Pub Culture In India తప్పెవరిది.? తాగి తూలినోడిదా.? తాగే అవకాశం కల్పించినోడిదా.? రోడ్డు ప్రమాదాలకి ప్రధాన కారణాల్లో అతి ప్రధానమైనది మద్యపానమని ప్రభుత్వాలే చెబుతున్నాయి. అయినాగానీ, ప్రభుత్వాలెందుకు మద్యపానాన్ని నిషేధించలేకపోతున్నాయి.? మద్యం సేవించినోడు తన మీద తాను అదుపు కోల్పోతాడు.. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి, అలా వాడ్ని అదుపు కోల్పోయేలా చేస్తున్నదెవరు.?
పబ్బుల్లో తాగి తందనాలాడుతున్నారనీ, అసాంఘీక కార్యకలాపాలకు పబ్బులు వేదికలుగా మారుతున్నాయనీ చాలాకాలంగా ఆరోపణలున్నాయి. అది నిజం కూడా. పబ్బుల్లో మాదక ద్రవ్యాల వినియోగమే కాదు, ఆ పబ్బులే మాదక ద్రవ్యాల ‘మార్కెట్లు’గా మారిపోతున్న వైనం గురించి చాలా సార్లు విన్నాం, వింటూనే వున్నాం. అయినాగానీ, ఈ పబ్బుల సంస్కృతిపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపలేకపోతున్నాయి.
Pub Culture In India పబ్బలు.. గబ్బు గబ్బు కేంద్రాలు..
చిన్నారుల్ని సైతం పబ్బుల్లోకి ఆహ్వానిస్తున్న ఘటనలు అనేకం. పబ్బుల్లో అసభ్య నృత్యాలు, గొడవలు.. ఇలా ఏ ఘటన జరిగినా, అప్పటికప్పుడు పోలీసులు హంగామా జరగడం, ఆ తర్వాత కథంతా షరామామూలైపోవడం తెలిసిన విషయాలే. ఎందుకిలా.? పబ్బుల్ని అదుపు చేయలేని దుస్థితి ప్రభుత్వాలకెందుకొస్తోంది.

పెద్ద పెద్ద నగరాలే కాదు, చిన్న చిన్న పట్టణాల్లో కూడా పబ్బుల సంస్కృతి పెరిగిపోతోంది. పబ్బులంటే లిక్కర్, డ్రగ్స్, అసభ్యత.. ఇంతే. ఇంతకు మించి ఇంకేమీ వుండదన్న భావన బలపడిపోయినాగానీ, పబ్బులపై ప్రభుత్వాలకి నియంత్రణ లేదు. ఎందుకంటే, వాటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభుత్వాలకు లభించే ఆదాయం అలాంటిది మరి.
ఆ కిక్కే వేరప్పా..
తప్పతాగి రోడ్ల మీదకు వాహనాలొస్తే ప్రమాదాలు జరుగుతాయ్. ప్రమాదాల సంగతి తర్వాత, తాగినోడు వాహనం నడిపితే, జరీమానాలు.. ఆ హంగామా అందరికీ తెలిసిన సంగతే. మద్యం ద్వారా వచ్చే ఆదాయం, పబ్బుల ద్వారా లభించే ఆర్థిక వెసులుబాట్లు.. వీటిని ప్రభుత్వాలు వద్దనుకోలేవు. అదే అసలు సమస్య.
Also Read: మనిషిలా మారుతున్న ‘వానరం’: ఇకనైనా సిగ్గుపడదాం.!
తాగండి, తాగి ఊగండి, తాగి ఛావండి, తాగి చంపండి.. అన్నట్టు తయరైంది పరిస్థితి. అన్ని అనర్ధాలకీ కారణమైన మద్యపానాన్ని ఆపేస్తే, పబ్బుల సంస్కతి (Pub Culture In India) లేకుండా చేస్తే.. ఆల్ ఈజ్ వెల్ కదా.? కానీ, అలా ఎందుకు చేస్తాయి ప్రభుత్వాలు.. ఛాన్సే లేదు.!
చివరగా, పబ్బుల్ని, లిక్కర్‌నీ నిషేధిస్తే.. దేశంలో చాలావరకు రోడ్డు ప్రమాదాలు తగ్గిపోతాయి.. మహిళలపై లైంగిక వేధింపులూ తగ్గిపోతాయ్.. మాదక ద్రవ్యాల జోరు కూడా తగ్గిపోతుంది. దేశం ఆర్థికంగా పురోగమిస్తుంది కూడా. ఆరోగ్య భారతానికి మార్గం సుగమం అయ్యేందుకు వున్న ఈ ఒక్క అవకాశాన్నీ ప్రభుత్వాలెందుకు విస్మరిస్తున్నట్లు.?