క్రికెట్‌లో నో బాల్ గురించి అందరికీ తెలుసు. ఫ్రీ హిట్ గురించీ విన్నాం. ‘ఫ్రీ బాల్’ అనే కాన్సెప్ట్ మాత్రం కొత్తదే. ఈ ‘ఫ్రీ బాల్’ అంశాన్ని తెరపైకి తెచ్చింది ఇంకెవరో కాదు, టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. కొన్నాళ్ళ క్రితం అశ్విన్, మన్కడింగ్ (Ravichandran Ashwin Mankading) చేస్తే.. అది పెను దుమారమే రేపింది.
బౌలర్, బౌలింగ్ చేసేటప్పుడు.. ఇంకో ఎండ్‌లో వున్న బ్యాట్స్‌మెన్ క్రీజ్ దాటి ముందుకు వెళితే, దాన్ని అదనుగా చేసుకుని బౌలర్, తన పక్కనే వున్న వికెట్లను బాల్‌తో పడగొట్టి, రనౌట్ చేయడమే మన్కడింగ్. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమంటే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ నానా యాగీ చేశాడు.
క్రికెట్ అనేది జెంటిల్‌మెన్ గేమ్.. కానీ, అది ఒకప్పుడు. ఇప్పుడు క్రికెట్‌లో చాలా చాలా మార్పులొచ్చాయి. బంతిని విసిరే క్రమంలో బౌలర్, క్రీజ్ దాటితే.. దాన్ని ‘నో బాల్’ అంటాం. తద్వారా బ్యాట్స్‌మెన్‌కి ‘ఫ్రీ హిట్’ లభిస్తుంది.
ఫ్రీ హిట్ రాగానే బ్యాట్స్‌మెన్ బంతిని బ్యాటుతో బలంగా బాదేస్తాడు ముందూ వెనుకా చూడకుండా. ఎందుకంటే, ఆ బ్యాల్ క్యాచ్ గా మారినా ఔటయ్యే అవకాశం వుండదు. దాంతో బౌలర్ చాలా ఒత్తిడిని ఎదుర్కొనాల్సి వస్తుంది. మరి, ఇంకో ఎండ్‌లో వున్న బ్యాట్స్‌మెన్, బౌలర్ బంతి విసరకుండానే క్రీజ్ దాటినప్పుడు మన్కడింగ్ తప్పెలా అవుతుంది.?
పైగా, ఇలా మన్కడింగ్ జరిగినప్పుడు.. బౌలర్‌కి బోనస్ ఇవ్వడం అన్న ఆలోచన కూడా సబబైనదే. ప్రత్యర్థి టీమ్ నుంచి ఐదు పరుగులు తగ్గించాలని ఈ ‘ఫ్రీ బాల్’ గురించి రవిచంద్రన్ అశ్విన్ ప్రతిపాదించాడు. కానీ, దీన్ని ఐసీసీ పరిగణనలోకి తీసుకుంటుందా.? బీసీసీఐ అయినా రవిచంద్రన్ అశ్విన్‌కి అండగా నిలుస్తుందా.? కనీసం ఐపీఎల్ ద్వారా అయినా ఈ ఆలోచనని అమలు చేసే అవకాశముంటుందా.? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
క్రికెట్‌లో ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులు వస్తున్నాయి. ఆ లెక్కన, ఇది కూడా అమల్లోకి వస్తే.. ఇదీ ఓ ఆసక్తికరమైన మార్పు అవుతుంది. ‘క్రీడా స్ఫూర్తి దెబ్బతినే అవకాశముంది..’ అని కొందరు అభిప్రాయపడుతున్నా.. మోడ్రన్ క్రికెట్‌లో ఆ క్రీడా స్ఫూర్తి ఎప్పుడో అటకెక్కిందన్నది మెజార్టీ క్రికెట్ అభిమానుల అభిప్రాయం.
అన్నట్టు, ఈసారి ఐపీఎల్‌లో కూడా ‘మన్కడింగ్’ (Ravichandran Ashwin Mankading) గట్టిగానే జరిగే అవకాశముందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.