Table of Contents
Maestro Review In Telugu.. కమర్షియల్ ఆలోచనల్ని పక్కన పెట్టి హీరో నితిన్ ప్రయోగాత్మక కోణంలో చేసిన సినిమా ‘మాస్ట్రో’. రీమేక్ అయినాగానీ, అసలు ఈ సినిమా చేసేందుకు ఒప్పుకోవడంలోనే నితిన్ తీసుకున్న రిస్క్ ఏంటనేది అర్థమవుతోంది.
బాలీవుడ్ సినిమా ‘అంధాదున్’ రీమేక్ ఇది. ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే నటించిన ‘అంధాధున్’ సినిమాని తెలుగులోకి ‘మాస్ట్రో’ పేరుతో రీమేక్ చేశారు. నితిన్, తమన్నా బాటియా, నభా నటేష్ తెలుగు వెర్షన్‌లో ప్రధాన తారాగణం.
హిందీలో టబు పోషించిన పాత్రని తెలుగులో తమన్నా పోషిస్తోంది. టబు ఎంత మంచి నటి అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి, తమన్నా.. టబు స్థాయిని అందుకుంటుందా.? ఛాలెంజింగ్ రోల్ ఎంచుకున్న నితిన్ ఆ పాత్రకు ఎంతవరకు న్యాయం చేశాడు.? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
మాస్ట్రో కథ ఏంటంటే..
అరుణ్ ఓ పియానో ఆర్టిస్ట్. అతనికి ఒకప్పటి హీరో మోహన్ పరిచయమవుతాడు. ఆ పరిచయంతో తన ఇంట్లో ప్రైవేట్ కాన్సెర్ట్ కోసం అరుణ్‌ని ఒప్పిస్తాడు మోహన్. మోహన్ ఇంటికి వెళ్ళిన అరుణ్, అక్కడ మోహన్ హత్యకు గురై వుండడాన్ని చూస్తాడు. అయితే, అరుణ్‌కి కళ్ళు కనిపించవని అప్పటిదాకా అంతా అనుకుంటారు. కానీ, అతనికి కళ్ళు కనిపిస్తాయ్.
Also Read: సినిమా రివ్యూ: రంగ్ దే.!
తాను చూసింది పోలీసులకు చెప్పడానికి వెళ్ళిన అరుణ్‌కి అక్కడో ఝలక్ తగులుతుంది. తన గర్ల్‌ఫ్రెండ్ సోఫీకి విషయం చెప్పలేక సతమతమవుతున్న సమయంలో నిజంగానే అరుణ్ జీవితం అంధకారమైపోతుంది.. అతని కళ్ళు పోతాయ్. దీనంతటికీ కారణం మోహన్ భార్య సిమ్రాన్. అసలు సిమ్రాన్ ఇదంతా ఎందుకు చేసింది.? అరుణ్ ఈ ఉపద్రవం నుంచి ఎలా బయటపడ్డాడు.? అరుణ్ జీవితంలో తిరిగి వెలుగులు విరజిమ్మాయా.? లేదా.? అవన్నీ సినిమా చూస్తేనే తెలుస్తాయ్.
ఎవరెలా చేశారు.?
హీరో నితిన్ నిజంగానే ఓ ప్రయోగం చేశాడు. హిందీలో ఘనవిజయం సాధించిన ‘అంధాధున్’ సినిమాని రీమేక్ చేయడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కళ్ళు లేని వ్యక్తిగా నటించడం కత్తి మీద సాము లాంటిదే. ఈ విషయంలో నితిన్‌కి నూటికి నూరు మార్కులూ పడతాయి.
Also Read: సినిమా రివ్యూ: భీష్మ
తమన్నాకి సైతం ఇది భిన్నమైన పాత్ర. ఆమె కూడా బాగానే చేసింది. నభా నటేష్ మాత్రం వృధా అయ్యింది. సినిమాకి ఆమె పాత్ర పెద్దగా ఉపయోగపడిందేమీ లేదు. అసలు దర్శకుడే ఆమె టాలెంట్‌ని సరిగ్గా వాడుకోలేదేమో అన్పిస్తుంది. తెరపై చూడ్డానికి కూడా నభా నటేష్ ఏమంత బాగా లేదు. నరేష్ ఓకే. రచ్చ రవి, హర్షవర్ధన్, మంగ్లి, శ్రీముఖి తదితరులు వున్నంతలో మమ అన్పించేశారు. పోలీస్ అధికారి పాత్రలో జిస్సుసేన్ గుప్తా బాగానే చేశాడు.
సాంకేతికంగా ఎలా వుందంటే..
సాంకేతికంగా చూసుకుంటే సినిమాటోగ్రఫీ బావుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. సినిమా నిడివి ఓకే.. కానీ, ఇంకాస్త తగ్గితే బావుండేదన్పిస్తుంది. అక్కడక్కడా పేస్ తగ్గింది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త పదును చూపించి వుంటే బావుండేదేమో. హిందీ వెర్షన్‌తో పోల్చితే, తెలుగులో జరిగినవి తక్కువ మార్పులే అనుకోవాలేమో.
విశ్లేషణ..
హిందీ వెర్షన్‌ని యధాతథంగా ఫాలో అయిపోయారు. కాస్టింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టి వుండాల్సింది. నరేష్ నటన కావొచ్చు, నబా నటేష్ నటన కావొచ్చు.. సినిమాకి ప్లస్ అవలేదు. రచ్చ రవి, మంగ్లి కూడా అంతే. ఇంకాస్త ఎఫెక్టివ్‌గా ఈ పాత్రల్ని తీర్చిదిద్ది వుంటే బావుండేదేమో. హిందీ వెర్షన్ చూసేసినవారికి అస్సలేమాత్రం థ్రిల్ అనిపించదు.
దాదాపుగా చాలామంది హిందీ వెర్షన్ ఆల్రెడీ చూసేశారు, దాంతో.. కొత్తగా ఏముంది.? అన్న భావన వారికి కలుగుతుంది. అయితే, కమర్షియల్ హంగులు జోడించేసి, కలగాపులగం చేసెయ్యనందుకు దర్శకుడ్ని అభినందించాలేమో. హిందీ వెర్షన్ చూడని వారికి మాత్రం సినిమా మంచి థ్రిల్ ఇస్తుంది.
సినిమా కథ మొదలైన చోట, ముగుస్తుంది.. అది ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఓవరాల్‌గా నితిన్ కోసం ఈ సినిమాని ఇంకోసారి చూసెయ్యొచ్చు. ఈ తరహా ప్రయోగాలు రీమేకుల రూపంలో కాకుండా స్ట్రెయిట్‌గా తెలుగులో జరిగితే బావుంటుందేమో.
చివరగా..
‘మాస్ట్రో’తో నితిన్ యాక్టింగ్ పరంగా ఓ మెట్టు పైకెక్కేశాడు..