Table of Contents
Konda Polam Review.. సినిమా అంటే, ఆరు పాటలు మూడో నాలుగో ఫైట్లు.. కామెడీ పేరుతో వెకిలితనం, గ్లామర్ పేరుతో హీరోయిన్ల అందాల ప్రదర్శన. అర్ధం పర్ధం లేని మాస్ డైలాగులు.. చెవులు చిల్లులు పడేలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ఇంతేనా.?
నేటి కమర్షియల్ సినిమా సూత్రానికి భిన్నంగా ఓ చక్కని సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అదే ‘కొండపొలం’. హీరో సూపర్ మేన్ కాదు. హీరోయిన్ గ్లామర్ బొమ్మ కాదు. అసలు సినిమాలో పాత్రలు తప్ప, నటీ నటులెవరూ కనిపించరు. అదే ‘కొండపొలం’ ప్రత్యేకత.
ఇది మనిషి కథ..
గొర్రెల పెంపకమే జీవనాధారంగా బతికే ఓ కుటుంబం. ఆ కుటుంబం నుంచి ఉన్నత విద్యనభ్యసించిన ఓ యువకుడు. ఉద్యోగాన్వేషణలో విజయం సాధించలేక, అతను పడే తపన, అతనెలా తన భయాల్ని అధిగమించి లక్ష్యాల్ని చేరుకున్నాడనేదే అసలు కథ.
తనలా తన బిడ్డ కష్టాల జీవితాన్ని అనుభవించకూడదని కోరుకునే తండ్రి, జీవితంలో గెలవడానికి ఏం చేస్తే బావుంటుందో మనవడికి తెలియచెప్పే తాత, ప్రకృతితో మమేకమవడం ఎలాగో తెలియజెప్పిన కథానాయిక.. ఇలా సినిమాలో చాలా పాత్రలు కనిపిస్తాయి.
Konda Polam Review ప్రకృతితో మమేకం..
దాదాపుగా తెరపై కనిపించే ప్రతి పాత్ర మనకి ఏదో చెబుతుంటుంది. మనల్ని ప్రకృతిలోకి తీసుకెళుతుంటుంది. ప్రకృతితో మమేకమయ్యేలా చేస్తుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తెరపై కనిపిస్తున్న సన్నివేశంలోకి మనం వెళ్లేలా చేస్తాయి.

పాటలు, బిట్ సాంగ్స్.. ఇవన్నీ మనకి మంచి మాటలు చెబుతాయి. సినిమాలో ప్రతి డైలాగ్ మనమెలా బతకాలో నేర్పుతాయి. భార్యా భర్తల మధ్య పొరపొచ్చాలు ఎలా సమసిపోవాలో, అలా సమసిపోవాలంటే ఏం చేయాలో ఓ పాత్ర ద్వారా అర్ధమవుతుంది.
Konda Polam Review భయాన్ని గెలవాలంటే..
భయాన్ని ఎలా గెలవాలనేది హీరో పాత్ర ద్వారా చెబుతారు. ముందే చెప్పుకున్నాం కదా.. హీరో, హీరోయిన్, ఇతర నటీనటులు వీళ్లంతా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఎవరూ నటించినట్లు కనిపించరు. పులితో హీరో పోరాటం చేయాల్సి వస్తే, ఓ మామూలు వ్యక్తి మాత్రమే కనబడతాడు. అతనిలో సూపర్ హీరో కనిపించడు.
Also Read: Pragya Jaiswal అందం, అభినయం ‘అఖండ’మే.!
చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి సహజమైన కథలు వెండితెరపై కనిపిస్తుంటాయ్. సాగతీతగా అనిపించిందనో, ఎంటర్‌టైన్‌మెంట్ లేదనో లైట్ తీసుకుంటే, ఓ మంచి సినిమాని మిస్ అవుతాం. ఓ మంచి విషయాన్ని తెలుసుకోలేకపోతాం.
ఎవ్వర్ గ్రీన్ పాత్రలు..
మొదటి సినిమా ప్రయోగాత్మకంగా చేశాడు. రెండో సినిమాలోనూ ప్రయోగమే చేశాడు. నటుడిగా తనను తాను తీర్చి దిద్దుకోవడానికి మంచి కథల్ని ఎంచుకుంటున్నాడు వైష్ణవ్ తేజ్. ఈ సినిమా నటుడిగా అతన్ని మరో మెట్లు పైకి ఎక్కిస్తుంది.
రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటిదాకా చేసిన సినిమాలు ఓ ఎత్తు. ఇదొక్కటీ ఇంకో ఎత్తు. సాయి చంద్, కోట శ్రీనివాసరావు తదితరులంతా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. దర్శకుడు క్రిష్ ఇలాంటి సినిమాల్ని తెరకెక్కించడంలో ధిట్ట. అది ఇంకోసారి నిరూపితమైంది.
చివరిగా, సినిమా చూశాకా, సినిమా నుంచి స్పూర్తి పొందడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. అలాంటి అరుదైన సినిమాల్లో ఈ ‘కొండపొలం’ ఒకటి. కమర్షియల్ లెక్కలేసుకోకుండా, ‘కొండపొలం’ (Konda Polam Review) సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన దర్శక, నిర్మాతలకూ, నటీ నటులకూ, సాంకేతిక నిపుణులందరికీ హ్యాట్సాఫ్.
– yeSBee