Table of Contents
విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై (YS Jaganmohan Reddy) జరిగిన దాడిని జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్‌కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఈ హత్యాయత్నాన్ని ప్రజాస్వామ్యవాదులంతా ముక్త కంఠంతో ఖండించాలని జనసేన అధినేత అన్నారు. జనసేన పార్టీ (Jana Sena Party) ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తోందని పవన్‌కళ్యాణ్ (Pawan Kalyan) చెప్పారు. ఈ హత్యాయత్నం అమానుషమని అన్నారాయన.
ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు జరగకూడదని జనసేన పార్టీ బలంగా విశ్వసిస్తోందని పేర్కొంటూ, వైఎస్ జగన్ త్వరగా కోలుకోవాలని పవన్‌కళ్యాణ్ ఆకాంక్షించారు. అలాగే, ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి, కుట్రకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పవన్‌కళ్యాణ్. ఇంకోసారి ఇలాంటి ఘటనలు పునరావృతి కాకూడదని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
కోలుకుంటున్న వైఎస్ జగన్
విశాఖ విమానాశ్రయంలో దాడి జరిగిన వెంటనే, వైఎస్ జగన్‌కి (YS Jagan) ప్రాథమిక వైద్య చికిత్స అందించారు అక్కడి వైద్యులు. ఆ తర్వాత జగన్, హైద్రాబాద్‌కి పయనమయ్యారు. హైద్రాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న జగన్ ఆ తర్వాత, హైద్రాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రికి వెళ్ళారు. అక్కడ ఆయన్ని పరీక్షించిన వైద్యులు, చేతికి చిన్నపాటి శస్త్ర చికిత్స నిర్వహించారు. గాయానికి కుట్లు వేయడంతోపాటుగా, కత్తి గుచ్చుకున్న ప్రాంతంలో ‘శాంపిల్స్’ని సేకరించారు. కత్తికి విషం ఏమైనా పూసారా? అన్న కోణంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గాయానికి కుట్లు వేసిన అనంతరం, జగన్‌కి విశ్రాంతి అవసరమని తెలిపారు వైద్యులు.
అభిమానుల్ని ఉద్దేశించి జగన్ ట్వీట్
ట్విట్టర్‌లో అభిమానుల్ని ఉద్దేశించి వైఎస్ జగన్ ట్వీట్ (YS Jagan Tweet) చేశారు. తాను క్షేమంగానే వున్నాననీ, ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. ప్రజా బలం తనను కాపాడిందనీ, మీ అందరి అభిమానంతో తాను త్వరగా కోలుకుంటానని చెప్పారు. ఇలాంటి ఘటనలకి భయపడే ప్రసక్తే లేదనీ, రెట్టించిన ఉత్సాహంతో ప్రజల్లోనే వుంటానని వైఎస్ జగన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కుట్రల్ని జయించే ధైర్యం తనకుందని అన్నారు వైఎస్ జగన్.
చంద్రబాబు సర్కార్‌పై బీజేపీ విమర్శలు
గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిపై దాడి చేయించిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి (Telugu Desam Party) వుందని ఆరోపించారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు (GVL Narasimha Rao). ఆ అనుభవంతోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణపైనా (Kanna Lakshmi Narayana) టీడీపీ (TDP) దాడి చేయించిందనీ, ఇప్పుడు జగన్ మీద జరిగిన కూడా అలాంటిదే అయి వుంటుందన్న అనుమానం తనకుందని జీవీఎల్ చెప్పారు. చంద్రబాబు (Chandrababu) చేయించే విచారణలతో తమకు నమ్మకం లేదన్న జీవీఎల్, అత్యున్నత స్థాయి విచారణ.. అత్యంత నిష్పక్షపాతంగా జరిపి, నిజాలు నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.
జగన్‌పై దాడిని ఖండించిన మంత్రులు
గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao), ఆది నారాయణరెడ్డి (Adi narayana reddy), నక్కా ఆనంద్‌బాబు (Nakka Anand babu) తదితర మంత్రులు వైఎస్ జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడిని ఖండించారు. అయితే, జగన్ విశాఖలో వైద్య చికిత్స పొందే అవకాశాన్ని కాదనుకుని హైద్రాబాద్‌కి వెళ్ళడం పట్ల మంత్రులు ఆక్షేపణ వ్యక్తం చేశారు.
గాయం చిన్నదేనని జగన్‌కి కూడా తెలుసనీ, ఆయన హైద్రాబాద్‌కి వెళ్ళేలోపు రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేందుకు ప్రయత్నించారని మంత్రులు ఆరోపించారు. ఆపరేషన్ గరుడలో భాగంగా ఇలాంటి దాడులు జరుగుతాయని గతంలోనే సమాచారం అందిందనీ, ఇది బీజేపీ కుట్ర అని అంటున్నారు మంత్రులు. రాష్ట్రంలో శాంతి భద్రతలు గనుక పటిష్టంగా లేకపోతే, ఇన్ని నెలలపాటు, ఇన్ని వేల కిలోమీటర్ల ప్రజా సంకల్ప యాత్ర ఇంత సజావుగా వైఎస్ జగన్ ఎలా చేపట్టేవారని మంత్రులు ప్రశ్నించారు.