‘రాజ రాజ చోర’ (Raja Raja Chora Review) అనే టైటిల్‌తోనే సినిమాపై ఆసక్తి పెంచేశారు. ఓ కిరీటం, ఓ దొంగ.. ఇలా సినిమా అనౌన్స్‌మెంట్ జరిగినప్పుడే.. దాదాపుగా సినిమాకి సంబంధించి ఓ ‘క్లూ’ లభించేసింది. అక్కడున్నది శ్రీవిష్ణు. రొటీన్ సినిమాలకు భిన్నంగా వుంటాయి శ్రీవిష్ణు సినిమాలు. కొత్తగా సినిమాలు చేయాలన్న ఆలోచనల నుంచి ఇప్పటికీ పక్కదారి పట్టకపోవడం శ్రీవిష్ణు ప్రత్యేకత. ఇంతకీ, ‘రాజ రాజ చోర’ ఎలా వుంది.?
ఓటీటీ మేనియా నేపథ్యంలో, కరోనా వైరస్ భయాలు ఇంకా వున్నప్పటికీ ‘రాజ రాజ చోర’ నేరుగా థియేటర్లలోకే వచ్చేసింది. ‘నవ్వి నవ్వి మీ ఫేస్ మాస్కులు ఊడిపోతాయ్.. అందుకే, ఎక్కువ మాస్కులు తీసుకెళ్ళండి..’ అని సినిమా ప్రమోషన్ సందర్భంగా శ్రీవిష్ణు చెప్పడం కాస్త ‘ఓవర్’ అయ్యిందనే అభిప్రాయం అంతటా నెలకొంది.
నిజమే, శ్రీవిష్ణు చెప్పినట్లు సినిమాలో నవ్వులున్నాయి. ఎమోషన్ సీన్స్ కూడా వున్నాయి. నవ్వులకీ కనెక్ట్ అవుతాయ్.. ఎమోషనల్ కంటెంట్‌కీ బాగానే కనెక్ట్ అవుతాం. అంతేనా, పాటలు.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, వీటితోపాటుగా సినిమాటోగ్రఫీ, డైలాగ్స్, టేకింగ్.. ఇలా అన్నిటికీ కనెక్ట్ అవుతాం.
హీరో మామూలోడు కాదు సుమీ..
సినిమాలో పాత్రల విషయానికొస్తే, ఓ జిరాక్స్ షాపులో పని చేసే ఓ వ్యక్తి, అతనికి ఓ భార్య కొడుకు. అయినాగానీ, ఆ వ్యక్తి, తనకు పెళ్ళి కాలేదని చెప్పి.. తానో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌నని చెప్పి.. ఓ అమ్మాయిని ప్రేమలో పడేస్తాడు. మరో వైపు భార్యను వదిలేసిన ఓ పోలీస్ అధికారి.. ఇంకో డాక్టర్.. ఇలా సినిమాలో చాలా పాత్రలున్నాయి. ఏ పాత్రకదే అన్నట్టు ఆయా పాత్రల్ని చాలాబాగా డిజైన్ చేశాడు దర్శకుడు.
సంపాదన సరిపోకపోవడంతో, తాను పనిచేస్తోన్న జిరాక్స్ షాప్ ఓనర్‌కి తెలియకుండా ‘చిల్లర పనులు’ చేస్తుంటాడు హీరో. అందులో, పరీక్షా పత్రాల లీకు కూడా వుంటుంది. అన్నట్టు, ఈ కథకీ ప్రమోషన్స్‌లో కనిపిస్తున్న కిరీటానికీ సంబంధం ఏంటట.? ఇంతకీ, భార్యను కాదని ఇంకో అమ్మాయి వైపు హీరో ఎందుకు ఆకర్షితుడయ్యాడు.? చివరికి భార్యతోనే జీవితం.. అని తెలుసుకుంటాడా.? ప్రియురాలితో సెట్టయిపోతాడా.? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే సినిమా చూడాల్సిందే.
నేల విడిచి సాము చేయకుండా.. దర్శకుడు సినిమాని చాలా జాగ్రత్తగా డీల్ చేశాడు. అయితే, నవ్వులు ఇంకాస్త ఎక్కువగా వుండి వుంటే బావుండేదేమో అనిపిస్తుంది. క్లయిమాక్స్ ఇంకా ఎఫెక్టివ్‌గా వుంటే బావుండేమో కూడా.
ఎవరెలా చేశారంటే..
నటీనటుల విషయానికొస్తే, శ్రీవిష్ణుకి వంక పెట్టడానికి వీల్లేదు. పోలీస్ అధికారి పాత్రలో రవిబాబు ఆకట్టుకుంటాడు. హీరోయిన్లలో మేఘా ఆకాష్ కంటే సునయన ఎక్కువ మార్కులు కొట్టేసింది నటిగా. మేఘా ఆకాష్ క్యూట్‌గా వుంది. గంగవ్వ సహా మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర మెప్పించారు.
తప్పులు చేయడం, ఆ తప్పు తెలుసుకుని మారాలనుకోవడం.. సినిమాలో చాలా పాత్రలు చేసేది ఇదే. ఓ తప్పుని కప్పి పుచ్చుకోవడానికి ఇంకో తప్పు చేయడం, ఈ క్రమంలో పండే కామెడీ, ఎమోషన్.. ఇవన్నీ పక్కగా కుదిరాయి. అందర్నీ, అన్ని ఎమోషన్స్‌నీ దర్శకుడు బ్యాలెన్స్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది.
నిర్మాణపు విలువలు బాగున్నాయి. మామూలు కథే.. అనిపించినా, కొత్త ప్రయత్నం.. అనిపించడం ఖాయం. శ్రీవిష్ణు కథల ఎంపిక తాలూకు ప్రత్యేకత అదే. హసిత్ గోలి (Raja Raja Chora Review), తొలి సినిమాతోనే మంచి మార్కులేయించుకున్నాడని నిస్సందేహంగా చెప్పొచ్చు.