Table of Contents
Pushpa 2 The Rule Review.. అల్లు అర్జున్, రష్మిక మండన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప 2 ది రూల్’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. గతంలో వచ్చిన ‘పుష్ప ది రైజ్’కి ఇది కొనసాగింపు.
భారీ అంచనాల నడుమ, భారీ టిక్కెట్ల ధరలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘పుష్ప 2 ది రూల్’ కథా కమామిషు ఏంటో తెలుసుకుందాం.! ఓ సాధారణ ఎర్ర చందనం కూలీ, ఎర్ర చందనం డాన్‌గా ఎదిగిన వైనం మొదటి పార్ట్‌లో చూసేశాం.
రెండో పార్ట్‌లో ఎర్ర చందనం డాన్ పుష్ప ‘రూల్’ చూడబోతున్నామని, సినిమాకి టైటిల్ కూడా ‘పుష్ప 2 ది రూల్’ అని పెట్టేశాడు. సినిమాలో పలు సందర్భాల్లో ‘ఇది పుష్ప గాడి రూలు’ అని చెబుతుంటాడు.!
Pushpa 2 The Rule Review.. ఫొటో తెచ్చిన తంటా..
ముఖ్యమంత్రితో కలిసి తన భర్త ఫొటోకి పోజిస్తే చూడాలనుకుంటుంది పుష్పరాజ్ సతీమణి శ్రీవల్లి. అంతే, భార్య కోరిక మేరకు.. ఫొటో దిగుతాడు.. కాకపోతే, ముఖ్యమంత్రిని మార్చేసి.. ఆ ముఖ్యమంత్రిని తన ఇంటికి పిలిపించుకుని.
అసలు ముఖ్యమంత్రిని పుష్పరాజ్ ఎందుకు మార్చేశాడు.? ముఖ్యమంత్రిని మార్చే స్థాయిలో పవర్ ఎలా పెంచుకున్నాడు.? అంత డబ్బు ఎలా సంపాదించాడు.? ఇదంతా మిగతా కథ.
ఆ కథలోనే, అసలంటూ ఇంటి పేరు వున్నా లేకుండా తిరుగుతున్న పుష్ప, ఎలా ఇంటి పేరు సంపాదించాడన్న విషయాన్ని కూడా చూపించే ప్రయత్నం చేశారు.
జపాన్ ఎందుకు పుష్పా.. ఖర్చు దండగ కదా.?
సినిమా ప్రారంభమవడమే జపాన్‌లో ఓ బీభత్సమైన యాక్షన్ ఎపిసోడ్‌తో.! తీరా అది కలగన్నట్టుగా చూపిస్తాడు. అక్కడి నుంచి సినిమా అంతా యాక్షన్, యాక్షన్ అండ్ యాక్షన్ మాత్రమే.!
ఛేజింగుల, బీభత్సమైన ఫైటింగులు.. వీటికి తోడు బీభత్సమైన డాన్సులతో పాటలు.. ఇలా సాగుతుంది కథ. డైలాగులైతే చిత్తూరు యాసలో వుండి అస్సలు అర్థం కావు.
మరీ ముఖ్యంగా అల్లు అర్జున్, అదో రకంగా మొహం పెట్టి, నోట్లో ఖైనీ లాంటిదేదో పెట్టుకుని నములుతున్నట్లుగా మాట్లాడుతూ.. అస్సలు అర్థం కాకుండా నటించేశాడు.
జాతర ఎపిసోడ్‌లోనే రెండు పాటలు, ఓ యాక్షన్ ఎపిసోడ్.. దాంతోపాటుగా, ఎమోషనల్ సీన్స్ వచ్చేస్తాయి. చివర్లో యాక్షన్ ఎపిసోడ్‌ని సరికొత్తగా పీకలు కొరికేసేలా డిజైన్ చేశారు.
ఈ స్మగ్లింగ్ ఒకింత పిచ్చితనం..
ఈ సినిమాలో ఇంకో ఆణిముత్యమేంటంటే, ఎర్ర చందనం దుంగలతో ఎడ్లబళ్ళను తయారు చేసి, విదేశాలకు స్మగుల్ చేయడం. అంతేనా, నీళ్ళు తక్కువగా వున్న నదిలో వందలాది లారీలు టన్నులకొద్దీ దుంగలతో వెళ్ళిపోవడం.
సినిమాలో గ్లామర్ విషయానికొస్తే, పుష్ప – శ్రీవల్లి రొమాన్స్ కాస్తా ‘పీలింగ్స్’ పేరుతో ‘కక్కుర్తి’కి పరాకాష్ట అన్నట్లుగా మారిపోయింది. అనసూయ, సునీల్, జగపతిబాబు.. అసలు సినిమాలో ఎందుకు వున్నారో వాళ్ళకి కూడా తెలీదేమో.!
సినిమాకి సెంటరాఫ్ ఎట్రాక్షన్ అవ్వాల్సిన ఫహాద్ ఫాజిల్, కావాల్సినంత కామెడీ చేశాడు.! అతని పాత్రని కామెడీగా మలచేశాడు దర్శకుడు.
Pushpa 2 The Rule Review.. పోలీస్ కాదు కమెడియన్..
ఐపీఎస్ అధికారి తప్ప, మొత్తంగా పోలీసులంతా అమ్ముడుపోతారు.. పుష్పరాజ్ కొనేస్తాడు, వాళ్ళకి లైఫ్ టైమ్ సెటిల్మెంట్ చేసేస్తాడు. అదేంటో, పోలీస్ వ్యవస్థలో ఆ ఒక్క ఐపీఎస్ షెకావత్ తప్ప, ఇంకెవరూ వున్నట్లు కనిపించరు.
సీఎం వుంటాడుగానీ, డీజీపీగానీ, ఐజీగానీ.. ఇలాంటి పాత్రలేవీ వుండవాయె.! చిత్తూరు నుంచి రామేశ్వరం, అక్కడి నుంచి శ్రీలకకు ఎర్ర చందనం దుంగలు స్మగుల్ అయిన విధానం.. బోల్డంత హాస్యాన్ని పుట్టిస్తుంది.!

లేడీ గెటప్‌లో యాక్షన్ ఎపిసోడ్స్‌లో అదరగొట్టేసిన హీరోలు తెలుగు తెరపై చాలామందే కనిపిస్తారు. సో, జాతర ఎపిసోడ్ కావొచ్చు, క్లయిమాక్స్‌లో కావొచ్చు.. అల్లు అర్జున్ కొత్తగా చేసిందేమీ లేదు.
చాలా సన్నివేశాల్లో సింగిల్ ఎక్స్‌ప్రెషన్స్‌కి పరిమితమైపోయాడు అల్లు అర్జున్. రష్మిక మండన్న నటించిన ప్రతిసారీ, ఆమెను తెరపై చూడ్డం కష్టంగానే అనిపిస్తుంటుంది. ఫహాద్ ఫాజిల్ గురించి ముందే చెప్పుకున్నాం కదా.. కామెడీ ఐపీఎస్ అంతే.!
మాస్టారూ.. లెక్కలు తప్పాయ్..
దర్శకుడు సుకుమార్‌ని సినిమా రంగంలోనూ లెక్కల మాస్టార్ అంటుంటాం. కానీ, ఒక్కటంటే ఒక్క సీన్లో కూడా ‘సుక్కూ’ మార్క్ కనిపించదు. అదే ఈ సినిమా ప్రత్యేకత. దేవిశ్రీ ప్రసాద్ మాత్రం, తనకిచ్చిన టాస్క్ సజావుగానే పూర్తి చేశాడు.
‘కిసిక్కు’ అంటూ సాగే ఐటమ్ సాంగ్‌లో శ్రీలీల మెరిసింది. గ్లామర్ పోటీ గురించి మాట్లాడుకోవాలంటే, ఐటమ్ బాంబ్ శ్రీలీల ఒకింత పద్ధతిగా కనిపిస్తే, హీరోయిన్ రష్మికని ‘పీలింగ్స్’ పాటలో, వ్యాంప్ కంటే అసహ్యంగా చూపించడం గమనార్హం.
Also Read: నయన్, ధనుష్.! ఓ పది కోట్ల పంచాయితీ.!
మొదటి పార్ట్‌తో పోల్చితే రెండో పార్ట్‌లో సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాణం పరంగా చూసుకుంటూ, ఖర్చుకి ఎక్కడా వెనుకంజ వేయలేదు.
ఫస్టాఫ్ బిగినింగ్ ఎపిసోడ్ ఎడిటింగ్ కత్తెరకి బలైపోయినా, సినిమాకి అస్సలు ఇబ్బంది వుండదు. నిడివి ఇబ్బంది పెడుతుంది.
హీరో పాత్రకి ధీటుగా బలమైన విలన్ పాత్ర వున్నప్పుడే.. టగ్ ఆఫ్ వార్ రసవత్తరంగా సాగుతుంది. కానీ, ఇందులో హీరో పాత్రకి సరైన విలన్ పాత్ర లేకపోవడంతో.. ఫ్లాట్‌గా సాగుతుంది.
ఓవరాల్‌గా చూస్తే వైల్డ్ ఫైర్ కావాల్సిన పుష్ప.. వరస్ట్ ఫైర్‌గా మిగిలిపోయేలా వుంది.!