ఇదేదో సినిమా స్టోరీ అనుకునేరు. ఇది సామాన్యుడి వ్యధ. ప్రభుత్వాలు అప్పు చేస్తే నాకేంటి నష్టం.? అని చాలామంది పౌరులు అనుకోవడం సహజం. ప్రభుత్వాలు అప్పు (Political Loan A Big Pain For People) చేయడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. ఎవరు ఎంత ఎక్కువ అప్పు చేస్తే అంత గొప్ప.. అన్నట్టు తయారైంది పరిస్థితి.
ధనిక రాష్ట్రమైనా, పేద రాష్ట్రమైనా.. అప్పులు చేయాల్సిందే. కేంద్ర ప్రభుత్వం కూడా అప్పులు చేయక తప్పడంలేదు. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేస్తున్నాయి సరే, వాటిని తీర్చాల్సిందెవరు.? ఇంకెవరు, ప్రజలే. ప్రభుత్వాలు చేసే అప్పుల్ని ప్రజలెలా తీర్చుతారు.? అంటే, పెరిగే పన్నులను భరించడం ద్వారా.
Also Read: విద్యావ్యవస్థకి డబ్బు జబ్బు.. నేరమెవరిది.? శిక్ష ఎవరికి.?
పెట్రో ధరలు ఆకాశాన్నంటుతున్నా, జనం కిమ్మనడంలేదెందుకు.? గగ్గోలు పెట్టినా ఉపయోగం వుండదు గనుక. ఒకప్పటి ప్రజా పోరాటాల్లేవిప్పుడు. వున్నవన్నీ రాజకీయ ఆరాటాలు మాత్రమే. వాటికి తలొగ్గడం ఎప్పుడో మానేశాయి ప్రభుత్వాలు.
అధికారంలో వున్నోడు పండగ చేసుకుంటాడు.. అధికారం కోల్పోయినోడు గట్టిగా ఆరుస్తాడు. ఇదొక నెవర్ ఎండింగ్ స్టోరీ. అప్పు చేసినా, సంక్షేమ పథకాల రూపంలో ప్రజల జేబుల్లోకే డబ్బులు పంపిస్తున్నామన్నది కొన్ని ప్రభుత్వాల వాదన. ప్రజల జేబుల్లోకి ఎలా పంపిస్తున్నారో.. ఆ జేబులకి ఎలా ప్రభుత్వాలు చిల్లులు పెడుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే.
Also Read: బురదలో కూరుకుపోయిన జర్నలిజం.. సమాజానికి హానికరం.!
సొమ్మెవడిది.? సోకెవడిది.? ప్రభుత్వాలు చేసే అప్పుల ద్వారా ప్రజలకు మేలు జరిగినా, జరగకపోయినా.. ఆ అప్పులకి అసలు.. వడ్డీ కట్టాల్సింది ప్రజలే. కానీ, పబ్లిసిటీ మాత్రం అప్పులు చేసేటోళ్ళకి. ఔను, ఆయా సంక్షేమ పథకాలకి సొంత పేర్లు పెట్టి మరీ ప్రచారం చేసుకుంటున్నారు కదా.?
‘ఒళ్ళు తెలియకుండా అప్పులు చేసేస్తున్నారు.. రాష్ట్రం ఏమైపోతుంది.? దేశం ఏమైపోతుంది.?’ అని ప్రతిపక్షంలో వున్నప్పుడు ప్రశ్నించినవాళ్ళే, అధికారంలోకి వచ్చాక.. ‘అప్పులు చేయకపోతే ఎలా.? అప్పులు చేసినా, ప్రజల్ని ఉద్ధరించేస్తున్నాం కదా.?’ అంటూ ఎదురు ప్రశ్నిస్తారు. ఇది కలికాలం. ఇక్కడ రాజకీయాలు ఇలానే వుంటాయ్.
Also Read: ప్రజలు.. ప్రభువులు.. కానుకలు.! ఇదేం ప్రజాస్వామ్యం.?
చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవా.. అన్నట్టు, ఓటేసినోడికి.. ఆ స్థాయిలో అప్పుల పాపం అంటుకోకపోతే ఎలా.?