సుదీర్ఘ కాలం పాటు టీమిండియాకి సేవలందించిన ‘మిస్టర్ కూల్’ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni The Cricket Legend), ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెబుతూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఆటగాళ్ళకు రిటైర్మెంట్ తప్పనిసరి. ఎందరో మహానుభావులు.. భారత క్రికెట్‌కి అద్యద్భుతమైన సేవలందించారు. ఆ లిస్ట్‌లో ధోనీ పేరు చాలా చాలా ప్రత్యేకంగా మారుతుందనడం నిస్సందేహం.
అయితే, ధోనీ (Mahendra Singh Dhoni) తర్వాత ఆ స్థాయిలో టీమిండియాకి సేవలందించే సత్తా వున్న ఆటగాడెవరు.? అన్నదే ఇక్కడ బిగ్ క్వశ్చన్. మామూలుగా ఓ బ్యాట్స్‌మెన్ లేదా ఓ బౌలర్.. ఇలా ఆటగాళ్ళ గురించి చెప్పుకుంటుంటాం. వికెట్ కీపర్ గురించి మన టీమిండియాలో చాలా అరుదుగా మాట్లాడుకునే పరిస్థితి నుంచి, అత్యద్భుతః అని మాట్లాడుకునేలా చేసింది మాత్రం మహేంద్ర సింగ్ ధోనీ మాత్రమే.
అంతకు ముందు కూడా కొందరు వికెట్ కీపర్లుగా సత్తా చాటినా, ఎమ్మెస్ ధోనీ రూటే సెపరేటు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గానే కాదు, కెప్టెన్‌గానూ అత్యద్భుతంగా టీమిండియాకి సేవలందించాడు. తన కెప్టెన్సీలో టీమిండియాకి అనూహ్యమైన విజయాలు అందించిన ధోనీని ఎప్పటికీ భారత క్రికెట్ అభిమానులు మర్చిపోలేరు.
మళ్ళీ ఆ స్థాయిలో ఇటు వికెట్ కీపింగ్ చేయగలిగి, అటు బ్యాటింగ్ చేయగలిగి, ఇంకోపక్క అవసరమైతే కెప్టెన్సీ చేయగల ఆటగాడ్ని చూడగలమా.? ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ధోనీ, టీమిండియాకి ఎంత గొప్ప సేవ చేశాడు.? అన్నదానికి నిదర్శనం, ధోనీ రిటైర్మెంట్ తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ధోనీకి ఓ అద్భుతమైన లేఖ రాయడమే.
క్రికెట్‌కీ, టీమిండియాకీ (Team India) ధోనీ చాలానే ఇచ్చాడు. అంతే కాదు, చాలామందికి స్ఫూర్తిగా నిలిచాడు. అంతేనా, ఇంకోపక్క ధోనీ భారత ఆర్మీలోనూ పనిచేస్తున్నాడు. వీటన్నిటినీ ప్రధాని మోడీ తన లేఖలో ప్రస్తావించారు. ఇదొక్కటి చాలు, ధోనీ మిగతా అందరికంటే చాలా భిన్నమైన వ్యక్తి అని చెప్పడానికి.
ఏదిఏమైనా, టీమిండియాకి ధోనీ (MS Dhoni The Cricket Legend) లాంటి మరో అత్యద్భుతమైన క్రికెటర్ అత్యవసరం. గత కొన్నేళ్ళుగా అలాంటి ఆటగాడి కోసం సెలక్టర్లు చేయని ప్రయోగాల్లేవు. కానీ, ధోనీకి రీప్లేస్‌మెంట్.. ఇప్పటిదాకా జరగలేదు. ఇకపై జరుగుతుందనీ చెప్పలేం. జరిగితే మాత్రం, అది ఇంకో అద్భుతమే అవుతుంది.