Revanth Reddy KCR Boothulu.. కేసీయార్, కేటీయార్, హరీష్ రావు కూడా బూతులే మాట్లాడారు.! రేవంత్ రెడ్డి కూడా బూతులే మాట్లాడుతున్నారు.! వింతేముంది.?
ఇక్కడ ఎవరూ తక్కువ కాదు.! ఒకర్ని మించి ఇంకొకరు.! చాలాకాలం క్రితం, అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబుపై అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారు.
అదే కొత్త కాదు.. అంతకు ముందూ రాజకీయ నాయకులు నోటి దురద ప్రదర్శించారు.. ఆ తర్వాత ఆ నోటి దురద సర్వసాధారణమైపోయింది.
చట్ట సభల్లో బూతుల్ని సామాన్యులు ‘లైవ్ టెలికాస్ట్’ సందర్భంగా చూడలేకపోతున్నారు. న్యూస్ ఛానళ్ళు, వాటిని పదే పదే ప్లే చేస్తూ, బూతు ఛానళ్ళుగా మారిపోయాయి.
Revanth Reddy KCR Boothulu.. బూతు రాజకీయం..
రాజకీయ నాయకులు పబ్లిక్ మీటింగుల్లోకి వస్తే, ఇక అంతే సంగతులు.! ఆ నాయకుడు, ఈ నాయకుడన్న తేడా లేదు. అందరిదీ ఒకటే బూతుల బాపతు.!
వాడు నాలుగు తిడితే, వీడు నలభై నాలుగు తిడతాడు. ఇదీ నేటి రాజకీయం.! ముందే చెప్పుకున్నట్లు, రాజకీయ నాయకులంతా.. బూతుల విషయంలో పోటీ పడుతున్నారు.

ప్రజలకు ఏం మంచి చేస్తున్నాం.? అన్నదానిపై తక్కువ మాట్లాడుతూ, ఎక్కువ బూతు పాండిత్యం చాటుకోవడమెలా.? అన్నదానిపై పీహెచ్‌డీలు చేసేస్తున్నారు రాజకీయ నాయకులు.
తాజాగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓ బహిరంగ సభలో, మాజీ ముఖ్యమంత్రి కేసీయార్ మీదా, మాజీ మంత్రి కేటీయార్ మీదా విమర్శలు చేస్తూ, వాడిన పద జాలం అత్యంత అసభ్యకరం.
రేవంత్ నోరు అదుపులో పెట్టుకోవాల్సిందే..
దాంతో, సహజంగానే గులాబీ పార్టీ నాయకులు గుస్సా అయ్యారు.. సీఎం రేవంత్ రెడ్డి మీద నోరు పారేసుకుంటున్నారు. మరి, కేసీయార్ సహా కేటీయార్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి.. వీళ్ళంతా చేసిందేంటి.?
వాళ్ళు తిట్టారు కాబట్టి, వీళ్ళు తిట్టడం సబబే.. అని ఎవరైనా అంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. ప్రజలు అన్నీ గమనిస్తారు.. సరైన సమయం వచ్చినప్పుడు, ఓటుతో సమాధానం చెప్తారు.
ముఖ్యమంత్రి పదవిలో వున్న రేవంత్ రెడ్డి, తన నోటిని అదుపులో పెట్టుకోవాల్సి వుందన్నది మాత్రం నిర్వివాదాంశం. అది ఆయన బాధ్యత.! సీఎం పదవికి ఆయన ఇచ్చుకునే గౌరవం అది.
