Table of Contents
రీమేక్ సినిమాని, ఒరిజినల్ వెర్షన్‌తో ఎందుకు పోల్చాలి.? కమర్షియల్ హంగులున్న సినిమాలకి పోల్చొచ్చు తప్పు లేదు. కానీ, కంటెంట్ రిచ్ సినిమాల విషయంలో పోలిక అస్సలేమాత్రం సబబు కాదు. ‘నారప్ప’ (Narappa Review Telugu ముద్ర 369) సినిమా ఒరిజినల్ తమిళ ‘అసురన్’. తమిళ వెర్షన్ హీరో ధనుష్, తెలుగు వెర్షన్ హీరో వెంకటేష్.
కుర్ర హీరో ధనుష్, అరవయ్యేళ్ళ వ్యక్తిగా నటించడం ‘అసురన్’ సినిమా విషయంలో గొప్పతనమే. కానీ, అలా ఓ కుర్రాడు చేసిన సినిమాని, అరవయ్యేళ్ళ వ్యక్తి చేయడం కూడా చిన్న విషయమేమీ కాదు. మక్కీకి మక్కీ దించేశాడా.? మార్పులు చేశాడా.? అన్న అంశం చుట్టూ చర్చ పక్కన పెట్టి, అసలు ఆ సినిమా కథని ఇక్కడెలా ప్రెజెంట్ చేశారు, కంటెంట్ మన తెలుగు ప్రేక్షకులకి ఎలా రీచ్ అవుతుందన్నదాని చుట్టూ చర్చ జరిగితే మంచిది.
అదే అడ్డుగోడ..
గొప్పింటికీ పేదింటికీ మధ్య అగాధం ఎప్పటినుంచో వున్నదే. గొప్పగా చెప్పుకోబడ్తున్న కులాలకీ, అణగదొక్కేయబడ్డ కులాలకీ మధ్య అగాధం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ పాయింటుతో చాలా చాలా సినిమాలు వచ్చాయి, వస్తున్నాయి, వస్తూనే వుంటాయి. ‘నారప్ప’ కూడా అలాంటిదే.
ఆర్థికంగా, సామాజికంగా బలహీనమైన ఓ కుటుంబానికి పెద్ద నారప్ప. గొప్ప కుటుంబానికి (సామాజికంగా ఆర్థికంగా) ఎదురుతిరిగిన కొడుకు అత్యంత కిరాతకంగా చంపబడితే, పగ తీర్చుకోవాల్సిన ఆ తండ్రి, కొడుకుని కోల్పోయిన దుఖాన్ని దిగమింగుకుని, మిగిలిన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆరాటపడతాడు. ఈ క్రమంలో పెద్ద కొడుకులానే, చిన్న కొడుకు కూడా ఆవేశపడి, ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటే, ఆ చిన్న కొడుకుని, కూతుర్ని, భార్యనీ ఎలా కాపాడుకున్నాడన్నదే మిగతా కథ.
కథలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. కొంత సాగతీతకు గురైనట్లు కనిపించడం.. యువకుడి పాత్రకి వెంకటేష్ అసలు వయసు ఇబ్బందికరంగా మారడం.. ఇవన్నీ అంత ప్రస్తావించుకోదగ్గ, విమర్శించదగ్గ విషయాలు కావేమో. అన్నీ తెలిసే ఈ కథలోకి పరకాయ ప్రవేశం చేయాలనుకున్న విక్టరీ వెంకటేష్ (Narappa Review Telugu ముద్ర 369) తెగువని మెచ్చుకుని తీరాల్సిందే.
వెంకటేష్ స్క్రీన్ ప్రెజెన్స్.. చాలా సందర్భాల్లో ఆశ్చర్యం గొలుపుతుంది. మనకు తెలియకుండానే సినిమాలో లీనమైపోతుంటాం. థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఓటీటీలోనే కలిగించిందంటే బహుశా అది వెంకటేష్ నటనా ప్రతిభవల్లే కావొచ్చు. నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ.. ఇలా అన్నీ ఈ సినిమాకి బాగా కుదిరాయి. డైలాగులు కూడా అంతే.
విక్టరీ వెంకటేష్ వన్ మ్యాన్ షో..
నో డౌట్.. ఇది వెంకటేష్ వన్ మ్యాన్ షో. అలాగని, మిగతా నటీనటులెవర్నీ తక్కువ చేయలేం. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో కనిపించిన అమ్ము అభిరామి, నారప్ప సతీమనిగా నటించిన ప్రియమణి, నారప్ప పెద్ద కొడుకు, చిన్న కొడుకు.. ఇలా ఎవరికి వారే.. కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారనడం అతిశయోక్తి కాకపోవచ్చు.
బాధ్యత లేని తండ్రిగా కనిపిస్తాడు.. కుటుంబాన్ని కాపాడుకునేందుకు తాపత్రయపడే తండ్రిగా కనిపిస్తాడు.. చేవచచ్చినోడిలా కనిపిస్తాడు.. అంతలోనే అరివీరభయంకరుడిలా కనిపిస్తాడు. చాలా వేరియేషన్స్ వున్నాయి నారప్ప పాత్రలో. ఎక్కడా వంక పెట్టలేం వెంకటేష్ నటనకి.
ఒరిజినల్ వెర్షన్ ‘అసురన్’లో ధనుష్ ఎలా చేశాడన్నది అప్రస్తుతం. ఆ సినిమా చూసి, ‘నారప్ప’ని విశ్లేషించాలనుకుంటే, చెయ్యగలిగేదేమీ లేదు. కానీ, రెగ్యులర్ కమర్షయిల్ సినిమా చేయాలన్న ఆలోచన పక్కన పెట్టి, ఓ మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చెయ్యాలన్న తపన, మంచి పాత్రలో కనిపించాలన్న ఆరాటం.. ఇవన్నీ నటుడిగా వెంకటేష్ స్థాయిని మరింత పెంచాయన్నది నిర్వివాదాంశం.
అవి లేవు, ఇవి లేవు.. వుండాల్సినవన్నీ వున్నాయ్..
కామెడీ లేదు, పాటల్లో డాన్సులు లేవు.. అక్కడక్కడా సినిమాలో వేగం తగ్గింది.. మక్కీకి మక్కీ దించేశారు.. ఇవన్నీ ఇలాంటి సినిమాలకు అస్సలు వర్తించవు. ఎందుకంటే, ఇది సినిమానే కాదు.. అంతకు మించి. ఓటీటీలో మాత్రమే కాదు, ఇంకోసారి థియేటర్లలోనూ చూడాల్సిన సినిమానే. బిగ్ స్క్రీన్ మీద వెంకటేష్ నట విశ్వరూపాన్ని తిలకిస్తే ఆ కిక్కే వేరప్పా.
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకి ఇది నిజంగానే చాలా భిన్నమైన, చాలా చాలా ప్రత్యేకమైన సినిమా అవుతుందన్నది నిర్వివాదాంశం. ఇలాంటి సినిమాల్ని తీయగలడా.? అన్న ప్రశ్నకు, ‘నారప్ప’ సినిమాతోనే (Narappa Review Telugu ముద్ర 369) తగిన సమాధానమే ఇచ్చాడు శ్రీకాంత్ అడ్డాల.
కాగా, అడ్వొకేట్ పాత్రలో రావు రమేష్, నారప్ప బావమరిదిగా రాజీవ్ కనకాల అలాగే ఇతర పాత్రల్లో నాజర్, బ్రహ్మాజీ తదితరులు తమ అనుభవాన్ని రంగరించారు.. ఆయా పాత్రలకు మరింత వన్నె తెచ్చారు.