ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ని పిల్లలకు ఎంత దూరంగా వుంచితే అంత మంచిదంటూ నిపుణులు హెచ్చరిస్తున్నా, అవి రోజువారీ అవసరాలుగా మారిపోతూనే వున్నాయి. కరోనా వైరస్ పుణ్యమా అని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ (Online Studies) పిల్లలకు, పెద్దలకు అత్యవసరాలుగా మారిపోయాయన్నది నిర్వివాదాంశం.
స్మార్ట్ ఫోన్లలోనే చదువు.. స్మార్ట్ ఫోన్లలోనే నితావ్యసర వస్తువుల కొనుగోళ్ళు.. ఇలా ఒకటేమిటి.? ఇప్పుడంతా స్మార్ట్ యుగం. ఇప్పుడిక ఎవరూ ‘స్మార్ట్’ కాకుండా వుండలేరు. ఎందుకంటే, అవసరాలు అలాంటివి. ప్రధానంగా చిన్న పిల్లల విషయానికొస్తే, పాఠ్యాంశాలన్నీ వారికి స్మార్ట్ ఫోన్లలోనే అయిపోతున్నాయి.
ప్రభుత్వాలు, కొత్త విద్యా సంవత్సరంపై నిర్ణయం తీసుకోకుండానే ప్రైవేటు విద్యా సంస్థలు విద్యా బోధన మొదలు పెట్టేసిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో అప్పో సప్పో చేసి, పిల్లల కోసం ప్రత్యేకంగా స్మార్ట్ ఫోన్లను తల్లిదండ్రులు కొనుగులు చేయాల్సి వచ్చింది.
ఉదయం నుంచి సాయంత్రం వరకూ చదువుల కోసం ఆ స్మార్ట్ ఫోన్ల ముందే అతుక్కుపోవాల్సి వస్తోంది విద్యార్థులకు. ప్రత్యక్ష విధానంలో విద్యాభ్యాసానికీ, ఇలా స్మార్ట్ ఫోన్లలో విద్యాభ్యాసానికీ చాలా తేడా వుంది. పిల్లల్లో అర్థం చేసుకునే శక్తి క్రమక్రమంగా తగ్గిపోతోంది.
మెరిట్ స్టూడెంట్స్ కూడా విద్యాభ్యాసంలో వెనకబడిపోతున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. కానీ, తప్పదు.. ప్రస్తుతం ఇంకో మార్గం లేదు. అలాగని పిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడగలమా.? ఈ ఆవేదన తల్లిదండ్రుల్లో స్పష్టంగా కన్పిస్తోంది.
కంటి సమస్యలు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో పిల్లలు ఇబ్బందులు పడుతోంటే, తల్లిదండ్రులకు అది నరకప్రాయంగా మారుతోంది. నిజానికి, విద్యాభ్యాసం కోసం స్మార్ట్ డివైజ్‌లను వాడటం విద్యార్థులకు (Online Studies) ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదు. కానీ, వాటి వాడకం ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది.
కాదు కాదు, అదొక్కటే మార్గమైపోయింది. అదే అసలు సమస్య. టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సిందే. కానీ, తద్వారా వచ్చే సమస్యలకు చెక్ పెట్టేదెలా.? ఇదే ఇప్పుడు అందరి ముందున్న పెను సవాల్.
ఇక్కడ ఎవర్నీ నిందించలేం. కానీ, మానవీయ కోణంలో ఆలోచించి, విద్యార్థుల ఆరోగ్య, మానసిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి వుంది.