సీజ్ ది షిప్: రేషన్ బియ్యం స్మగ్లర్ ఎవరు.?
Seize The Ship.. అది రేషన్ బియ్యం.! కిలో బియ్యం ఖరీదు జస్ట్ ఒక్క రూపాయి మాత్రమే. ఉచితంగానూ ఇస్తుంటార్లెండి.!
కానీ, అదే రేషన్ బియ్యాన్ని మార్కెట్‌లో కొనాలంటే, పది నుంచి ఇరవై రూపాయల వరకూ వెచ్చించాల్సి వుంటుంది.
‘ఆ రేషన్ బియ్యాన్ని మనుషులెవరూ తినరు..’ అనే వాదన ఒకటుంది. పూట గడవని కుటుంబాలకి, ఆ రేషన్ బియ్యంతోనే కడుపు నిండుతుందనుకోండి.. అది వేరే సంగతి.
Seize The Ship.. పేదల కోసం వినియోగించాల్సిన రేషన్.. పెద్దలు బొక్కేస్తున్న వైనం..
పేదల కోసం ఉద్దేశించిన రేషన్ బియ్యం, అసలు పక్కదారి ఎలా పడుతోంది.? ఇదేమీ మిలియన్ డాలర్ క్వశ్చన్ కాదు.
రేషన్ తీసుకుంటున్న చాలామంది రేషన్ బియ్యాన్ని తినరు. దాన్ని కిరాణా దుకాణాలకు అమ్మేస్తుంటారు.
అసలు సమస్య ఇది కాదు.! టన్నుల్లో రేషన్ బియ్యం, విదేశాలకు స్మగుల్ అవుతోంది.! అది కూడా కాకినాడ తీరం నుంచి.
ఔను, ‘సీజ్ ది షిప్’ అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సముద్రంలోకి వెళ్ళి మరీ, గొంతు విప్పాల్సి వచ్చింది.
వైసీపీ చేసిన పాపం..
సివిల్ సప్లయ్స్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్, పదే పదే రేషన్ బియ్యం స్మగ్లింగ్ విషయమై అధికారుల్ని అప్రమత్తం చేస్తున్నా, పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో, ఏపీ డిప్యూటీ సీఎం రంగంలోకి దిగారు.
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కనుసన్నల్లోనే ఈ స్మగ్లింగ్ జరుగుతోందన్నది ప్రధాన ఆరోపణ.
కాగా, వైసీపీ హయాంలో రేషన్ డోర్ డెలివరీ కోసం తెరపైకి తెచ్చిన వాహనాల ద్వారానే ఈ స్మగ్లింగ్ అరాచకానికి తెరలేపినట్లు సివిల్ సప్లయ్స్ మినిస్టర్ ఆరోపిస్తుండడం గమనార్హం.
సముద్రంలో లంగర్ వేసిన షిప్పులో ‘సరుకు’ వుంది. షిప్పుని సీజ్ చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టుదలతో వున్నారు. మరి, షిప్పు సీజ్ అవుతుందా.? వేచి చూడాల్సిందే.