Table of Contents
Political Digital Campaign.. వాట్సాప్ యూనివర్సిటీలూ, ఫేస్ బుక్ పెపంచాలూ, ఇన్‌స్టా గ్రామ్ ఇచ్చిత్తరాలూ.. వీటితోపాటే యూ ట్యూబు తైతక్కలు.. అహో వీటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత మజా దొరుకుతుంది ఇందులో. ట్రోలింగులూ, షేమింగులూ, వాట్ నాట్.. ఇక్కడ దొరికే దరిద్రం అంతా ఇంతా కాదు.
ఆగండాగండి.. సోషల్ మీడియాని మరీ అంత చెడుగా ఊహించేసుకోవద్దు. నాణానికి రెండు వైపులున్నట్లే సోషల్ మీడియాకీ ‘మంచి – చెడు’ అనే రెండు కోణాలున్నాయ్. ఎవడు ఏది వెతుక్కోవాలనుకుంటే, అది దొరుకుతుంది.
ఏహ్యాభావం పెంచుకుందామా.? తుంచేద్దామా.?
ఒక వ్యక్తి మీద విపరీతమైన ఏహ్య భావం పెంచుకుంటే, అలాంటి కంటెంటే దొరుకుతుంది. అదే మనిషిలో గొప్పతనం చూడగలిగితే, ఆ మంచితనమూ దొరుకుతుంది. అద్భుతాలూ కనిపిస్తాయ్.. అదఃపాతాళానికి మనల్ని పడేసే పైత్యపు పోకడలూ వుంటాయ్.

దురదృష్టమేంటంటే, మంచి కంటే చెడుకే ఎక్కువ పాపులారిటీ. అసలు విషయానికి వచ్చేద్దాం. కోవిడ్ ప్యాండమిక్ కారణంగా ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతుంది. యూపీ సహా పలు రాష్ర్టాల ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు డిజిటల్ ప్రచారాలు షురూ చేశాయ్. ప్రచారం ద్వారా ఓటర్ దేవుళ్ల మదిలో తమదైన ‘ముద్ర’ వేసేందుకు తమతహలాడుతున్నాయ్.
Political Digital Campaign.. ఇదోరకం రాజకీయం.!
నిజానికి ఇది కొత్తగా పుట్టుకొచ్చిన పోకడ కాదు. 2019 ఎన్నికల్లోనూ, ఆ మాటకొస్తే, 2014 ఎన్నికల్లోనూ ఈ డిజిటల్ ప్రచారం గట్టిగానే సాగింది. రోజు రోజుకీ, సాంకేతికత పెరుగుతోంది. ఎక్కువ మందికి సోషల్ మీడియా అందుబాటులోకి వస్తోంది. దాంతో పైత్యమూ పెరిగిపోతోంది.
Also Read: అహంకారమే దిగజారుడుతనమై.! నెట్టింట్లో ఎందుకీ పైత్యం.?
రాజకీయ పార్టీలు లేదా రాజకీయ నాయకులు తమ ఘనతల గురించి గొప్పగా చెప్పుకోవడం తగ్గించి అవతలి వ్యక్తుల లేదా, అవతలి పార్టీల స్థాయిని తగ్గించేలా కుట్రపూరిత ప్రచారాలు చేయడం ఎక్కువైంది.
‘వ్యక్తిత్వ హననం’ మీదనే ఫోకస్ పెట్టి కొందరు రాజకీయ వ్యూహ కర్తలు, ఆయా రాజకీయ పార్టీలనూ, రాజకీయ నాయకులనూ టార్గెట్ చేస్తున్నారు. ఈ వ్యూహ కర్తల ముసుగేసుకున్న రాజకీయ రాబందులు వ్యవస్థల్ని సర్వ నాశనం చేసేస్తున్నాయ్.
పొలిటికల్ పాపాత్ములీ వ్యూహకర్తలు..
అయినాగానీ, ఈ ‘వ్యూహ కర్తలు’ అనబడే, పొలిటికల్ పాపాత్ములకి గిరాకీ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ప్రజలకు మేలు చేసేలా పరిపాలిస్తామంటూ పద్ధతైన ఎన్నికల వాగ్ధానాలు చేయాల్సిన రాజకీయ పార్టీలు ప్రజల్ని బిచ్చగాళ్లుగా మార్చేందుకు సంక్షేమ పథకాల పేరుతో నీచ, నికృష్ట నాటకాలాడుతున్నాయ్.
ఇలాంటి రాజకీయ నాటకాలకు ‘డిజిటల్ వేదిక’ బహు చక్కగా వుపయోగపడుతోంది. వైరల్ కంటెంట్ మీద పెడుతున్న శ్రద్ధలో పదో వంతు కూడా తమ జీవితాలు ఏమైపోతాయో.? అన్న దానిపై చాలా మంది దృష్టి పెట్టలేకపోతున్నారు. అదే అన్ని అనర్ధాలకూ కారణం.
Also Read: ‘ఛీ’పు లిక్కరు.. మందు బాబులూ మీకర్ధమౌతుందా.?
వర్చువల్ మీటింగులూ, యూ ట్యూట్ వీడియోలూ, ఫేస్ బుక్ కథలు, వాట్సాప్ మెసేజ్‌లు, ఇన్‌స్టా గ్రామ్ స్టోరీలు.. ఇలా ఎక్కడ చూసినా పొలిటికల్ చెత్తే. ఓ రకంగా చెప్పాలంటే, ఈ ‘డిజిటల్ వేదిక’ రాజకీయ నాయకులకూ, పార్టీలకూ వరం. ప్రజలకేమో శాపం. ఎందుకంటే, ప్రజలు ప్రత్యక్షంగా పార్టీలనీ, నాయకుల్నీ నిలదీసే అవకాశం కోల్పోతున్నారు కాబట్టి.