Table of Contents
Narivetta Telugu Review.. మలయాళ సినిమాల్లో పేస్ కొంచెం తక్కువ వుంటుందనే విమర్శ ఈనాటిది కాదు.
అదే సమయంలో, అత్యంత వేగంగా కథని నడిపించడంలోనూ మలయాళ సినీ మేకర్స్ తమదైన ప్రత్యేకతను చాటుకున్న సందర్భాలు బోలెడున్నాయ్.
అందుకే, మలయాళ సినిమాల్ని డబ్ చేయడం, రీమేక్ చేయడం.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఓటీటీ పుణ్యమా అని, మలయాళ సినిమాలు మరింతగా చేరువయ్యాయి తెలుగు సినీ ప్రేక్షకులకి.
అలా వచ్చిన సినిమాల్లో ‘నరివెట్ట’ ఒకటి.! టొవినో థామస్ ఈ సినిమాలో లీడ్ రోల్ చేశాడు. సూరజ్ వింజరమూడి, చేరన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.
ప్రియంవద కృష్ణన్ ఈ ‘నరివెట్ట’ సినిమాలో టొవినో థామస్‌కి జోడీగా నటించింది.
Narivetta Telugu Review. నరివెట్ట కథ కమామిషు ఏంటంటే..
ఉన్నతమైన ఉద్యోగం చేయడం కోసం, వచ్చిన చిన్న చిన్న అవకాశాల్ని వదిలేసుకుంటూ బలాదూర్‌లా తిరుగుతుంటాడు వర్గీస్ పీటర్ (టొవినో థామస్).
వర్గీస్ పీటర్‌కి ఓ గర్ల్ ఫ్రెండ్ సోఫియా (ప్రియంవద కృష్ణన్) కూడా వుంటుంది. వీరిద్దరి ప్రేమకి, సోఫియా తండ్రి అడ్డం పడతాడు. ఉద్యోగం సద్యోగం లేనోడివంటూ అవమానిస్తాడు.
ఇంట్లోవాళ్ళని ఒప్పించాలంటే, వర్గీస్‌కి ఏదో ఒక ఉద్యోగం వుండాల్సిందేనని సోఫియా తేల్చి చెబుతుంది. ఇంకో వైపు, ఇల్లు గడవడానికి తల్లి పడుతున్న కష్టం కూడా వర్గీస్‌ని ఆలోచనలో పడేస్తుంది.
పోలీస్ ఉద్యోగంలో చేరాక, వయనాడ్ అనే ప్రాంతంలో ఆందోళనలు చేస్తున్న గిరిజనుల్ని అడ్డుకునేందుకు వెళ్ళే బెటాలియన్‌లో వర్గీస్‌తోపాటు, బషీర్ అనే మరో పోలీస్ కూడా వుంటాడు.
బషీర్‌ని ఎవరు చంపారు.?
వర్గీస్, బషీర్ మధ్య మంచి అనుబంధం వుంటుంది. అయితే, ఆ గిరిజన ప్రాంతంలోనే బషీర్ హత్యకు గురవుతాడు. దాంతో, తీవ్రంగా మానసిక వేదనకు గురవుతాడు వర్గీస్.
బషీర్ హత్య వెనుక మిస్టరీని ఛేదించే ప్రయత్నంలో షాకింగ్ విషయాలు తెలుసుకుంటాడు వర్గీస్. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది.? అన్నది సినిమా చూస్తేనే తెలుస్తుంది.
టొవినో థామస్ మంచి నటుడు. అతని నటనా ప్రతిభకు తగ్గ పాత్ర అయితే కాదిది. సూరజ్ వింజరమూడి విషయంలోనూ అదే జరిగింది. చేరన్ ఓకే. హీరోయిన్ ప్రియంవద కృష్ణన్ పాత్రకీ పెద్దగా ప్రాధాన్యత లేదు.
సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. సినిమాలో చాలా సీన్లకు కత్తెర పదును బాగా చూపించి వుండాల్సిందే. మూడో వంతు ఫుటేజ్ కట్ చేసినా, కథకి పెద్దగా ఇబ్బంది ఏమీ వుండదు.
స్క్రీన్ ప్లే చప్పగా..
ఈ తరహా సినిమాలకు పరుగులెట్టే స్క్రీన్ ప్లే అవసరం. ఎమోషన్స్ కూడా బలంగా వుండాలి. యాక్షన్ బ్లాక్స్ కూడా వుంటే, అడ్వాంటేజ్ అవుతుంది.
కానీ, అవేమీ లేవు. చప్పగా సాగుతుంది సినిమా. సినిమాని మొదలుపెట్టిన విధానం బాగానే వున్నా, ఆ తర్వాత వేగం తగ్గింది. హీరోయిన్ ట్రాక్, పంటి కింద రాయిలా వుంటుంది.
ఓటీటీలో ఉచితమే కాబట్టి, టైమ్ పాస్ కోసం ఓ లుక్కేయొచ్చు. కానీ, ఆ తర్వాత టైమ్ వేస్ట్.. అన్న భావన ఖచ్చితంగా కలుగుతుంది.
రేసీ స్క్రీన్ ప్లే, బలమైన ఎమోషన్స్ వుండి వుంటే, మంచి సినిమా అయి వుండేది ‘నరివెట్ట’.!