Table of Contents
Kanyakumari Telugu Movie Review.. ‘ఫిదా’ సినిమాలో తెలంగాణ నేటివిటీని దర్శకుడు శేఖర్ కమ్ముల చాలా బాగా పట్టుకున్నాడు.
అందులో నటీనటులూ, ఆ నేటివిటీకి అడాప్ట్ అయ్యారు. ఇక, ప్రేక్షకులూ ‘ఫిదా’ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు.!
ఎందుకో, శ్రీకాకుళం నేటివిటీ పట్టుకోవడానికి తెలుగు సినీ జనాలు ఈ మధ్య నానా తంటాలూ పడుతున్నారు.
‘ఫిదా’లో తెలంగాణ నేటివిటీని పక్కాగా పట్టుకున్న సాయి పల్లవి, ‘తండేల్’ సినిమా దగ్గరకొచ్చేసరికి శ్రీకాకుళం నేటివిటీని పట్టుకోవడంలో విఫలమయ్యింది.
హీరో నాగచైతన్యకి కూడా, శ్రీకాకుళం నేటివిటీ సెట్ కాలేదు. అంతకు ముందు వచ్చిన ‘పలాస’ సినిమాలో నటీనటులంతా, శ్రీకాకుళం నేటివిటీని బలే క్యాచ్ చేయగలిగారు.
Kanyakumari Telugu Movie Review.. సిక్కోలు సినిమా.. సక్కటి సినిమా..
ఇప్పుడిదంతా ఎందుకంటే, మనం సిక్కోలు సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం గనుక. సిక్కోలు.. అదేనండీ, శ్రీకాకుళంలో నడిచే ఓ ప్రేమ కథ ‘కన్యాకుమారి’.!
నటీనటులెవరూ పెద్దగా పేరున్నవాళ్ళు కాదు. అందరూ కొత్తవాళ్ళే. గీత్ సాయిని, శ్రీచరణ్ రాచకొండ లీడ్ పెయిర్. ఈ చిత్రానికి దర్శకుడు సృజన్ అత్తాడ.
సినీ నటి మధు శాలిని ఈ సినిమాకి సమర్పకురాలు కావడం గమనార్హం. మధు శాలిని కూడా ఈ మధ్య పెద్దగా సినిమాల్లో ఎక్కడా కనిపించడం లేదనుకోండి.. అది వేరే సంగతి.
కథేంటంటే..
మామూలు ప్రేమ కథే ఇది. ఓ అమ్మాయిని, ఓ అబ్బాయి ప్రేమిస్తాడు.. చిన్నప్పటినుంచీ. వ్యవసాయం మీద మక్కువతో, చిన్నప్పుడే చదువ మానేస్తాడు హీరో.
హీరోయిన్ బాగా చదువుతుంది. కానీ, ఇంట్లో ఆడపిల్లకి అంతంత చదువులెందుకని, ఆమెకి ప్రతిసారీ అడ్డు తగులుతుంటారు. ఎలాగోలా డిగ్రీ పాస్ అవుతుంది.
వ్యవసాయం చేసే హీరోకి, పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రారు. హీరోయిన్ పెట్టే కండిషన్ల నేపథ్యంలో ఆమెకీ వరుడు దొరకడు.

అనుకోకుండా, హీరో – హీరోయిన్ కలుస్తారు. హీరో వైపు నుంచి ప్రేమ ప్రపోజల్ వెళుతుంది.. హీరోయిన్ తిరస్కరిస్తుంది. కానీ, హీరో వదలడు. ఉద్యోగం చేస్తే, ఆలోచిస్తానంటుంది హీరోయిన్.
ఉద్యోగం వేటలో పడతాడు.. హీరోయిన్ పని చేేసే బట్టల దుకాణంలోనే, సేల్స్ బాయ్‌గా చేరి.. సేల్స్ మేనేజర్‌గా ఎదుగుతాడు. అంతలోనే, ఉద్యోగం మానేస్తాడు.
దాంతో, హీరోయిన్.. అంతకు ముందే పెళ్ళి చూపులకు వచ్చిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌తో పెళ్ళికి రెడీ అయిపోతుంది. ఆ ఎంగేజ్మెంట్లో రచ్చ చేసి, అది రద్దయ్యేలా చేస్తాడు హీరో.
హీరోయిన్, ఉన్నత చదువుల కోసం హైద్రాబాద్ వెళ్ళిపోతుంది.. మరి.. హీరో – హీరోయిన్ మధ్య ప్రేమ ఏమయినట్లు.? అది తెలియాలంటే, సినిమా చూడాలి.
హీరో.. హీరోయిన్.. కథలో లీనమైపోయి..
సినిమా చూస్తున్నంతసేపూ ఎక్కడా, డ్రమెటిక్‌గా అనిపించదంటే.. దానిక్కారణం, నటీనటులే. సినిమాటోగ్రఫీ కూడా. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించీ చెప్పుకోవాలి.
హీరోయిన్ గీత్ సాయిని.. కన్యాకుమారి పాత్రలో ఒదిగిపోయింది.. ఆ పాత్రలో జీవించేసిందనడం సబబేమో. క్యూట్ ఎక్స్ప్రెషన్స్, అమాయకత్వం, గడుసుదనం.. అన్నీ కలగలిసి వున్నాయ్ ఆ పాత్రలో.
కళ్ళతోనే చాలా భావాల్ని పలికించేసింది. చాలా అరుదుగా చూస్తుంటాం, హీరోయిన్ల నుంచి ఈ స్థాయి నటనా ప్రతిభని. ఎక్కడా ఎక్స్పోజింగ్ జోలికే పోలేదు.
హీరో శ్రీచరణ్ రాచకొండ, ఓ సగటు కుర్రాడు. పల్లెటూరి కుర్రాడు. అమాయకంగా కనిపిస్తూనే, అన్ని ఎక్స్ప్రెషన్స్ బాగా క్యారీ చేశాడు. తెరపై ఎనర్జిటిక్‌గా కనిపించాడు.
డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. శ్రీకాకుళం స్లాంగ్‌తో కూడిన డైలాగ్స్ రాయడం అంత తేలిక కాదు. రాస్తే సరిపోదు, వాటిని నటీనటులతో చెప్పించాలి కూడా.
దర్శకుడు సృజన్ అత్తాడ, నటీనటుల నుంచి చాలా చక్కగా పెర్ఫామెన్స్ రాబట్టాడు. ముందే చెప్పుకున్నట్లు సినిమాటోగ్రఫీ సహా, మ్యూజిక్, ఎడిటింగ్.. ఇలా అన్ని విభాగాలూ అతనికి కలిసొచ్చాయి.
పాటలు అందంగా, ఆహ్లాదంగా తెరకెక్కించబడ్డాయి. కమర్షియల్ కోణంలో కక్కుర్తి పడి, హీరోయిన్‌తో అనవసరమైన ఎక్స్పోజింగ్ చేయించలేదు. హీరో – హీరోయిన్ల మధ్య మూతులు నాకే సన్నివేశాలూ పెట్టలేదు.
Kanyakumari Telugu Movie Review.. థియేట్రికల్ రిలీజ్.. పెద్దగా వర్కవుట్ కాలేదుగానీ..
ఈ మధ్య చిన్న సినిమాలు అనూహ్యంగా పెద్ద విజయాలు అందుకుంటున్నాయి.
చాాలా అరుదుగానే జరుగుతుంటుందిది. అలాంటి పెద్ద విజయం సాధించే కంటెంట్ ఈ ‘కన్యాకుమారి’లో వుంది.
కాకపోతే, ఎందుకో ‘కన్యాకుమారి’ జనాలకి అంతగా రీచ్ కాలేదు.. థియేట్రికల్ రిలీజ్‌తో. ఓటీటీలో మాత్రం, ‘కన్యాకుమారి’కి రీచ్ బాగానే వుండొచ్చు.
Also Read: ‘కరుంగళి మాల’ ప్రాముఖ్యత ఏంటి? ఎవరు, ఎందుకు ధరించాలి.?
ఓటీటీలో వచ్చాకనే, ‘కన్యాకుమారి’ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. వీలైతే, ఓ లుక్కేయండి.. అస్సలేమాత్రం డిజప్పాయింట్ అయ్యే ఛాన్స్ వుండదు.
ఉత్తరాంధ్రకి చెందినవారైతే, ఆ నేటివిటీని ఇష్టపడేవారైతే.. అందునా, సిక్కోలు అంటే ఇష్టమైతే.. ‘కన్యాకుమారి’ మరింత బాగా నచ్చేస్తుంది.
- yeSBee
