Mithra Mandali Review.. వెండితెరపై డిజాస్టర్ అనిపించుకున్న ‘మిత్రమండలి’ సినిమా ఓటీటీలోకి వచ్చింది.!
సినిమా ప్రోమోస్ చూసి, థియేటర్లకు వెళ్ళి సినిమా చూడటం రిస్క్ అనిపించింది. ఓటీటీలో, రీ-ఎడిట్ చేసి విడుదల చేశామంటూ ప్రచారం చేసుకుంది ‘మిత్రమండలి’ టీమ్.
సరే, ‘రీ-ఎడిటెడ్’ వెర్షన్ అంటున్నారు కదా.. అన్న కోణంలో, కాస్త తీరిక చూసుకుని ‘మిత్ర మండలి’ సినిమాని చూడటం జరిగింది.!
నటీనటుల్లో తెలిసినవాళ్ళున్నారు.. అందులో వెన్నెల కిషోర్, సత్య, ప్రియదర్శి.. ముగ్గురూ టాలెంటెడ్. వీళ్ళు కాక, మరికొంతమంది వున్నారు.
హీరోయిన్ నిహారిక ఎన్‌ఎమ్. యూ ట్యూబర్ నిహారిక, పలువురు సెలబ్రిటీల్ని ఇంటర్వ్యూ చేసి పాపులారిటీ సంపాదించుకుంది.
ఆ మధ్య ఓ తమిళ సినిమాలో కూడా నటించింది. సినిమా గురించి చర్చ గట్టిగానే జరిగిందిగానీ, అందులో నిహారిక నటన గురించి ఎవ్వరూ మాట్లాడుకోలేదు.
Mithra Mandali Review.. అంత సీన్ లేదు అరవింద్ గారూ.!
కానీ, నిర్మాత అల్లు అరవింద్ ఎందుకో నిహారిక మీద చాలా ప్రశంసలు కురిపించేశార్ట.! నిర్మాత బన్నీ వాసు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.
సీక్రెట్ ఐడీతో, నిహారికని అల్లు అరవింద్ ఫాలో అవుతున్నారట. ఆ విషయాన్ని స్వయంగా అల్లు అరవింద్ సెలవిచ్చారు.
నిహారికకి సోషల్ మీడియాలో వున్న పాపులారిటీని క్యాష్ చేసుకోవడానికే, ‘మిత్ర మండలి’ సినిమాని తీసి వుంటారు.
సరే, కథలోకి వెళదాం.. మొత్తం నలుగురు ఆవారాగాళ్ళు. అందులో, ఇద్దరేమో హీరోయిన్‌ని చూసి ప్రేమలో పడతారు. మిగతా ఇద్దరిలో ఒకడికి నిహారిక పడిపోతుంది అనూహ్యంగా.
ఈలోగా, తన కుమార్తె లేచిపోయిన విషయాన్ని తెలుసుకున్న ఓ కుల పెద్ద, పోలీసుల్ని ఆశ్రయిస్తాడు. లేచిపోవడం కాదు, కిడ్నాప్.. అని జనాన్ని నమ్మించాలంటూ, పోలీసుతో బేరమాడతాడు.
లేచిపోవడం కాదు, నిజంగానే కిడ్నాప్ అయ్యిందని… ఆ తర్వాత హీరోయిన్ గురించి తెలుస్తుంది. మధ్యలో ‘ఇంపార్టెంట్ క్యారెక్టర్’ కథని, తనక్కావాల్సిన విదంగా మలుపులు తిప్పేస్తుంది.
రీ-ఎడిట్ వెర్షన్ చూశాక, కొన్ని సీన్స్ నవ్వు తెప్పించేలానే వున్నాయ్. అలాగని, సినిమాని భరించగలమా.? అంటే, హీరోయిన్‌ని భరించడమే కష్టమయ్యింది.
నిహారికకి ఆ స్థాయి బిల్డప్ ఇచ్చి వుండకపోతే, తనకిచ్చిన పాత్రకి.. ఎంతో కొంత న్యాయం చేయడానికి ప్రయత్నించిందేమోలే.. అని సరిపెట్టుకోవచ్చు.
ఇక్కడే, సినిమాకి దెబ్బ గట్టిగా పడింది. నిహారిక ఏం చేసేసిందో అంత గొప్పగా.. అని ఆలోచిస్తాడు సహజంగానే ప్రేక్షకుడు. ఆమె నుంచి అద్భుతాలేం లేవు.
వెన్నెల కిషోర్ కామెడీ, సత్య పోషించిన ఇంపార్టెంట్ క్యారెక్టర్.. ఓకే.! ప్రియదర్శి పూర్తిగా తేలిపోయాడు. మిగతా పాత్రధారులూ.. మమ అనిపించేశారంతే.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ కూడా ‘మమ’ అనిపించేశాయంతే. ఫక్తు కామెడీ సినిమా గనుక.. ఇతరత్రా మంచి విషయాలేవీ సినిమా నుంచి ఆశించలేం.
Also Read: అడవి పులి.! శేషాచలం అడవుల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
‘జాతి రత్నాలు’ లాంటి సినిమాలు వర్కవుట్ అవడంతో, ఆ తరహా సినిమాలు అప్పుడప్పుడూ పుట్టుకొస్తూనే వున్నాయి. కానీ, ఆ మ్యాజిక్ కొన్నిసార్లే వర్కవుట్ అవుతుంది.
మరీ, తీరిక ఎక్కువ దొరికేస్తే.. ఓటీటీలోనే వుంది గనుక.. ఫాస్ట్ ఫార్వార్డ్ పెట్టుకుంటూ.. ఓ అరగంటలో ‘మిత్ర మండలి’ సినిమా మొత్తాన్నీ ముగించేయొచ్చు.
ముందే చెప్పుకున్నట్లు.. నిహారిక గురించి ప్రమోషన్లలో ఓవరాక్షన్ చేయకుండా వుండి వుంటే.. లేదా, ఇంకో హీరోయిన్‌ని పెట్టుకుని వుంటే, ‘మిత్ర మండలి’ రిజల్ట్ ఇంకాస్త బెటర్‌గా వుండి వుండేదేమో.!
చివరగా.. అరవ కమెడియన్‌కి కీలక పాత్ర ఇచ్చి, అతనితో తెలుగు భాషని ఖూనీ చేయించాలనుకునే ప్రయత్నాల్ని తెలుగు సినీ దర్శక నిర్మాతలు మానుకుంటే మంచిది.
