దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళవుతోంది. గడచిన డెబ్భయ్ నాలుగేళ్ళలో చాలా ప్రభుత్వాల్ని చూశాం. కానీ, అసలు ప్రభుత్వమే గత డెబ్భయ్ ఏళ్ళలో లేదంటే (Republic Movie Questions Government And People) ఎలా.? ప్రభుత్వం వుందా.? లేదా.? ప్రభుత్వం వుందనే భ్రమల్లో ప్రజలున్నారా.? ‘రిపబ్లిక్’ సినిమా ఏం చెప్పబోతోంది.?
నిజానికి ఇది చాలా పెద్ద సాహసం. ఓ కమర్షియల్ హీరో నుంచి ఓ విలక్షణ దర్శకుడు, మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా.. అదీ వ్యవస్థల్ని ప్రశ్నించే సినిమా తీసుకురావడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. దేవ్ కట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమానే ‘రిపబ్లిక్’.
సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది.. అదీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ద్వారా. సినిమా ఫస్ట్ లుక్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆలోచింపజేస్తోంది. ‘డెబ్భయ్ నాలుగేళ్ళుగా ప్రభుత్వం వుందన్న భ్రమలో బతుకుతున్నాం, కానీ మనకు ఇంకా ఆ ప్రభుత్వం ఎలా వుంటుందో కూడా తెలీదు’ అనే క్యాప్షన్‌ని జోడించారు ‘రిపబ్లిక్’ ఫస్ట్ లుక్ కోసం.
ప్రభుత్వమే లేకపోవడమేంటి.? వుందన్న భ్రమలో బతకడమేంటి.? ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వాలు చేస్తున్న పాలన, అమల్లోకి తెస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి.. ఇవన్నీకళ్ళ ముందు కనిపిస్తోంటే, ‘భ్రమ’ అనడమేంటి.? ప్రభుత్వం ఎలా వుంటుందో తెలియకపోవడమేంటి.? ఈ ప్రశ్నలు తలెత్తడం సహజమే.
మరి, దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు.? మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ తీస్తూ, ప్రజలకు ఎలాంటి సందేశాన్ని దర్శకుడు ఇవ్వాలనుకుంటున్నాడు.? ‘రిపబ్లిక్’ (Republic Movie Questions Government And People) సినిమా విడుదలయ్యేదాకా వేచి చూడాల్సిందే.