‘మెగా’ కాంపౌండ్ నుంచి ఏదన్నా కొత్త సినిమా వస్తోందంటే, ‘ఇదిగో ఇది ఫలానా సినిమాకి ఫ్రీ మేక్..’ అనే ప్రచారం తెరపైకొస్తుంటుంది. నిజానికి, చాలామంది హీరోలు రీమేకులు, ఫ్రీమేకులు చేస్తుంటారు. కానీ, ‘కాపీ’ ఆరోపణలు మాత్రం ఎక్కువగా మెగా కాంపౌండ్ (Mud Slinging On Mega Compound) మీదనే వస్తుంటాయి.
దానిక్కారణం.. ‘మెగా’ కుటుంబం మీద కొందరికి వున్న ఓర్వలేనితనమే. మెగా కాంపౌండ్‌కి చెందిన హీరోల మీద నెగెటివ్ వార్తలు వస్తే.. తద్వారా కొందరు వ్యక్తులకు కలిగే పైశాచిక ఆనందం ఓ రేంజ్‌లో వుంటుందని సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.
‘ఖైదీ నెంబర్ 150’ సినిమానే తీసుకుంటే, అది తమిళ సినిమాకి రీమేక్. అధికారికంగా తమిళ సినిమాని రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించారు.. రీమేక్ హక్కులు కొనుగోలు చేసి మరీ సినిమాని తెలుగులోకి తీసుకొచ్చారు. కానీ, అది తన సినిమాకి కాపీ.. అంటూ ఓ వ్యక్తి మీడియా ముందుకొచ్చాడు.. నానా యాగీ చేశాడు.
‘సైరా నరసింహారెడ్డి’ (Sye Raa Narasimha Reddy) సినిమా విషయంలో జరిగిన యాగీ అంతా ఇంతా కాదు. ‘మగధీర’, ‘అజ్ఞాతవాసి’.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా సినిమాలున్నాయి ఇలా వివాదాల్లోకెక్కినవి. కాదు కాదు, వివాదాల్లోకి ఎక్కించబడినవి. చివరికి ఏం సాధించినట్లు ఆ కొందరు.? ఏమీ లేదు, జస్ట్ పైశాచిక ఆనందం తప్ప.
బహుశా ఆ పైశాచిక ఆనందంతోనే కావొచ్చు.. ఇప్పుడు ‘ఆచార్య’ సినిమా మీద కూడా ‘కాపీ’ బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ సినిమా కథ తనదేనంటూ ఓ వ్యక్తి మీడియా ముందుకొచ్చాడు. అంతే, ఓ సెక్షన్ మీడియా కక్కుర్తి పీక్స్‌కి వెళ్ళిపోయింది.
చివరికి ‘ఆచార్య’ (Acharya Movie) సినిమా నిర్మాతలు స్పందించారు. దర్శకుడు కొరటాల శివ (Director Koratala Siva) కూడా ఈ వివాదంపై తన వెర్షన్‌ని విన్పించాల్సి వచ్చింది. అసలు అవతలి వ్యక్తి చెబుతోన్నది నిజమో కాదో కూడా అనవసరం. ‘మెగా కాంపౌండ్’ (Mega Star Chiranjeevi) మీద బురద చల్లే విషయం అయితే చాలు, దానికి ఓ సెక్షన్ ఆఫ్ మీడియా విపరీతమైన హైప్ ఇచ్చేస్తుంటుంది.
బహుశా ఆ సెక్షన్ ఆఫ్ మీడియానే.. ఇలా వివాదాల్ని సృష్టించేవారిని వెతికి పట్టుకుని మరీ.. మెగా కాంపౌండ్ మీద తమ అక్కసును వెల్లగక్కుతోందేమో.! కానీ, ఎన్నాళ్ళిలా.? ఏదో ఒక చోట.. ఈ కుట్రలకు ఫుల్‌స్టాప్ పడాల్సిందేనన్నది మెగా అభిమానుల ఆవేదన.
‘ఆచార్య’ సినిమాని మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తోన్న విషయం విదితమే. ఇటీవలే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ బయటకు వచ్చింది. ఆ మోషన్ పోస్టర్‌కి వచ్చిన అత్యద్భుతమైన రెస్పాన్స్ మింగుడు పడని కొందరు ఈ వివాదానికి తెరలేపినట్లుగా భావించాలేమో.