Renu Desai HCU Land.. సినీ నటి రేణు దేశాయ్, సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. అదీ, హైద్రాబాద్‌లో సంచలనం సృష్టించిన ‘కంచె గచ్చిబౌలి’లో 400 ఎకరాల భూమికి సంబంధించి.
ఈ భూమి, హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకుని వుంది. సదరు భూమిలో, బోల్డన్ని వన్యమృగాలున్నాయి. ఆ భూమిని ప్రభుత్వం, ఇతర అవసరాలకు వినియోగించుకునే ప్రయత్నంలో వుంది.
అనూహ్యంగా, ప్రభుత్వం సదరు భూమిలోకి జేసీబీలు దించి, చెట్లను తొలగించే చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ విషయమై హెచ్‌సీయూ విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సినీ ప్రముఖుల స్పందన..
సినీ నటుడు రామ్ చరణ్ సతీమణి ఉపాసన, టీవీ యాంకర్ రష్మి గౌతమ్ సహా.. పలువురు సినీ ప్రముఖులు, కంచె గచ్చిబౌలి భూముల విషయమై గళం విప్పారు.
ఈ లిస్టులో రేణు దేశాయ్ కూడా చేశారు. కేవలం సినీ నటి మాత్రమే కాదు, జంతు ప్రేమికురాలు కూడా అయిన రేణు దేశాయ్, మూగ జీవాల విషయమై బాధ్యతగా వుండాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు.
అవకాశం వుంటే, ఆ భూముల్ని అలాగే వుంచేయాలనీ, ఆ ప్రాంతంలో వున్న జంతువుల ఆవేదనను అర్థం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు రేణు దేశాయ్.
Renu Desai HCU Land.. నలభై నాలుగేళ్ళకే చచ్చిపోవడమేంటి.?
మరాఠీ అయిన రేణు దేశాయ్, తెలుగులో బాగానే మాట్లాడతారు. కాకపోతే, కొన్ని పదాల్ని పలికే విషయమై తడబడుతుంటారు. ‘కంచె గచ్చిబౌలి’ భూముల విషయంలో ఆమె మాటలు కొంత ఆశ్చర్యాన్ని కలిగించాయి.
‘నా వయసు 44 ఏళ్ళే.. నేను చచ్చిపోతా..’ అనేశారు రేణు దేశాయ్. నలభై నాలుగేళ్ళకు చనిపోవడమేంటి.? అన్న ప్రశ్న సహజంగానే తెరపైకొస్తుంది. కొంత ఆందోళన చెందారు కూడా అభిమానులు.
ఆమె ఉద్దేశ్యం ఏంటంటే, ‘నా వయసు అయిపోతోంది.. భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ కావాలి.. అదే నా ఆవేదన’ అని. ఆమె మాటల్లోనూ నిజం లేకపోలేదు.
నగరం నడిబొడ్డున, నాలుగు వందల ఎకరాల భూమి.. అదీ, దట్టంగా పెరిగిన చెట్లున్న ప్రాంతమంటే, నగరానికి ఆ ప్రాంతం నుంచి ఎంత ఆక్సిజన్ అందుతుంది.?
Also Read: కుక్క పని కుక్కే చెయ్యాలి.! గాడిద చెయ్యకూడదు.!
అంత మంచి ప్రాంతాన్ని నాశనం చేసి, ఆకాశ హార్మ్యాలు నిర్మిస్తే, నగర వాసుల పరిస్థితి ఏంటి.? పైగా, ఆ ప్రాంతంలో నీటి నిల్వలకూ ఆస్కారముంది. కొన్ని నీటి కొలనులు కూడా వున్నాయ్ మరి.
అసలే, ఇది ‘వెకిలి’ యూ ట్యూబ్ థంబ్ నెయిల్స్ కాలం.! రేణు దేశాయ్, సదుద్దేశ్యంతో చేసిన వ్యాఖ్యలన్నీ పక్కన పడేసి, ‘నే చచ్చిపోతా’ అన్న మాటల్నే హైలైట్ చేస్తూ, పుకార్లు పుట్టిస్తున్నారు కొందరు.
కట్ అండ్ పేస్ట్ చేసి.. ఈ వీడియోలని, రాజకీయ అవసరాల నిమిత్తం వాడుకుంటున్నారు ఇంకొందరు.