Kerala Extreme Poverty Free State.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దశాబ్ధాలుగా పేదరిక నిర్మూలన కోసం లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయ్. అయితే, పేదరికం ఏటా పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు.
కానీ, కేరళ రాష్ట్రం పేదరికాన్ని తాము తరిమేసినట్లు ప్రకటించుకుంది. ఈ మేరకు కేరళ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. దాంతో, ఒక్కసారిగా దేశమంతా అవాక్కయ్యింది.
దేశంలో ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా.. పూట గడవని నిరుపేద కుటుంబాలు చాలా చాలా చాలా ఎక్కువగానే వున్నాయ్.
అసలు పేదరికం అంటే ఏంటీ.? అన్న ప్రశ్నకే సరైన నిర్వచనం ఇవ్వలేని దుస్థితలో ప్రభుత్వాలున్నాయ్. మేం అధికారంలోకి వస్తే.. పేదరికాన్ని నిర్మూలిస్తాం.. అని చెప్పని రాజకీయ పార్టీనే లేదీ దేశంలో.
అలా చెప్పి, అధికార పీటమెక్కడం.. వేల కోట్ల అవినీతికి పాల్పడడం.. జైళ్లకు వెళ్లడం, బెయిళ్ల మీద బయటికి రావడం తెలిసిన విషయాలే.
Kerala Extreme Poverty Free State.. రాజకీయ సంపద ఎంత.?
దేశంలో రాజకీయ నాయకుల సంపద వాళ్లని నడిపిస్తున్న కార్పోరేట్ శక్తుల సంపద.. ఇవన్నీ లెక్కలు తీస్తే, దేశంలో పేదరికానికి కారణం ఎవరు.? అన్నది స్పష్టంగా తెలిసి పోతుంది.
రేషన్ కార్డుల్ని తీసుకుంటే.. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వాటి సంఖ్యని పెంచుకుంటూ పోతుంది. ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగమే ఇది.
రేషన్ కార్డుల ద్వారా పంపిణీ చేసే బియ్యం వంటివి పేదరికంలో మగ్గుతున్న నిరుపేద కుటుంబాలకు భరోసా ఇవ్వాలి. వారి జీవన స్థితి గతులు మెరుగవ్వాలి. కానీ, రేషన్ బియ్యం పక్కదారి పడుతుంటాయ్.
వేల కోట్లతో అమలు చేసే మిగతా సంక్షేమ పథకాలు కూడా ఇలానే పక్కదారి పడుతున్నాయ్. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం పేరు చెప్పి, మగాళ్లకి బస్సు ఛార్జీలు పెంచేయడం ఓ చీప్ ట్రిక్.
చెప్పుకుంటూ పోతే, ఇలాంటివి చాలానే. కేరళ అధికారికంగా పేదరికాన్ని తరిమేశాం.. అని చెప్పుకుంటోంది కనుక ఈ చర్చ జరుగుతోంది.
దేశంలో అసలు పేదరికమే లేనట్టు కదా.!
ప్రతీ రాష్ట్రం చెప్పే అభివృద్ధి లెక్కలు నిజమే అయితే, అసలు దేశంలో పేదరికం లేనట్లే.! కేంద్ర ప్రభుత్వం అయినా, మేం ప్రజల్ని ఉద్ధరించేస్తున్నాం.. అని చెప్పడం అంటే పేదరికాన్ని అంతం చేసినట్లే.!
కానీ, అది నిజం కాదు కదా.! కేరళ రాష్ట్రంలో కూడా పేదలున్నారు. నిరుపేదలున్నారు. నిరుపేదలుండీ లేరని చెప్పడం అంటే ప్రభుత్వ పెద్దలు తమని తాము మోసం చేసుకున్నట్లే.
దేశం నుంచి పేదరికాన్ని పారద్రోలడం అసాధ్యమేమీ కాదు. కాకపోతే, పాలకులకి చిత్తశుధ్ధి వుండాలి. అదే వుంటే.. ఇంత చర్చ అనవసరం.
కేరళ ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలో, తీవ్రమైన నిరుపేదరికాన్ని తరిమికొట్టడం.. అనేది మాటలకే పరిమితం.! వాస్తవాలు వేరే వుంటాయ్.! అది జగమెరిగిన సత్యం.
