Table of Contents
బిగ్ బాస్ రియాల్టీ షో రెండో సీజన్ రోజుకో కొత్త వివాదంతో వార్తల్లోకెక్కుతోంది. ఇది రియాల్టీ షోనా? గొడవలకు వేదికా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. గొడవలు పెట్టడం, చోద్యం చూడటమే బిగ్ బాస్ లక్ష్యం అన్న భావన కలిగేలా, షోలో వివాదాలు నడుస్తున్నాయి. గొడవ పడుతున్నవారిని వదిలేసి, ఆ గొడవ కారణంగా ఇబ్బంది పడుతున్న వ్యక్తిని టార్గెట్ చేయడం ద్వారా బిగ్ బాస్ తన క్రెడిబిలిటీని కోల్పోతున్నట్లు బుల్లితెర వీక్షకులు అభిప్రాయపడుతున్నారు. హోస్ట్‌గా నేచురల్ స్టార్ నానితోపాటు, బిగ్ బాస్ రియాల్టీ షో నిర్వాహకులు, ఈ షోని ప్రచారం చేస్తోన్న మా టీవీ బుల్లితెర వీక్షకుల్లో రోజురోజుకీ పలచనైపోతుండడం బాధాకరం.
అర్థం పర్థం లేని తనీష్ ఆగ్రహం
ఇసుక టాస్క్ నిన్న జరిగింది. ఆ టాస్క్‌లో తనీష్, రోల్ రైడా పార్టిసిపేట్ చేయాల్సి వుంది. రోల్ రైడాని నిలువరించాల్సిన తనీష్, ఆ పని పక్కన పడేసి, కౌశల్‌ని టార్గెట్ చేశాడు. తనీష్, సామ్రాట్ కలిసి కౌశల్‌పై దాడికి దిగారు. ‘ఫిజికల్ ఎటాక్’ చాలా దారుణంగా జరిగింది. ఎంత దారుణంగా అంటే ఓ దశలో కౌశల్ కాలు విరిగిపోతుందేమోనని అందరూ భయపడ్డారు. అయితే ఫిట్‌నెస్‌కి కౌశల్ ప్రాధాన్యతనిస్తాడు కాబట్టి, తట్టుకోగలిగాడు. లేదంటే, కౌశల్ నిన్న ఇసుక టాస్క్ మధ్యలోనే ఆసుపత్రికి తరలించాల్సి వచ్చేది. అంత దారుణంగా తనీష్, కౌశల్‌పై దాడి చేశాడు. ఈ దాడిలో సామ్రాట్ పాత్ర తక్కువేమీ కాదు.
High tension atmosphere in the house 😳😳 #BB2TeluguFinalLevel #BiggBossTelugu2 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/OZU5kefsQb
— Starmaa (@StarMaa) September 19, 2018
దాడికి సూత్రధారి సామ్రాట్
వాస్తవానికి ఇసుక టాస్క్‌లో తొలి దాడి సామ్రాట్ ద్వారానే ఇనీషియేట్ అయ్యింది. కౌశల్‌కి ఇచ్చిన ట్యాంక్ నుంచి ఇసుకని ఖాళీ చేసే క్రమంలో, సామ్రాట్ – కౌశల్ పై ఫిజికల్ ఎటాక్‌కి దిగాడు. టాస్క్‌లో ఇవన్నీ మామూలేనని భావించిన కౌశల్, సామ్రాట్ నుంచి జరుగుతున్న దాడిని నిలువరించుకోవడానికి ప్రయత్నించాడు. అయినా సామ్రాట్ ఆగలేదు. పైగా, తనీష్‌ని సాయం తీసుకొచ్చి, కౌశల్ మీద ఎటాక్‌ని మరింత తీవ్రతరం చేశాడు. అలా కౌశల్, తన ట్యాంక్‌లో ఇసుకని నింపుకోవడానికి అవకాశమే లేకుండాపోయింది.
గీత, దీప్తి కష్టపడ్డారుగానీ..
గీతా మాధురి, దీప్తి నల్లమోతు ఓ జంటగా ఇసుక టాస్క్‌ని చేయాల్సి వుండగా, ఓ దశలో ఇద్దరూ చాలా గట్టిగా ఫైట్ చేశారు. ఒకర్నొకరు తోసుకున్నారు. ఏమయ్యిందో ఒక్కసారిగా దీప్తి సైడ్ అయిపోయింది, గీత కూడా లైట్ తీసుకుంది. అసలేమవుతుందో ఎవరికీ అర్థం కాలేదు. ఈ టాస్క్‌లో గెలిచినవారికి నామినేషన్ నుంచి ఇమ్యూనిటీ దక్కుతుంది. ఆ ఇమ్యూనిటీ కోసం అయినా, ఎవరికి వారు ఫైట్ చేయాల్సి వుండగా, ముందే ‘డీల్’ మాట్లాడేసుకుని.. బిగ్ బాస్ వ్యూయర్స్‌ని ఏమార్చారు. ఆ ‘డీల్’ విషయం తర్వాత బయటపడింది ఇతర హౌస్ మేట్స్ మాటల్లో.
ఇలాగైతే టాస్క్‌లు ఎందుకు?
ఎవర్ని గెలిపించాలో ముందే హౌస్ మేట్స్ ఓ అవగాహనకు వచ్చేస్తే మంచిది. ఎలాగూ కౌశల్ టార్గెట్ అవుతున్నాడు గనుక, అతన్నే ఫిజికల్‌గా, వెర్బల్‌గా ఎటాక్ చేస్తున్నారు గనుక.. ఆ ఐదుగురు ‘డీల్’ గురించి ముందే బయటపెట్టేస్తే, హౌస్ మేట్స్ అందరికీ శారీరక శ్రమ తప్పుతుంది. కౌశల్‌కి దెబ్బలు తప్పుతాయి, తిట్లూ మిగులుతాయి. కానీ, హౌస్ మేట్స్ అలా చేయడంలేదు. కౌశల్‌ని కార్నర్ చేస్తూనే వున్నారు. కౌశల్ చెప్పింది కూడా అదే, మీరు ఏమనుకుంటున్నారో, ఎవర్ని గట్టెక్కించాలనుకుంటున్నారో ముందే చెప్పెయ్యండని.
బిగ్ కుట్ర.. నేడు మరింత తీవ్రం
‘కుక్కల్లా మీద పడిపోతున్నారు’ అనేంతలా కౌశల్ సంయమనం కోల్పోయాడంటే, ఇతర హౌస్‌మేట్స్ ఆయన్ని ఎంతలా ఇన్ని రోజులూ వేధించారో అర్థం చేసుకోవచ్చు. దాన్నుంచి మళ్ళీ లబ్ది పొందాలని ఆ ఐదుగురు హౌస్‌మేట్స్, సింపతీ నాటకానికి తెరలేపారు. రోల్ రైడా ఏడుపు, గీత – దీప్తి ఆశ్చర్యం, తనీష్ – సామ్రాట్ ఓవరాక్షన్.. ఇవన్నీ కౌశల్ మీద మరో కుట్రలో భాగమే. ఇంతలా కౌశల్, బిగ్ హౌస్‌లో వేధింపులకు గురవుతున్నా, బిగ్ బాస్ మాత్రం చోద్యం చూస్తుండడం బాధాకరం.
నానీగారూ కాస్త జాగ్రత్తండీ
బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ 2 హోస్ట్ నానిపై తాజా వివాదాలు చాలా ఎఫెక్ట్ చూపేలా వున్నాయి. ఇప్పటికే నాని, కొందరికి మద్దతుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో హౌస్‌లో జరుగుతున్న గొడవలు ఆయన్ని ఇంకా ఇరకాటంలోకి నెట్టేయనుండడం ఖాయం. ఇసుక టాస్క్ రద్దయ్యిందని ప్రకటించిన బిగ్ బాస్, ఆ టాస్క్‌లో విజేతగా రోల్ రైడాని ఎలా ప్రకటిస్తారు? ఇలాంటి ప్రశ్నలకు నాని సమాధానం చెప్పాల్సి వుంటుంది. ఎవర్నో గెలిపించడానికి ఇంకొకర్ని అవమానపర్చడం, టార్గెట్ చేయడం వంటివి హోస్ట్‌గా నానికి కూడా ఇబ్బందికరమైన అంశాలే. తాజా పరిణామాలకీ ఆయనా బాధ్యత వహించక తప్పదు.