు.
తాజాగా, ఈ కేసులో ఈడీ నుంచి నోటీసులు అందడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొంత ఆందోళన చెందారు, అసహనం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
రాజకీయ నాయకులన్నాక కేసులు మామూలే.! అవినీతి కేసుల్లో జైలుకు వెళితే, ముఖ్యమంత్రి పదవులూ దక్కుతాయ్.! ఇదీ మన ఘన భారతదేశం మరి.!
Mudra369
ఈ మాత్రం దానికి రాజకీయ నాయకులెందుకు ఉలిక్కిపడతారు.! సంబరపడాలి కదా.. తమ మీద కేసులు నమోదైతే.?
‘తెలంగాణ తల వంచదు’ అంటూ ఆమె వేసిన ట్వీట్ అందర్నీ విస్మయానికి గురిచేసింది. రాజకీయ నాయకులకీ ‘కేసులకీ’ విడదీయరాని సంబంధం వుంది.
కేసులతో సావాసం.. అదే రాజకీయం.!
ధర్నాలు చేశారనో.. ఇంకోటనో.. రాజకీయ నాయకుల మీద కేసులు నమోదవడం కొత్తేమీ కాదు. ఆకాశంలో సగం.. అన్నింటా సగం.. అన్నట్టు, మహిళా నేతలు సైతం ఈ విషయంలో పోటీ పడుతున్నారు.
అవినీతి కేసుల్లోనూ మగవాళ్ళతో సమానంగా మహిళా మణులూ రాజకీయాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారన్నది నిర్వివాదాంశం.

అయితే, ఇవన్నీ రాజకీయ పరమైన కేసులే.! ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కేవలం ఆరోపణలు, కేసులు, అరెస్టుల వరకే పరిమితమవుతుంది తప్ప.. రాజకీయ నాయకులు మింగేసిన అవినీతి సొమ్ముని బయటకు లాగే పరిస్థితి వుండదు.
Kalvakuntla Kavitha BRS.. తెలంగాణ ఎందుకు తలవంచాలి.?
ఔను కదా.? తెలంగాణ ఎందుకు తల వంచాలి.? ‘తెలంగాణ తల వంచదు’ అని కవిత ట్వీటేశాక జరిగిన చర్చ ఇది. రాజకీయంగా అనుకుంటే బీఆర్ఎస్ – బీజేపీ మధ్య ఆధిపత్య పోరు.
ఏ విషయమ్మీద అయినా సూటిగా, స్పష్టంగా మాట్లాడే కవిత, లిక్కర్ స్కామ్ విషయంలో ప్రత్యర్థులకు ‘ఆయుధాల్ని’ తానే స్వయంగా అందించేస్తున్నారు.
‘తెలంగాణ తల వంచదు’ అనడం ద్వారా, ‘ఎందుకు తెలంగాణ తల వంచాలి.? తెలంగాణకీ, కవిత కేసులకీ సంబంధమేంటి.?’ అన్న చర్చకు స్వయంగా ఎమ్మెల్సీ కవిత ఆస్కారం కల్గించారు.
Mudra369
పోనీ, నిజంగానే తప్పు జరిగిందా.? అంటే, అది వేరే చర్చ. మధ్యలో తెలంగాణ ప్రస్తావన ఎందుకు.?
అన్నట్టు, ఈ తరహా కేసుల్లో అరెస్టయితే పొలిటికల్ అడ్వాంటేజ్ లభిస్తుంది. అరెస్టయి జైళ్ళకు వెళితే, ముఖ్యమంత్రి పదవులు రావొచ్చు కూడా.!
Also Read: పొలిటికల్ ఎంవోయూ.! నిజం.. నేతి బీరకాయ్.!
ఎందుకంటే, జనం ఏరికోరి.. ‘అవినీతి కేసుల్లో అరెస్టయి, జైలుకు వెళ్ళినవాళ్ళ పట్ల’ ప్రత్యేకమైన సానుభూతి ప్రదర్శించి, ఓట్లేసి.. ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడుతుంటారు.