Nandamuri Taraka Ratna.. ఔను, రాజకీయమే ఊపిరి తీసింది.! నందమూరి తారక రత్న విషయంలో జరిగిందిదే. అభిమానుల ఆవేదన మాత్రమే కాదు, సాధారణ ప్రజానీకం అనుకుంటున్నదీ అదే.!
నందమూరి తారకరత్న.. నాలుగు పదుల వయసు రాకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. 2024 ఎన్నికల్లో పోటీ చేద్దామనుకున్నాడు.. రాజకీయం మొదలెట్టకుండానే శాశ్వతంగా నిష్క్రమించాడు.
స్వర్గీయ నందమూరి తారక రామారావు తనయుడు మోహనకృష్ణ తనయుడైన తారకరత్న 1983 ఫిబ్రవరి 23న జన్మించాడు.
‘ఒకటో నెంబర్ కుర్రాడు’, ‘అమరావతి’ తదితర సినిమాల్లో తారక రత్న నటించాడు. ఇటీవల ఓ వెబ్ సిరీస్‌లో కూడా తారకరత్న కనిపించాడు.
Nandamuri Taraka Ratna.. రాజకీయాల్లోకి వెళ్ళి..
తారకరత్నకి చాలా కాలంగా రాజకీయాలతో సంబంధాలున్నాయ్. తెలుగుదేశం పార్టీ తరఫున పలు ఎన్నికల్లో ప్రచారం కూడా నిర్వహించాడు.
2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయనున్నట్లు కొన్నాళ్ళ క్రితమే ప్రకటించాడు కూడా.
ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో పర్యటనలు నిర్వహించాడు. టీడీపీకి చెందిన స్థానిక నేతలతో సమావేశమవుతూ వచ్చాడు.
నారా లోకేష్ పాదయాత్రలో..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొనేందుకు వెళ్ళిన తారకరత్న, ఆ పాదయాత్ర ప్రారంభమైన రోజునే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
అంతే, ఆ అస్వస్థత గుండెపోటుగా తేలింది.. అచేతనావస్థలోనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. తొలుత కుప్పంలో వైద్య చికిత్స.. ఆ తర్వాత బెంగళూరులో వైద్య చికిత్స.
తారకరత్న కోలుకుంటున్నాడంటూ కుటుంబ సభ్యులు గత 23 రోజులుగా చెబుతూ వచ్చారు. కానీ, తారకరత్న కోలుకోలేదు.
23 రోజులుగా వెంటిలేటర్ మీదనే కృత్రిమ శ్వాస పొందుతూ వచ్చాడు.. చివరికి నేడు మహాశివరాత్రి రోజున శివైక్యం చెందాడు.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే క్రమంలో క్షణం తీరిక లేకుండా వుండడం, రాజకీయాలకు సంబంధించి కొంత ఒత్తిడికి కూడా గురవడం.. ఇవే తారకరత్న అకాల మరణానికి కారణంగా అభిమానులు భావిస్తున్నారు.
Also Read: చంపేయొద్దు.! వీలైతే బతకనిద్దాం బ్రదర్.!
అయితే మరణం అనేది చెప్పి రాదు.! కన్నడ సినీ ప్రముఖుడు పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం ఇందుకు నిదర్శనం. చిన్న వయసులో.. నిజానికి చాలా చాలా చిన్న వయసులో తారకరత్న తీవ్ర గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు.
తారక రత్న హఠాన్మరణం పట్ల యావత్ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పలువరు సినీ ప్రముఖులు తారకరత్న మృతి పట్ల ప్రగాడ సంతాపం తెలియజేస్తున్నారు.