Table of Contents
Mandala Murders Telugu Review.. టెక్నాలజీలో దూసుకుపోతున్నాం.. అయినాగానీ, మూఢ నమ్మకాలతో బతికేస్తాం.! ఇదీ నేటి పరిస్థితి. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. ఇదీ వాస్తవం.!
అందుకే, చేతబడి నెపంతో దారుణ హత్యలు ఇప్పటికీ జరుగుతున్నాయి. నేర సంబంధిత వార్తలకి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
మీడియాలో నేర వార్తలు అందుకే, ఎప్పటికప్పుడు సరికొత్తగా వండి వడ్డించబడతాయి. ఇందులోనూ విపరీతమైన క్రియేటివిటీని ఈ మధ్యకాలంలో చూస్తున్నాం.
Mandala Murders Telugu Review.. క్రైమ్ థ్రిల్లర్స్ అన్నీ అలాంటివే..
సినిమాలు, టీవీ సీరియళ్ళు, వెబ్ సిరీస్‌లు.. ఇలా దేన్ని తీసుకున్నా, క్రైమ్ థ్రిల్లర్స్‌కి వుండే క్రేజ్ వేరే లెవల్. దాంతో, సహజంగానే ఆ కోణంలో క్రియేటివిటీ పెరిగిపోతోంది.
‘మండల మర్డర్స్’.. ఇది కూడా ఆ కోవలోకే చెందుతుంది. ప్రముఖ బాలీవుడ్ నటి వాణీ కపూర్ నటించిన వెబ్ సిరీస్ ఇది. ఇందులో, సుర్వీన్ చావ్లా తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఓ ప్రముఖ ఓటీటీ వేదికగా ఈ ‘మండల మర్డర్స్’ స్ట్రీమింగ్ అవుతోంది. కొంతమంది మూఢ విశ్వాసాలతో, ఓ ప్రయోగం చేస్తారు. ఆ ప్రయోగం అర్థాంతరంగా ఆగిపోతుంది. అలా మొదలవుతుంది కథ.
కట్ చేస్తే, ఓ పొటో జర్నలిస్టు దారుణ హత్యకు గురవుతాడు. చేతులు, కాళ్ళు నరికేసి.. మొండెం లేకుండా, తలకి మాత్రమే ఆ చేతుల్ని, కాళ్ళనీ అతికించి నదిలో పారేస్తారు.
ఆ కేసు విచారణ కోసం రంగంలోకి దిగుతుంది సీఐబీ అధికారిణి రియా (వాణీ కపూర్). మరోపక్క, తన తల్లి ఆచూకీ కోసం ఢిల్లీ నుంచి తండ్రితో కలిసి వస్తాడు మరో పోలీస్ అధికారి విక్రమ్.
Mandala Murders Telugu Review.. రాజకీయ హత్యలా.?
రాజకీయ నాయకురాలు అనన్య భరద్వాజ్ (సుర్వీన్ చావ్లా) తన ప్రత్యర్థుల మీద ఎత్తుకు పైయెత్తులు వేస్తూ వుంటుంది. ఈ క్రమంలో ప్రత్యర్థులూ హత్యకు గురవుతుంటారు.
ఇంకో వైపు అయాస్థి మండల సభ్యులు, ఓ పరికరం ద్వారా, ‘కోరికలు నెరవేర్చుకోవాలనుకునేవారి’ నుంచి బొటన వేలిని సేకరిస్తుంటారు. చిత్రంగా, బొటన వేలు ఇచ్చేవారి కోరికలూ తీరుతుంటాయి.
ఇదెలా సాధ్యం.? బొటన వేలుని పరికరానికి ఎందుకు ఇస్తున్నారు.? హత్యలు ఎవరు చేస్తున్నారు.? చాలా ఏళ్ళ క్రితం ఆగిపోయిన ప్రయోగం మళ్ళీ చేశారా.? అసలు అయాస్థి మండల సభ్యుల లక్ష్యం ఏంటి.?
విక్రమ్ తన తల్లిని కనిపెట్టాడా.? రియాకీ అయాస్థి మండల సభ్యులకీ సంబంధమేంటి.? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే, ‘మండల మర్డర్స్’ వెబ్ సిరీస్ చూడాల్సిందే.
వాణీ కపూర్, సుర్వీన్ చావ్లా.. అదరహో..
వాణీ కపూర్ మంచి నటి. ఈ విషయం అందరికీ తెలిసిందే. గ్లామరస్ బ్యూటీ. కానీ, స్టిఫ్‌గా పోలీస్ అధికారి పాత్రకే పరిమితమైపోయింది వాణీ కపూర్.
పోలీస్ అధికారిగా వాణి కపూర్, తన పాత్రకు న్యాయం చేసింది. అనన్య భరద్వాజ్ పాత్రలో సుర్వీన్ చావ్లా మంచి నటనా ప్రతిభను కనబర్చింది. ఫుల్ మార్క్స్ పడతాయామెకి నటన పరంగా.
విక్రమ్ పాత్రలో వైభవ్ రాజ్ గుప్తా చాలా బాగా చేశాడు. శ్రియా పిల్గాంకర్, ఆదితి పోహాంకర్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్.. అన్నీ బావున్నాయి. నిర్మాణపు విలువల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఖర్చు విషయంలో రాజీ పడలేదు. రిచ్‌గానే రూపొందించారు.
వల్గర్ సీన్స్ ఏమీ లేవు. అనన్య భరద్వాజ్ పాత్రలో సుర్వీన్ చావ్లా ఓ రెండు చోట్ల, కొంచె బోల్డ్‌గా కనిపిస్తుందంతే.
న్యూక్లియర్ సైంటిస్ట్.. అలా ఎలా.?
న్యూక్లియర్ సైంటిస్ట్ అని చెబుతూ, అయాస్థి మండల సభ్యులు చెప్పే విషయాలకు కన్విన్స్ అయ్యే సాధారణ మహిళగా కీలక పాత్రధారిణిని చూపించడం సబబుగా అనిపించదు.
బొటన వేలిని ఇస్తే చాలు, ప్రాణ గండం నుంచి తమ వారు గట్టెక్కేస్తారని గుడ్డిగా నమ్మడం, ఆ నమ్మకాలు నిజమవడం.. కూడా లూప్ హోల్ అనే అనిపిస్తాయి.
లాజిక్కులు పక్కన పెడితే, ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది ‘మండల మర్డర్స్’. ఈ తరహా వెబ్ సిరీస్‌లు గతంలో చాలానే వచ్చాయి. వాటితో పోల్చకుండా, ‘మండల మర్డర్స్’ టైమ్ పాస్ కోసం చూడొచ్చు.
