Table of Contents
Republic Cinema Review.. నిజం నిప్పులాంటిదనే మాట తరచూ వింటుంటాం. అవును, నిజం నిప్పులాంటిదే. దాన్ని తాకాలంటే భయం. నిజాన్ని జీర్ణించుకోవాలంటే భయం. ‘రిపబ్లిక్’ సినిమా బాగుందని చెప్పాలంటే కూడా భయం. ఎందుకంటే, అది సినిమా కాదు, నిజం కాబట్టి.
ఐఏఎస్ అధికారి పంజా అభిరామ్, మంత్రి విశాఖ వాణి, డిప్యూటీ కలెక్టర్ దశరథ్, ఎస్పీ గోపాల్ రావు.. ఇవన్నీ సినిమాలోని పాత్రలు మాత్రమే కాదు.. వీటిల్లో ఏదో ఒక పాత్ర నిజ జీవితంలో ఏదో ఒక సందర్భంలో మనకి తారసపడుతుంటుంది. అందుకే, ఈ నిజాన్ని జీర్ణించుకుని, సినిమా బాగుందని చెప్పాలంటే చాలా చాలా కష్టం. ఔను, అబద్ధాల పునాదుల మీద నడుస్తున్న ఈ తరం జీవితాలు.. నిజాన్ని జీర్ణించుకోవాలంటే అంత తేలిక కాదు.
Republic Cinema Review, సందేశం కాదిది.. వాస్తవం.!
మాంఛి మెసేజ్ ఇచ్చెయ్యాలనే ఆలోచనతో సినిమా తెరకెక్కిస్తే, ఆ సినిమాలో హీరో తన లక్ష్యాన్ని చేరుకోవాలి. శతృ సంహారం జరిగితే తప్ప, ‘శుభం కార్డు’ పడని తెలుగు సినిమాకి, తనదైన కొత్తదనాన్ని అద్దాడు ‘రిపబ్లిక్’ సినిమా రూపంలో దర్శకుడు దేవ్ కట్టా.
సినిమా హీరో అంటే, ఆరు పాటల్లో అద్భుతమైన డాన్సులు.. ఓ నాలుగు బీభత్సమైన ఫైట్లు, వీటికి తోడు చిల్లర కామెడీ.. ఈ కమర్షియల్ మూస నుంచి బయటకు వచ్చి పంజా సాయి ధరమ్ తేజ్ చేసిన అద్భుతమైన ప్రయత్నం రిపబ్లిక్.

తెల్లేరు.. అంటూ దర్శకుడు కథ కోసం ఓ కథా వస్తువుని ఎంచుకున్నా, నిజానికి అది తెల్లేరు కాదు, కొల్లేరు. కొల్లేరు ఎలా సర్వనాశనమైందీ మన సమాజం చూస్తూనే వుంది. కొల్లేరు మీద వాలిన రాజకీయ గద్దలు, కొల్లేరులో మాయమైపోయిన ఎన్నో నిండు జీవితాలు.. అందరికీ తెలుసు. అయినా ఎవ్వరూ నోరు మెదపరు.
నిజం నిప్పులాంటిది..
కేంద్రంలో అధికారంలో వున్న పార్టీలకు అమ్ముడుపోయే ప్రాంతీయ పార్టీలు, ప్రజల రక్త మాంసాలతో ఎదిగే రాజకీయ నాయకులు.. ఇలా ‘రిపబ్లిక్’ సినిమాలో అన్నీ కనిపిస్తాయి. ఓటర్లలో 80 శాతం మందిని ‘కోతుల్లా’ చూస్తున్న రాజకీయాన్ని కల్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు దేవ్ కట్టా, విశాఖ వాణి పాత్ర ద్వారా.
సినిమా చివర్లో విశాఖ వాణి మనసు మారి, ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు దర్శకుడు చూపించాడుగానీ, నిజ జీవితంలో అది జరగదుగాక జరగదు. పోనీ, ఓటర్లన్నా మారతారా.? అంటే, మారరుగాక మారరు. ఓటర్లలో చైతన్యం రాదన్న విషయాన్ని దర్శకుడు, హీరో పాత్రని చంపేయడం ద్వారా చెప్పిన వైనం అత్యద్భుతం.
నిజాల్ని నిర్భయంగా సినిమాలో చూపించిన దర్శకుడికీ, ఈ నిజమైన ప్రయత్నంలో భాగమైన సాయి ధరమ్ తేజ్‌కీ, ఇతర నటీనటులకీ హేట్సాఫ్ చెప్పాలి.
సహజత్వమే సినిమాకి అందం..
ఉన్నతాధికారి అయి వుండీ, పరిస్థితుల ప్రభావంతో లంచగొండిగా, చేతకానివాడిగా మారిపోయిన దశరధ్, రాజకీయ నాయకులకు తొత్తుగా వ్యవహరించే పోలీస్ అధికారి గోపాల్ రావు.. వీళ్ళంతా మన సమాజంలో, మన కళ్ళ ముందే వున్నారు. అలాంటి వాళ్ళని నిత్యం మనం చూస్తూనే వున్నాం, ఇంకా ఇంకా చూస్తూనే వుంటాం.
సినిమా చూసి జనం మారిపోతారనుకుంటే పొరపాటు. కానీ, వ్యవస్థలో కుళ్ళుని జీర్ణించుకోలేకపోయే చాలామందికి ఈ సినిమా (Republic Cinema Review) చూడగానే చివుక్కుమనిపిస్తుంది. అదొక్కటి చాలు, దర్శకుడి ప్రయత్నం, సినిమా యూనిట్ ప్రయత్నం సూపర్ సక్సెస్ అయ్యిందని చెప్పడానికి. ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా ఇది.
Also Read: ఎర్రి జీవి.. వీడొక వోడ్కా బానిస.!
ఏ డైలాగ్ కూడా సినిమాటిక్ అనిపించదు. ప్రతి సన్నివేశమూ సహజత్వానికి దగ్గరగా వుంటుంది. ఫలానా నటుడు నటించాడని అనలేం, ఎందుకంటే దాదాపుగా అందరూ జీవించేశారు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్.. ఇవన్నీ సినిమా సహజత్వాన్ని మరింత పెంచాయి.
మన వ్యవస్థనీ, అందులో మనల్ని మనం ‘నగ్నంగా’ చూసుకోవాలనుకుంటే దేవ్ కట్టా, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో రూపొందిన ‘రిపబ్లిక్’ సినిమా చూడాల్సిందే.