పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), వరుసగా రెండు సినిమాలకు కమిట్ అయిన సందర్భాలే లేవు. అలాంటిది.. ఒకదాని తర్వాత ఒకటి.. ఇలా ఏకంగా ఐదు సినిమాలకు కమిట్ అయిపోవడమంటే చిన్న విషయమా.? ఇప్పటికైతే ‘ఐదు’ ప్రాజెక్టులు క్లియర్‌గా కనిపిస్తున్నాయి.
అందులో సెట్స్ మీదకు రెండు వెళ్ళాయి కూడా. ఆ రెండిట్లో ఒకటి చాలావరకు షూటింగ్ పూర్తయిపోయింది. అదే ‘వకీల్‌సాబ్’. ఇంకోటి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా. ఇక, మూడోది హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందాల్సిన సినిమా.
వీటితోపాటే, సురేందర్‌రెడ్డి డైరెక్షన్‌లో రామ్ తాళ్ళూరి నిర్మించే సినిమా కూడా ఓకే అయ్యింది. అంటే, ఇక్కడికి నాలుగన్నమాట. తాజాగా ఐదో సినిమా అనౌన్స్ అయ్యింది. బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ‘దేవుడు కరుణించాడు’ అంటూ భక్తుడు బండ్ల గణేష్, తన దేవుడు పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకొస్తూ, తమ కాంబినేషన్‌ని అనౌన్స్ చేశాడు.
పవన్ కళ్యాణ్ ఇదే ఊపులో ఇంకో రెండు మూడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముందంటూ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కరోనా దెబ్బ కొట్టిందిగానీ, లేకపోతే.. ఈపాటికి ‘వకీల్ సాబ్’ విడుదలైపోయి, క్రిష్ సినిమా చాలావరకు షూటింగ్ ఓ కొలిక్కి వచ్చేసేదే.
ఏమో, హరీష్ సినిమా కూడా పట్టాలెక్కేసి వుండేదేమో. కానీ, పవన్ అభిమానుల ఆశలన్నిటినీ కరోనా నీరుగార్చేసింది. అయితేనేం, పవన్ నుంచి సినిమా ఎప్పుడొచ్చినా.. జాతరలో హంగామా పెరుగుతుందే తప్ప తగ్గే ప్రసక్తే లేదు.
2024 ఎన్నికలకు ఇంకా చాలా సమయం వుంది. ఈలోగా ఓ పక్క సినిమాలు చేస్తూ, ఇంకో పక్క జనసేన పార్టీ వ్యవహారాల్ని చక్కబెట్టగల ప్లానింగ్ జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి వుంటుందన్నది నిర్వివాదాంశం.
ఏదిఏమైనా, పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) నుంచి ఈ ఊపు మాత్రం ఆయన అభిమానుల్ని ఉర్రూతలూగించేస్తోందని నిస్సందేహంగా చెప్పొచ్చు.