ఎప్పుడూ భిన్నంగా ఆలోచించే అతి కొద్ది మంది హీరోల్లో రామ్ పోతినేని ఒకడు. తను చేసే సినిమాలు కొత్తగా వుండాలని అనుకుంటాడు. అనుకోవడమే కాదు, అందుకు తగ్గ రీతిలో అడుగులేస్తుంటాడు. ఈ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో తాజా చిత్రమే ‘రెడ్’ (Red The Film Review).
ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొస్తోన్న ‘రెడ్’ సినిమాకి ఓ ప్రత్యేకత వుంది. అదే ఈ సినిమాలో రామ్ (Ram Pothineni) ద్విపాత్రాభినయం చేస్తుండడం. ఒకటి పాజిటివ్ క్యారెక్టర్ అయితే, ఇంకోటి నెగెటివ్ క్యారెక్టర్. అసలు సినిమాలో ఇద్దరున్నారా.? ఒక్కరే వుంటారా.? ఒక్కడే, ఇద్దరిలా కనిపిస్తాడా.? ఏంటీ కన్ఫ్యూజన్.!
నిజానికి, సినిమాలో వున్నది ఇద్దరు.. అందులో ఒకరు సిద్దార్ధ, ఇంకొకరు ఆదిత్య. ఈ ఇద్దరి మధ్యా గొడవేంటన్నది సినిమా చూస్తేనే అర్థమవుతుంది. ఒకటి మాత్రం నిజం.. ఓ క్యారెక్టర్ చాలా రఫ్‌గా కనిపిస్తోంది.. ఆ రఫ్ క్యారెక్టర్, సాఫ్ట్ క్యారెక్టర్ని ఇబ్బంది పెడుతోంది.
అయితే, ఇందులో ట్విస్ట్ ఏమైనా వుంటుందా.? అన్నది ఇంకో సస్పెన్స్. ‘బుర్రకథ’ తదితర సినిమాలు ఈ కోవలోనే వచ్చాయి. అయితే, వాటికీ ‘రెడ్’ సినిమాకీ అస్సలు సంబంధమే వుండదట. పూర్తిగా ఇది కొత్త ఆలోచనతో చేసిన సినిమా అని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.
హీరో రామ్ కూడా ఇలాంటి కథ తెలుగు తెరపై ఇప్పటిదాకా ఎవరూ చూడలేదని అంటున్నాడు. రామ్ సరసన మాళవిక శర్మ (Malvika Sharma), నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj), అమృత అయ్యర్ (Amritha Ayier) నటిస్తున్నారు. హెబ్బా పటేల్ (Hebah Patel) స్పెషల్ సాంగ్ ఈ సినిమాకి మరో అదనపు ఆకర్షణ. టీజర్, ట్రైలర్.. రెండూ అదిరిపోయాయ్.
పాటలు కూడా అద్భుతంగానే చిత్రీకరించినట్లు ప్రోమోస్‌ని బట్టి అర్థమవుతోంది. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత, అదే హోరులో ‘రెడ్’ సినిమాతో వెంటనే హిట్టు కొట్టేయాలనుకున్నాడుగానీ, కరోనా వైరస్.. రామ్ ఆశలపై కాస్త నీళ్ళు చల్లింది. అందరిలానే, ‘రెడ్’ సినిమా కూడా కరోనా కారణంగా సమస్యల్ని ఎదుర్కొంది.
ఓటీటీ నుంచి బీభత్సమైన ఆఫర్స్ వచ్చినా, రామ్ అండ్ టీమ్ మాత్రం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాని థియేటర్లలోనే విడుదల చేయాలనుకుంది. సంక్రాంతి అంటే సినిమాల పండగ కూడా. మరి, ఈ పండక్కి రామ్ ‘రెడ్’ (Red The Film Review) సినిమాతో హిట్టు కొట్టేస్తాడా.? సిద్దార్ధ, ఆదిత్య.. ఈ ఇద్దరిలో రంగు పడేదెవరికి.? వేచి చూడాల్సిందే.