Pragathi Mahavadi Power Lifting.. సినీ నటిగా ఆమె ఎప్పుడో గెలిచింది. నటిగా తనదైన ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకోవడం కన్నా నటీనటులకు, గొప్ప గెలుపు ఇంకేముంటుంది.?
అయినాగానీ, సినీ ప్రముఖులకు ట్రోలింగ్ అనేది చికాకు వ్యవహారంగా మారిపోయిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో వేధింపుల్ని నటీనటులు తాళలేకపోతున్నారు.
సినీ నటి ప్రగతి కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రగతి పోస్ట్ చేసే ఫిట్నెస్ వీడియోలపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతూ వుండేది.
‘ఈ వయసులో నీకు ఇవన్నీ అవసరమా.?’ అంటూ ప్రగతి మీద దారుణాతి దారుణమైన కామెంట్స్ పడ్డాయి సోషల్ మీడియా వేదికగా. మార్ఫింగ్ ఫొటోలు, వీడియోల సంగతి సరే సరి.
అంత అసభ్యకరమైన ట్రోలింగ్‌ని ఎదుర్కొన్నా, ప్రగతి తన టార్గెట్‌ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించింది. భారత్ తరఫున, అంతర్జాతీయ వేదికపై టైటిల్ గెలిచింది.
ఆసియన్ మాస్టర్స్ పోటీల్లో భాగంగా, సిల్వర్ మెడల్ అలాగే, గోల్డ్ మెడల్‌ని పవర్ లిఫ్టింగ్ విభాగంలో గెలుచుకుంది ప్రగతి.
యావత్ తెలుగు సినీ పరిశ్రమ, ప్రగతి సాధించిన విజయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, ఆమెను పొగడ్తలతో ముంచెత్తింది.
కాగా, టైటిల్స్ గెలిచిన అనంతరం విజేత హోదాలో ఓ సినీ వేదికపై సన్మానం అందుకున్న ప్రగతి, అత్యంత అమూల్యమైన ప్రసంగం చేసి, ‘వారెవ్వా’ అనిపించుకుంది.
‘చీర కట్టుకుని జిమ్ చేయలేం.. చాలామంది చాలా రకాలుగా ట్రోల్స్ చేశారు.. ఏం, మీ ఇంట్లో మహిళలు లేరా.?’ అంటూ ట్రోలర్స్ మీద మండిపడింది ప్రగతి.
పవర్ లిఫ్టింగ్ విభాగంలో, చాలా కష్టపడాల్సి వచ్చిందనీ.. దానికన్నా పెద్ద కష్టం, సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ని ఎదుర్కోవడమేనని ప్రగతి చెప్పుకొచ్చింది.
ఈ రోజుల్లో సోషల్ ట్రోలింగ్ సర్వసాధారణం. అదెంత జుగుప్సాకరమైనా, దాన్ని అదుపు చేయలేని దుస్థితి నెలకొన్నమాట వాస్తవం.!
కానీ, ఎవరికి వారు తమ ఇంట్లోనూ మహిళలున్నారని ఓసారి ఆత్మవిమర్శ చేసుకుంటే, మహిళలపై ట్రోలింగ్ ఆగుతుంది.
ఒక్కటి మాత్రం నిజం.. ప్రగతి సాధించిన విజయం.. సినీ పరిశ్రమలోని మహిళలకే కాదు, అందరికీ స్ఫూర్తిదాయకం.
అన్నట్లు తాను సాధించిన టైటిల్స్‌ని సినీ పరిశ్రమలోని మహిళలందరికీ అంకితమిస్తున్నట్లు ప్రగతి చెప్పింది.
