Keerthy Suresh Chinni Telugu Review: ‘మహా నటి’ సినిమా చేసినందుకు కాదు.. నిజంగానే కీర్తి సురేష్ మహా నటి. తెలుగులో తొలి సినిమా ‘నేను శైలజ’ దగ్గర్నుంచి, ఇప్పటిదాకా ఆమె నటిగా ఫెయిలయ్యింది లేదు.
కథల ఎంపికలో పొరపాట్ల వల్ల కొన్ని సినిమాలు ఫ్లాప్ అయితే అయి వుండొచ్చు.. దర్శకులు ఆమె పాత్రను సరిగ్గా తీర్చి దిద్ది వుండకపోవచ్చు.
అంతేగానీ, ఒప్పుకున్న ప్రతి సినిమాకీ నూరు శాతం తన వైపు నుంచి ఎఫర్ట్స్ పెట్టే విషయమై కీర్తి సురేష్ (Keerthy Suresh) ఏనాడూ రాజీ పడింది లేదన్నది నిర్వివాదాంశం.
తాజాగా కీర్తి సురేష్ నుంచి ఓ సినిమా వచ్చింది. తెలుగులో ఆ సినిమా పేరు ‘చిన్ని’.
నిజానికి, దీన్ని సినిమా అనడం కంటే, ఓటీటీ కోసం తీసిన కంటెంట్ అనొచ్చు.. వెబ్ సిరీస్‌గా మలచదగ్గ కంటెంట్.. దాన్ని సినిమాగా విడుదల చేసేశారు ఓటీటీలో.
Keerthy Suresh Chinni Telugu Review.. అసలేముంది సినిమాలో.!
అగ్రకుల అహంకారానికి సర్వం కోల్పోయిన ఓ మహిళ, అందుకు బదులు తీర్చుకోవడమే ఈ సినిమా కథ. ‘నారప్ప’ సినిమాకి మేల్ వెర్షన్ అనగలమా.? అంటే, కాదు. ఆ షేడ్స్ కొంచెం కనిపిస్తాయంతే.
‘చిన్ని’ సినిమాలో కీర్తి సురేష్ పాత్రకి అండగా నిలిచింది మరో పాత్ర. అదే రంగయ్య. ఆ పాత్రలో నటించాడు ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్.
ఇటు కీర్తి సురేష్, అటు సెల్వరాఘవన్.. ఈ ఇద్దరూ పోటాపోటీగా నటించారు.. మెప్పించారు. సవతి చెల్లెలు చిన్ని లాగానే, రంగయ్య కూడా అగ్రకుల అహంకారం కారణంగా సర్వం కోల్పోతాడు.
ఇదెలా సాధ్యం.? అదెలా సాధ్యం.? అన్న ప్రశ్నలు పెద్దగా ఎవరికీ సినిమా చూస్తున్నంతసేపూ కలగలేదంటే, అంత సహజంగా దర్శకుడు సన్నివేశాల్ని తెరకెక్కించాడని అర్థం.
సినిమాలో ఎవరూ నటించినట్లుండదు.. అందరూ తమ తమ పాత్రల్లో జీవించేశారు.
సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి. అయితే, స్లో నెరేషన్.. ఒకింత ఇబ్బంది పెడుతుంది. దాదాపుగా ప్రతి సన్నివేశమూ సాగతీత అనిపిస్తుంది.
నటించలేదు.. జీవించేశారు.!
అయితే, సెల్వ రాఘవన్ (Selvaraghavan) కావొచ్చు.. కీర్తి సురేష్ కావొచ్చు.. ఆయా సన్నివేశాల్లో కళ్ళతో పలికించిన హావభావాలు.. ఆ సాగతీతను మర్చిపోయేలా చేస్తాయ్.
చాలా అరుదుగా వస్తుంటాయి ఇలాంటి సినిమాలు. సినిమాగా కంటే, దీన్ని ఓటీటీ కంటెంట్ తరహాలో ఎపిసోడ్ల వారీగా భావిస్తే.. ఇంపాక్ట్ ఎక్కువగా వుంటుంది.
అందుకు తగ్గట్టుగానే సినిమాని పలు భాగాలుగా విభజిస్తూ, వాటికి ప్రత్యేకమైన పేర్లు కూడా పెట్టారండోయ్.
Also Read: పూనమ్ కౌర్ ‘పిల్లల’ రచ్చ.! రాక్షస క్రీడ ఎవరిది.?
వరుసగా ఫ్లాపులు చవిచూస్తున్నప్పటికీ, కీర్తి సురేష్‌లోని నటి మాత్రం సూపర్ కాన్ఫిడెంట్‌గానే వుందని, ఈ సినిమాలో ఆమె నటనను చూస్తే అర్థమవుతుందెవరికైనా.! అందుకే, ఆమె మహానటి అయ్యింది.
సినిమాలో రక్తపాతం ఎక్కువగా కనిపించింది. కానీ, ఆ రక్తపాతానికి అర్థం వుంది. క్రూరత్వం ఎక్కువైంది.. అది కూడా అర్థమవంతమైనదే.
ఓవరాల్‌గా ‘చిన్ని’ ఓ అర్థవంతమైన సినిమానే. నటిగా, కీర్తి సురేష్‌ని మరో మెట్టు ఎక్కించే సినిమా ఇది.