Table of Contents
వెబ్ సిరీస్.. కొత్త ఆలోచనలకి చాలా చక్కటి వేదిక. వెండితెరపై చెప్పలేని కొన్ని గొప్ప గొప్ప కథల్ని వెబ్ సిరీస్ ద్వారా అందంగా చెప్పొచ్చు. వెబ్ సిరీస్ అనగానే కేవలం ‘బూతు’ అనే భావన వుండడం సహజమే. అలా వెబ్ సిరీస్ వ్యవహారాన్ని మార్చేశారు కొందరు. కానీ, ‘కుడి ఎడమైతే’ (Review Kudi Yedamaithe Web Series) లాంటి వెబ్ సిరీస్ చూస్తే.. ఆ భావన తప్పని తేలుతుంది.
తీవ్రమైన మానసిక ఒత్తిడిలో వున్నప్పుడు, నిద్రలేమి సమస్య వెంటాడుతుంది. ఈ క్రమంలో కొన్ని పాడు కలలు వస్తుంటాయి. అవి భయపెడుతుంటాయి. కొన్నిసార్లు కలలో ఏం జరిగిందో, నిజ జీవితంలోనూ అలాగే జరుగుతుంటుంది. అది మన భావనే.. అంటారు మానసిక వైద్య నిపుణులు. ‘కుడి ఎడమైతే’ వెబ్ సిరీస్ కూడా కల, నిజమవడం గురించే.
Also Read: ‘తెర’ యెనక బాగోతం.!
కలలో జరిగిందే.. కానీ..
కలలో ఏం జరిగిందో, నిజ జీవితంలోనూ అదే జరుగుతుంటుంది. కానీ, ఒకే రోజు.. మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటుంది. అదీ ఒకరికి కాదు, ఇద్దరికి. కలలో వచ్చిందే నిజమవుతోందా.? లేదంటే, ఒక వ్యక్తికి రోజు మారడంలేదా.? అదే రోజు రిపీటవుతోందా.? ఇలా సతమతమవుతున్న ఆ ఇద్దరు వ్యక్తులు తారసపడితే ఏమవుతుంది.? ఆ ఇద్దరూ రెండు హత్యల్ని ఆపడానికి చేసే ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయి.? ఇవన్నీ తెరపై చూడాల్సిందే.
వెబ్ సిరీస్ చూడటానికి ఓపిక కావాలి. నిజమే, ఈ ‘కుడి ఎడమైతే’ చూడటానికి కూడా ఓపిక కావాలి. ఎందుకంటే, రిపీట్ సన్నివేశాలు అలా వుంటాయి. చూపించిందే.. మళ్ళీ మళ్ళీ చూపించారు. తప్పదు, ప్రేక్షకుడు మరింత గందరగోళంలోకి వెళ్ళిపోకూడదంటే ఆ రిపీట్ సీన్లు వుండాల్సిందే.
నిజానికి, ఇదొక ఔట్ ఆఫ్ ది బాక్స్ కంటెంట్. కాబట్టి, లాజిక్కులు వెతకడం సబబు కాదు. ఇలా జరుగుతుందా.? అని ఆశ్చర్యపోవడం తప్ప, చేయగలిగేదేమీ లేదు. ఓ పాయింటుని పట్టుకుని, కథగా మలచడమే చాలా కష్టం. స్క్రీన్ ప్లే మరింత కష్టం. దర్శకత్వం ఇంకా ఇంకా కష్టం. ప్రతి సన్నివేశం చూసే ప్రేక్షకుడికి ఎంత గందరగోళానికి గురిచేస్తుందో (Review Kudi Yedamaithe Web Series) అంతకన్నా ఎక్కువ గందరగోళం తీస్తున్నవారికీ వుంటుంది.
తడబడలేదు.. థ్రిల్ చేశారు..
కానీ, దర్శకుడు ఎక్కడా తడబడలేదు. ఏం తీయాలనుకున్నాడో, దాన్ని పక్కాగా తీసేశాడు. నటీనటులు కూడా ఎక్కడా గందరగోళానికి గురికాలేదు. హీరోయిన్ అమలా పాల్, పోలీస్ అధికారి పాత్రలో చాలా బాగా చేసింది. ఎక్కడా ‘అతి’ అన్న మాటకే ఆస్కారమివ్వలేదు. ఇప్పటిదాకా చేసింది తక్కువ సినిమాలే అయినా, రాహుల్ విజయ్.. చాలా టిపికల్ కాన్సెప్ట్‌కి ప్లస్ పాయింట్ అయ్యాడు తనదైన నటనతో.
Also Read: బూతు బాగోతం.. ఈ రోగానికి వ్యాక్సిన్ ఏదీ.?
నిజానికి, సినిమాలో ఎవరూ నటించలేదు, అందరూ తమ తమ పాత్రల్లో జీవించేశారు. సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్. ఆద్యంతం గందరగోళంగా వున్నా, అది కాన్సెప్ట్ ప్రభావం తప్ప, ఎడిటింగ్ తప్పిదం కాదు. చాలా క్రిస్పీగానే ఎడిటింగ్ చేశారని అనుకోవాలి. నేపథ్య సంగీతం సినిమాకి అదనపు బలం.
’కుడి ఎడమైతే’ మన జీవితంలో కూడా రిపీటైతే బావుండని, ప్రతి ప్రేక్షకుడూ అనుకుంటాడు.. దీన్ని చూశాక. తెలిసో తెలియకో చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి అవకాశం.. ఎవరు మాత్రం కోరుకోరు.? ‘యూ టర్న్’ వంటి విభిన్నమైన సినిమాలు తెరకెక్కించిన పవన్ కుమార్, వెబ్ సిరీస్ ‘కుడి ఎడమైతే’తో నిరాశపర్చలేదు, థ్రిల్ చేశాడు.
టైమ్ లూప్.. Review Kudi Yedamaithe Web Series
టైమ్ లూప్.. అనే అంశాన్ని బేస్ చేసుకుని, వెబ్ సిరీస్ మాత్రమే ఎందుకు చెయ్యాలి.? సినిమా ఎందుకు చెయ్యకూడదు.? అంటే, చెయ్యొచ్చు.. కానీ, సినిమాని ఇంత లెంగ్తీగా.. డిటెయిల్డ్‌గా చూపడం కష్టమవుతుందేమో.! బూతు లేదుగానీ, కొంత రక్తపాతం.. అక్కడక్కడా చివుక్కుమనిపిస్తుందంతే. ఓవరాల్‌గా ‘కుడి ఎడమైతే’, ఓ జెన్యన్ అటెంప్ట్.!
