Table of Contents
Kavitha Kalvakuntla Jagruthi Telangana.. ఒకప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి.. అనగా, ఇప్పటి భారత రాష్ట్ర సమితిని ఉద్యమ పార్టీగా గులాబీ శ్రేణులు అభివర్ణిస్తాయి.
కాదు కాదు, అది కుటుంబ పార్టీ.. అంటూ రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు.. కారు పార్టీని.! సరే, ఎవరి గోల వారిదనుకోండి.. అది వేరే చర్చ.
బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటీవల కవిత బయటకు వచ్చారు. ఆమె బయటకు రావడం కాదు, పార్టీ నుంచి ఆమెని గెంటేశారు.. అనడం కరెక్ట్.!
దాంతో, ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసిన కవిత, తన ‘తెలంగాణ జాగృతి’ని యాక్టివ్ చేసే పనిలో బిజీగా వున్నారు. ‘తొక్కుకుంటూ పోవాలె’ అంటున్నారామె.
Kavitha Kalvakuntla Jagruthi Telangana.. గులాబీ కొంపలో కాంగ్రెస్ కుంపటి.?
ఇంకోపక్క, బీఆర్ఎస్ పార్టీలో ఈ గందరగోళానికి కారణం, అధికార కాంగ్రెస్ కుట్రలేనని గులాబీ పార్టీకి చెందిన కొందరు నాయకులు వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నిజానికి, లైట్ తీసుకున్నారు. సెటైర్లేశారు గులాబీ పార్టీ మీదా. కవిత మీదా.!
కేసీయార్ ఇంట్లో ఆస్తుల పంపకాలకు సంబంధించిన గొడవలు నడుస్తున్నాయనీ, కవిత బీఆర్ఎస్‌కి దూరమవడం, ఆ గొడవల వల్లేనని రేవంత్ రెడ్డి తేల్చేశారు.
కాగా, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కవిత స్పందిస్తూ, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో హరీష్ రావుతో లొల్లి తప్ప, కేసీయార్‌తో తనకేమీ పంచాయితీ లేదని చెప్పుకొచ్చారు.
పాత పంచాయితీనే, కొత్తగా ముక్కలైంది.!
గత కొంతకాలంగా.. ఆ మాటకొస్తే, చాలాకాలంగా గులాబీ పార్టీలో కుటుంబ తగాదాల్ని చూస్తున్నాం. చాపకింద నీరులా హరీష్, కేటీయార్, కవిత.. ఈ గొడవల్ని తారాస్థాయికి తీసుకెళ్ళారు.
ఎప్పుడైతే, గులాబీ పార్టీ అధికారం కోల్పోయిందో, అప్పటినుంచీ ఈ గొడవలు రచ్చకెక్కాయి. కవిత, పార్టీ బయటకు వెళ్ళాల్సి వచ్చింది.
ఇక, తొక్కుకుంటూ పోవడంపై కవిత వ్యాఖ్యలు కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. రాజకీయాల్లో స్పేస్ ఎవరూ ఇవ్వరు, తొక్కుకుంటూ పోవాలె.. అని కవిత చెప్పడం అందర్నీ విస్మయానికి గురిచేసింది.
కవిత కొత్త పార్టీ పెట్టి, గులాబీ పార్టీని తొక్కేస్తారా.? అన్న అనుమానాలూ తెరపైకి రావడం సహజమే.
కవిత అటు, హరీష్ ఇటు..
కాంగ్రెస్ పార్టీలోకి కవిత వెళతారనీ, బీజేపీలోకి హరీష్ రావు దూకేస్తారనీ.. కుప్పలు తెప్పలుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి.
ఎవరెటువైపు వెళ్ళిపోతారో తెలియక, గులాబీ శ్రేణులు తికమకపడుతున్నాయి. ఎవర్ని మద్దతివ్వాలో, ఎవర్ని విమర్శించాలో అర్థంకాని పరిస్థితి గులాబీ కార్యకర్తలది.
తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా కవిత మార్చే అవకాశముందా.? గులాబీ బాస్ కేసీయార్, ఈ మొత్తం వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టి, కుమార్తె కవితని తిరిగి అక్కున చేర్చుకుంటారా.?
ఏమో, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. కానీ, ఒకప్పుడు పదునైన రాజకీయ వ్యూహాలు రచించిన కేసీయార్, ఇప్పుడు ఫామ్ హౌస్‌కే పరిమితమైపోయారు.
పార్టీ నుంచి కవిత సస్పెన్షన్ తర్వాత కేటీయార్, హరీష్ రావులతో పలు దఫాలు మంతనాలు జరిపిన కేసీయార్, కుమార్తె కవిత విషయమై ఇప్పటిదాకా పెదవి విప్పింది లేదు.
కవిత, విషయమై గులాబీ నేతలు విమర్శలు చేస్తున్నారంటే, కేసీయార్ నుంచి ఆ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేకపోవడం వల్లే కదా.?
