Table of Contents
Maaran Telugu Review: ‘హీరో’ అనే ట్యాగ్ కంటే కూడా, విలక్షణ నటుడని చెప్పడం సబబేమో ధనుష్ విషయంలో. హిట్టు, ఫ్లాపు.. అనే లెక్కల్ని పక్కన పెడితే, ‘ధనుష్’ సినిమాల్లో ఖచ్చితంగా కొత్తదనం వుండి తీరుతుందన్న అభిప్రాయం ప్రేక్షకుల మెదళ్ళలో బాగా ఫిక్సయిపోయింది.
మరి, అలాంటి ధనుష్ నుంచి వచ్చిన ‘మారన్’ సినిమా ఎలా వుంది.? నేరుగా ఓటీటీలో విడుదలైన ‘మారన్’ అంచనాల్ని అందుకుందా.? లేదా.? అసలు సినిమా కథా కమామిషు ఏంటి.? పదండిక.. ‘మారన్’ సంగతేంటో చూసేద్దాం.!
Maaran Telugu Review: ఇదీ కథా కమామిషు.!
‘మారన్’ (ధనుష్) ఓ జర్నలిస్ట్.! అతనికి చెల్లెలంటే విపరీతమైన ప్రేమ. తండ్రి (రాంకీ) కూడా జర్నలిస్టే. ఓ నిప్పులాంటి నిజాన్ని ప్రజల ముందుంచే క్రమంలో తండ్రి చనిపోతాడు. అప్పుడే తల్లి కూడా చనిపోతుంది. కళ్ళు తెరవకుండానే తల్లిని, తండ్రిని కోల్పోయిన ఆ చిన్నారికి అన్నీ తానే అయి పెంచుతాడు మారన్.
ఓ రాజకీయ నాయకుడు (సముద్రఖని) మీద సంలచనాత్మక కథనాన్ని ప్రజల ముందుంచి మారన్, ఆ రాజకీయ నాయకుడి ఆగ్రహానికి గురవుతాడు. ఈ క్రమంలో చెల్లెని కూడా కోల్పోతాడు. ఆ తర్వాత ఏమైందన్నది మిగతా కథ.
అన్నాచెల్లెళ్ళ అనుబంధంతో చాలా సినిమాలు వచ్చాయి. వాటిల్లో కొన్ని సూపర్ హిట్స్. కొన్ని డిజాస్టర్స్.! ఈ ‘మారన్’ సినిమాకి పొలిటికల్ టచ్ ఇచ్చారు, హీరోని జర్నలిస్టుగా చూపించారు. అంతకు మించి సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశాలేవీ లేవు.
మరీ ఇంత చప్పగానా.?
ఈ తరహా సినిమాలు ఎంత గ్రిప్పింగ్‌గా వుంటే, అంతలా ప్రేక్షకుల్ని అలరిస్తాయి. పైగా, అక్కడున్నది హీరో ధనుష్. కాస్త కంటెంట్ వుంటే చాలు, తనదైన ఎనర్జీతో సినిమాని పరుగులు పెట్టించేస్తాడు.
కానీ, అందుకు భిన్నంగా చాలా చప్పగా సాగింది ‘మారన్’. నిడివి తక్కువే అయినా, బోర్ కట్టేసిందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. స్క్రీన్ ప్లే లోపాలున్నాయి.. సన్నివేశాల సాగతీత ఎక్కువైపోయింది. కావాల్సినంత గందరగోళమూ వుంది.
హీరోయిన్‌గా నటించిన మాళవిక మోహనన్ పాత్రకి బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ.. అన్నట్టు తయారైంది పరిస్థితి. అసలామె పాత్రకు మద్యం తాగే అలవాటుని ఎందుకు దర్శకుడు అంటగట్టినట్టు.? పైగా, తాగుడు వల్ల హీరోకి జరిగిన నష్టం గురించి హీరోయిన్ క్లాస్ తీసుకోవడమేంటో.!
ఓ పాటలో ధనుష్ స్టెప్పులు మాస్ ఆడియన్స్‌ని అలరిస్తాయి. ఒకటి రెండు సన్నివేశాల్లో ధనుష్ మార్క్ ఎనర్జీ కనిపిస్తుంది. అంతే, ఆ సన్నివేశాల కోసం సినిమా అంతటా ధనుష్ ప్రదర్శించే నీరసాన్ని తట్టుకోవడం కష్టం.
నాన్న ఏం చెప్పాడు.? కొడుకు ఏం చేశాడు.?
ధైర్యంగా, తెలివిగా వ్యవహరించాలని తండ్రి చెబుతాడు తన కుమారుడికి. కానీ, కుమారుడేమో.. తెలివిగా, ధైర్యంగా వ్యవహరించాల్సింది పోయి.. డల్లుగా కనిపిస్తాడు. అదేంటో.! సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది. నేపథ్య సంగీతం ఓకే.
ధనుష్ (Dhanush) కూడా వేస్టయ్యాడంటే, సముద్రఖని లాంటి నటుడ్ని కూడా దర్శకుడు బాగా ఉపయోగించుకోలేకపోయాడనే అర్థం ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. అసలు సినిమాలో (Maaran Telugu Review) ఏ పాత్ర కూడా చెప్పుకోదగ్గదిగా లేదు.
Also Read: తీరం తాకిన Bheemla Nayak తుపాను.. ‘అహంకారం’ కకావికలం.!
రేసీ స్క్రీన్ ప్లే వుండి వుంటే, సన్నివేశాల్ని ఆసక్తికరంగా మార్చి వుంటే, దనుష్ పాత్రకి తగినంత ఎనర్జీ ఇచ్చి వుంటే.. ‘మారన్’ ఖచ్చితంగా సంచలనం అయి వుండేదే.! కానీ, అవేమీ జరగలేదాయె.!
ధనుష్ ఎందుకిలా చేశావ్.? సినిమాకి సంబంధించి దాదాపు అన్ని విభాగాలపైనా పట్టున్న ధనుష్, ఇంత వీక్ కంటెంట్ (Maaran Telugu Review) విషయంలో ఎందుకు జాగ్రత్త పడలేకపోయాడు.? ఇదొక మిలియన్ డాలర్ క్వశ్చన్ ఇప్పుడు.!
– yeSBee