Rajesh Danda Collection Report.. సినీ నిర్మాత రాజేష్ దండా ఈ మధ్యనే ‘కె-ర్యాంప్’ అనే సినిమాని నిర్మించారు. కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా నటించిన సినిమా ఇది.!
‘బూతు సినిమా’ అనే విమర్శలున్నా, దీపావళి పండక్కి ‘కె-ర్యాంప్’ బాగానే వసూళ్ళను సాధించిందన్నది ఓ వాదన.!
విడుదలైన సినిమాల్లో ‘కె-ర్యాంప్’ సూపర్ హిట్.. అంటూ, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ఈ సినిమా సక్సెస్ మీట్‌లో సెలవిచ్చారు.
ఇంకోపక్క, సినిమా వసూళ్ళపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సహజంగానే, చిత్ర నిర్మాతకి ఈ భిన్న వాదనలు అస్సలు నచ్చలేదు.!
ఓ ఈవెంట్‌లో, ఓ వెబ్ సైట్ మీద విరుచుకుపడ్డారు నిర్మాత రాజేష్ దండా. నాలుగైదు బూతులు కూడా సంధించేశారు.
అట్నుంచి, కౌంటర్ ఎటాక్ వచ్చింది. వెరసి, ఈ అంశం ఇప్పుడు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
నిజానికి, ఇదేమీ కొత్త కాదు.! చిన్న హీరోలకీ, పెద్ద హీరోలకీ.. ఇలా అందరికీ, ఈ నెగెటివిటీ అనేది సర్వసాధారణమైపోయింది.
‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి వచ్చిన నెగెటివ్ రివ్యూల్ని, మెగాస్టార్ చిరంజీవి లైట్ తీసుకున్నారు. కానీ, సెటైరేశారు. అది అప్పట్లో ఓ సంచలనం.
ఆ విషయం పక్కన పెడితే, నిర్మాత రాజేష్ దండా, ఓ మీడియా సంస్థకి సమర్పించుకున్న తాయిలాల కలెక్షన్ వివరాల్ని వెల్లడించారు.
If you craving for our Movies collection Reports, Here is YOUR COLLECTION REPORT: Landing Page : 60K, Article : 20K, Special Review : 1 Lac
వీటితోపాటు Tweet Review : 25K, First Half Review : 20K, Second Half Review, Delay : 30K, Personal Cover : 1 Lac
ఇదీ ఆ లెక్కల వ్యవహారం.! మొత్తంగా దాదాపు మూడున్నర లక్షలు.! ఒకే ఒక్క మీడియా సంస్థకి సమర్పించుకున్న మొత్తమిది.!
ఇంకో ప్రముఖ మీడియా సంస్థ వుంది. దాని రేటు, ఏకంగా ఐదు లక్షలు. మరొకటి మూడు, మూడున్నర లక్షల రేంజ్‌లో వుంది. రెండున్నర లక్షల పరిధిలో ఓ ఐదారున్నాయ్.
చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా చాలా పెద్దదే. 50 లక్షల నుంచి కోటి రూపాయలు.. ఆ పైన కేవలం మీడియాకి కొన్ని సినిమాలు సమర్పించుకోవాల్సిన దుస్థితి కూడా వుంది.
‘కవర్’ ఇవ్వకపోతే, న్యూస్ ఐటమ్ కూడా రాయని సినీ ఎర్నలిస్టులున్నారు. కవర్ ఇచ్చినా, సినిమాపై దుష్ప్రచారం చేసేవాళ్ళూ వున్నారు.
చిత్రమేంటంటే, ‘ప్యాకేజీలు’ ఇచ్చి, వేరే సినిమాల మీద నెగెటివిటీ సృష్టించే పీఆర్ సంస్థలు కూడా తెలుగు సినీ పరిశ్రమలో వున్నాయ్.!
ఇది వ్యాపారం.! ఇక్కడ ఒకర్ని ఇంకొకరు దోచుకోవడం సర్వసాధారణం.! రాజేష్ దండాకి ‘కె-ర్యాంప్’ విషయంలో నొప్పి కలిగింది.. ఆయన గట్టిగా అరిచారు.
ఇంకొకరికి, ఇంకో సినిమా విషయంలో దెబ్బ తగులుతుంది, గట్టిగా అరుస్తారు. ఇదొక నిరంతర ప్రక్రియ అంతే.!
